Nitish Kumar: సంపదలో సీఎంను మించిపోయిన మంత్రులు
ABN, Publish Date - Jan 01 , 2024 | 02:49 PM
బీహార్ సీఎం నితీష్ కుమార్ సొంత ఆస్తుల విషయంలో తన డిప్యూటీ తేజస్వి యాదవ్ కంటే వెనుకబడ్డారు. ప్రతి సంవత్సరం చివరిరోజున సీఎం సహా కేబినెట్ మంత్రులంతా తమ ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించడం తప్పనిసరి. ఆ ప్రకారం సీఎం తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. ప్రస్తుతం ఆయన వద్ద రూ.22,552 నగదు ఉండగా, రూ.49,202 బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ల రూపంలో ఉన్నాయి.
పాట్నా: బీహార్ సీఎం నితీష్ కుమార్ (Nitish Kumar) సొంత ఆస్తుల విషయంలో తన డిప్యూటీ తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) కంటే వెనుకబడ్డారు. ప్రతి సంవత్సరం చివరిరోజున సీఎం సహా కేబినెట్ మంత్రులంతా తమ ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించడం తప్పనిసరి. ఆ ప్రకారం సీఎం తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. ప్రస్తుతం ఆయన వద్ద రూ.22,552 నగదు ఉండగా, రూ.49,202 బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. మొత్తం రూ.1.64 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. రూ.11.32 లక్షల విలువైన్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్స్ కారు, రూ.1.28 లక్షల విలువైన 2 బంగారు ఉంగరాలు, ఒక వెండి ఉంగరం, రూ.1.45 లక్షల విలువైన 13 ఆవులు, 10 దూడలు, ట్రెడ్‌మిల్, ఎక్స్‌ర్‌సైజ్ వీల్, ఒక మైక్రోవేవ్ ఓవెన్ వంటి చరాస్తులు ఉన్నాయి. సొంతంగా న్యూఢిల్లీలోని ద్వారకలో రెసిడెన్షియల్ ఫ్లాట్ ఉంది.
కాగా, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, ఆయన సోదరుడు, పర్యావరణ మంత్రి తేజ్ ప్రతాప్ కూడా తమ ఆస్తుల వివరాలు ప్రకటిచారు. తన వద్ద రూ.75,000 నగదు ఉందని తేజస్వి ప్రకటించారు. ఆయన భార్య భార్య రాజశ్రీ వద్ద రూ.1.25 లక్షల నగదు ఉంది. తేజస్వికి బ్యాంకుల్లో రూ.54 లక్షల డిపాజిట్లు ఉన్నాయి. తేజ్ ప్రతాప్ వద్ద రూ.1.7 లక్షల నగదు ఉంది. ఆయనకు సొంతంగా రూ.3.2 కోట్ల చర, స్థిరాస్తులు ఉన్నాయి. వీరితో పాటు ఆస్తుల వివరాలు ప్రకటించిన వారిలో ఆర్థిక మంత్రి విజయ్ కుమార్ చౌదరి, ఇంధన శాఖ మంత్రి రాజేంద్ర ప్రసాద్ యాదవ్, రెవెన్యూ, భూసంస్కరణల మంత్రి అలోక్ కుమార్ మెహతా, గ్రామీణాభివృద్ధి మంత్రి శరవణ్ కుమార్, భవన నిర్మాణ శాఖ మంత్రి అశోక్ చౌదరి, గనులు, భూగర్భ శాఖ మంత్రి సురేంద్ర ప్రసాద్ యాదవ్, సమాచార-ప్రసార శాఖ మంత్రి సంజయ్ కుమార్ ఝా, రవాణా శాఖ మంత్రి షీలా కుమార్ ఉన్నారు. వీరిలో పలువురు మంత్రుల సీఎం కంటే ఎక్కువ సంపద కలిగి ఉన్నారు.
Updated Date - Jan 01 , 2024 | 02:49 PM