లెబనాన్‌లో మళ్లీ పేలుళ్లు
ABN, Publish Date - Sep 19 , 2024 | 06:00 AM
పేజర్ల విస్ఫోటాలతో కల్లోలంగా మారిన లెబనాన్‌లో.. మరోమారు ఏకకాలంలో పేలుళ్లు సంభవించాయి. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో.. వాకీటాకీలు పేలిపోయాయి. ఈ పరికరాలన్నీ అయిదారు నెలల ముందు కొనుగోలు చేసినవే..! మంగళవారం నాటి ఘటనల్లో
నిన్న పేజర్లు.. నేడు వాకీటాకీలు
మళ్లీ పేలుళ్లు లెబనాన్‌లో ఇళ్లలో గృహోపకరణాల విస్ఫోటం
14 మంది దుర్మరణం.. 450 మందికి గాయాలు
దాడి జరిపిందెవరు? అన్నివేళ్లూ ఇజ్రాయెల్ వైపు
ఇజ్రాయెల్ మూల్యం చెల్లించక తప్పదు: ఇరాన్..
ప్రతీకారం తీర్చుకుంటాం: హిజ్బుల్లా
పేజర్లలో లిథియం అయాన్‌తోపాటు పీఈటీఎన్ పేలుడు పదార్థం వినియోగం
పేజర్ మైక్రోచిప్‌లో పీఈటీఎన్ ఆనవాళ్లు
మొస్సాద్ ఎక్కువగా వాడేది పీఈటీఎనే??
పేజర్లను తయారు చేసింది తైవాన్ కంపెనీ
పేలుళ్లకు పది సెకన్ల ముందు బల్క్ సందేశాలు
చదివే క్రమంలో హిజ్బుల్లా వర్గాలకు గాయాలు
ఒక కంటిని కోల్పోయిన ఇరాన్ రాయబారి
బీరుట్, సెప్టెంబరు 18: పేజర్ల విస్ఫోటాలతో కల్లోలంగా మారిన లెబనాన్‌లో.. మరోమారు ఏకకాలంలో పేలుళ్లు సంభవించాయి. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో.. వాకీటాకీలు పేలిపోయాయి. ఈ పరికరాలన్నీ అయిదారు నెలల ముందు కొనుగోలు చేసినవే..! మంగళవారం నాటి ఘటనల్లో మృతిచెందిన హిజ్బుల్లా నేతల అంత్యక్రియల్లో కూడా పేలుళ్లు సంభవించాయి. లెబనాన్ వ్యాప్తంగా జరిగిన వాకీటాకీ విస్ఫోటాల్లో 14 మంది మృతిచెందగా.. 300 మంది తీవ్రంగా గాయపడ్డారు. లెబనాన్ కాలమానం ప్రకారం.. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఏకకాలంలో బీరుట్ సహా.. దక్షిణ లెబనాన్ వరకు పేలుళ్లు సంభవించాయి. దక్షిణ లెబనాన్‌లోని దహియా, మౌంట్ లెబనాన్, సిడాన్, మార్జ్ ఆయున్, అల్-అజియా, అల్-సర్ఫాండ్, బెకా లోయలోని బాల్‌బెక్‌లో వీటి తీవ్రత ఎక్కువగా ఉందని లెబనాన్, ఇరాన్ మీడియా సంస్థలు వెల్లడించాయి. కొన్నిచోట్ల.. వాకీటాకీలు నడుముకు పెట్టుకుని, ద్విచక్రవాహనాలపై వెళ్తున్నవారు.. పేలుళ్ల ధాటికి చూస్తుండగానే అగ్నికి ఆహుతయ్యారని.. మరికొందరి మృతదేహాలు గుర్తించడానికి కూడా వీల్లేని విధంగా కాలిపోయాయని లెబనాన్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
ట్రాకింగ్‌కు దొరకొద్దనే..
ఇజ్రాయెల్ నిఘావర్గాలు మొబైల్ ఫోన్ సెల్‌టవర్ సిగ్నల్ ట్రాకింగ్, ట్యాపింగ్‌లతో పలువురు హిజ్బుల్లా నేతలను మట్టుబెట్టారు. దీంతో హిజ్బుల్లా సెల్‌ఫోన్లను కాకుండా.. పేజర్లు, వాకీటాకీలపై ఆధారపడింది. గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి తర్వాత.. పేజర్ల వినియోగాన్ని మరింతగా పెంచాయి. ఈ ఏడాది ఆరంభంలో తైవాన్‌కు చెందిన గోల్డ్ అపోలో అనే కంపెనీ నుంచి 5వేల వరకు పేజర్లను ఆర్డర్ చేశాయి. వాటిని ఇటీవలే హిజ్బుల్లా తమ ఫైటర్లకు అందజేసింది. కొత్తగా వాకీటాకీలను కొనుగోలు చేసింది. ఎఫ్‌ఎం సిగ్నల్ ట్యాంపరింగ్ పరికరాలతో కార్లలో, ఇళ్లలో వాడే ఎఫ్‌ఎం పరికరాల్లోకి చొరబడి, తమ సందేశాలను పౌరులకు చేరవేస్తోందనే వాదనలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రత్యామ్నాయాలే హిజ్బుల్లా పాలిట మృత్యువుగా మారుతున్నాయి. పేజర్లు, వాకీటాకీలు పేలి.. మరణాలు సంభవించాయి.
పేజర్లలో పేలుడు చిప్
మంగళవారం జరిగిన దాడిలో 3 వేల వరకు పేజర్లు పేలిపోయినట్లు హిజ్బుల్లా వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. మిగతా వాటిని పరిశీలిస్తే.. అన్నింటిలో లిథియం అయాన్ బ్యాటరీలతోపాటు.. పేజర్ సర్క్యూట్‌తో సంబంధం లేని ఓ మైక్రోచిప్ కనిపించిందని, అందులో పీఈటీఎన్ పేలుడు పదార్థం ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నాయి. దీన్ని బట్టి ఈ దాడిని దీర్ఘకాలిక వ్యూహాత్మక కుట్ర అని ఆరోపిస్తున్నాయి. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్‌పై నింద మోపుతూ.. ఆ దేశంపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించాయి. మరోవైపు ఈ ఆల్ఫా-న్యూమరిక్ పేజర్లను తయారు చేసిన తైవాన్ కంపెనీ గోల్డ్ అపోలో మాత్రం తమకేపాపం తెలియదని ప్రకటన చేసింది. బీఏసీ అనే హంగరీ దేశ కంపెనీ ఏఆర్ 924 మోడల్ పేజర్లను తయారు చేస్తుందని, తాము బ్రాండింగ్ మాత్రమే ఇస్తామని పేర్కొంది. అయితే.. హంగరిలోని బీఏసీ చిరునామాలో నిర్మాణంలో ఉన్న ఓ ఇల్లు మాత్రమే ఉందని, అది షెల్ కంపెనీ అయ్యి ఉంటుందని రాయిటర్స్ తెలిపింది. హిజ్బుల్లా వర్గాలు, లెబనాన్ సర్కారు మాత్రం.. పేజర్ల తయారీ సమయంలోనే అనుమానాస్పద మైక్రోచి్‌పను పెట్టి ఉంటారని, లేదంటే.. తైవాన్ నుంచి వాటి రవాణా సమయంలో పీఈటీఎన్ పేలుడు పదార్థాన్ని అమర్చి ఉంటారని చెబుతున్నాయి. పీఈటీఎన్ పేలుడు పదార్థాన్ని విరివిగా వినియోగించే చరిత్ర ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్‌కు ఉందని గుర్తుచేస్తున్నాయి. కాగా.. మంగళవారం నాటి పేలుళ్ల ఘటనల్లో మృతుల సంఖ్య 12కు చేరుకుందని లెబనాన్ ఆరోగ్య మంత్రి ఫెరాస్ అల్ అబిద్ వెల్లడించారు.
తీవ్రత ఎక్కువే..!
పీఈటీఎన్ పేలుడు పదార్థం తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని బాంబు నిపుణులు చెబుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3.45 సమయంలో(లెబనాన్ కాలమానం ప్రకారం) మూకుమ్మడిగా పేలుళ్లు జరిగాయి. అంతకు 10 సెకన్ల ముందు అన్ని పేజర్లకు ఒకేసారి సందేశాలు వచ్చాయి. వాటిని చదువుదామని పేజర్లను ముఖానికి దగ్గరగా తీసుకున్న వారికి తీవ్ర గాయాలైనట్లు లెబనాన్ వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంతోనే.. లెబనాన్‌లో ఇరాన్ రాయబారి ముజ్తబా అమానీ ఒక కంటిని పోగొట్టుకున్నారని, రెండో కన్ను తీవ్రంగా దెబ్బతిన్నదని పేర్కొన్నాయి. తొలుత అంతా మాల్‌వేర్ ప్రభావంతో ఏకకాలంలో పేలుళ్లు జరిగినట్లు భావించినా.. పేజర్లలో ఉండే కొద్దిపాటి మెమొరీకి మాల్‌వేర్ స్టోరేజీ సామర్థ్యం ఉండదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పేజర్ల తయారీ సమయంలో.. లేదా రవాణా సమయంలోనే పేలుడు పదార్థంతోపాటు.. టైమర్‌లో ప్రోగ్రామింగ్ చేసి ఉంటారని వివరిస్తున్నారు.
హిజ్బుల్లాకు భారీ నష్టం..!
12 మంది మృతుల్లో ఇద్దరు చిన్నారులను మినహాయిస్తే.. మిగతా వారంతా హిజ్బుల్లా నాయకులే..! వారి ఫొటోలను హిజ్బుల్లా బుధవారం ఉదయం తన అధికారిక టెలిగ్రామ్ చానల్‌లో విడుదల చేసింది. బుధవారం నాటి మరణాల్లోనూ నలుగురైదుగురు హిజ్బుల్లా నేతలున్నాయి. మిగతా వారిలో సానుభూతిపరులున్నారు. రెండు ఘటనల్లో.. 3,300 మందికి పైగా క్షతగాత్రల్లోనూ హిజ్బుల్లా ఫైటర్లు, సానుభూతిపరులు, నాయకులు ఉన్నారు. పేజర్ బాంబుల వల్ల చాలా మందికి కళ్లు, తల భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. దీన్ని బట్టి హిజ్బుల్లా ఇప్పట్లో కోలుకునే సూచనలు కనిపించడం లేదు.
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత!
పేజర్ బాంబుల ఘటనతో పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంటోంది. ప్రతీకారం తీర్చుకుంటామని హిజ్బుల్లా ఇప్పటికే ప్రకటించగా.. ఇరాన్ కూడా అలాంటి శపథమే చేసింది. తమ రాయబారిపై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని.. ప్రతిస్పందనకు సిద్ధపడుతామని హెచ్చరించింది. ఈజిప్టు అధ్యక్షుడు ఫతాహ్ ఎల్‌సిసీ కూడా బుధవారం కైరోలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌తో చర్చలు జరిపిన సందర్భంలో ‘ఆపరేషన్ తెనెటీగలు’పై మాట్లాడారు. తాము లెబనాన్‌కు అండగా ఉంటామని పేర్కొన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్‌స హిజ్బుల్లాతో యుద్ధాన్ని తీవ్రతరం చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
కొత్త మోడల్ వాకీటాకీలే
కొత్తగా తెప్పించిన పేజర్లు మంగళవారం పేలిపోయినట్లుగానే.. ఐదారు నెలల క్రితం హిజ్బుల్లా వర్గాలు తెప్పించిన ఐకామ్ కంపెనీకి చెందిన వీ82ఎస్ మోడల్ వాకీటాకీలు బుధవారం విస్ఫోటం చెందాయని అల్-జజీరా కథనాలను ప్రసారం చేసింది. బీరుట్‌లో.. ఒక్క దహియా ప్రాంతంలోనే 15-20 పేలుళ్లు సంభవించి, పలు అపార్ట్‌మెంట్లు, ఇళ్లు దెబ్బతిన్నట్లు పేర్కొంది. దహియాలో.. హిజ్బుల్లా ఎంపీ అలీఅమర్ కుమారుడి అంత్యక్రియల్లోనూ పేలుళ్లు సంభవించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Updated Date - Sep 19 , 2024 | 07:03 AM