Ayodhya: రికార్డు స్థాయిలో అయోధ్య హుండీ ఆదాయం.. 10 రోజుల్లో ఎంతంటే..
ABN, Publish Date - Feb 02 , 2024 | 12:31 PM
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య(Ayodhya) రాములవారి గుడికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి హుండీ ఆదాయంతో శ్రీ రాముడు పోటీ పడుతున్నాడని భక్తులు అంటున్నారు.
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య(Ayodhya) రాములవారి గుడికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి హుండీ ఆదాయంతో శ్రీ రాముడు పోటీ పడుతున్నాడని భక్తులు అంటున్నారు. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాములవారి ప్రాణ ప్రతిష్ఠ జరగ్గా.. గడిచిన 10 రోజుల్లో వచ్చిన ఆదాయం రికార్డు నెలకొల్పింది.
గత నెల 22 నుంచి ఫిబ్రవరి 1 వరకు 25 లక్షల మంది భక్తులు రామచంద్రుడిని దర్శించుకున్నట్లు అయోధ్య రామ జన్మ భూమి ట్రస్ట్ తెలిపింది. ఆలయానికి ఇప్పటివరకు రూ.11 కోట్లకుపైగా విరాళాలు సమకూరాయని ట్రస్ట్ వెల్లడించింది.
హుండీల్లో రూ.8 కోట్లు, చెక్కులు, ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా రూ.3 కోట్ల 50 లక్షలు విరాళాలు వచ్చాయన్నారు. దేవాలయ ప్రాంగణంలో భక్తులు కానుకలు ఇచ్చేందుకు 4 హుండీలను ఏర్పాటు చేశారు. నడకమార్గంలో వీటిని ఏర్పాటు చేశారు. ఇవే కాకుండా డిజిటల్ విరాళాలు అందించేందుకు 10 కంప్యూటరైజ్డ్ కౌంటర్లు ఉన్నాయి. చెక్కులు, ఇతర ఆన్‌లైన్ చెల్లింపు పద్ధతుల ద్వారా కానుకలు సమర్పించవచ్చు.
11 మంది బ్యాంకు ఉద్యోగులు, ముగ్గురు ఆలయ ట్రస్టు సిబ్బందితో సహా 14 మంది హుండీ కానుకలు లెక్కించారు. ఈ ప్రక్రియ పటిష్ట భద్రత మధ్య జరిగింది. చలిగాలులు తగ్గడంతో అయోధ్యకు రాబోయే భక్తుల సంఖ్య మరింతగా ఉంటుందని తద్వారా వచ్చే ఆదాయం కూడా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నారు.
నాన్‌స్టాప్ విమాన సేవలు..
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath), కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కలిసి ఇటీవల స్పైస్ జెట్ విమాన సేవల్ని ప్రారంభించారు. దర్బంగా, అహ్మదాబాద్, చెన్నై, జైపుర్, పట్నా, ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నుంచి అయోధ్యకు వచ్చే భక్తులకు స్పైస్ జెట్ నాన్ స్టాప్ సేవల్ని అందించనుంది.
Updated Date - Feb 02 , 2024 | 03:17 PM