Gyanvapi Mosque: జ్ఞానవాపి సర్వే నివేదికపై కోర్టు కీలక ఆదేశం
ABN, Publish Date - Jan 24 , 2024 | 05:30 PM
జ్ఞానవాపి మసీదు సర్వే నివేదికపై వారణాసి జిల్లా కోర్టు బుధవారంనాడు కీలక ఆదేశాలిచ్చింది. సర్వే నివేదిక హార్డ్ కాపీని పిటిషనర్లు, కేసు సంబంధీకులకు అందజేయాలని పేర్కొంది. అయితే నివేదక ప్రతిని మాత్రం తర్వాత బహిరంగం చేస్తారు.
వారణాసి: జ్ఞానవాపి మసీదు (Gyanvapi mosque) సర్వే నివేదికపై వారణాసి జిల్లా కోర్టు బుధవారంనాడు కీలక ఆదేశాలిచ్చింది. సర్వే నివేదిక హార్డ్ కాపీని పిటిషనర్లు, కేసు సంబంధీకులకు అందజేయాలని పేర్కొంది. అయితే నివేదక ప్రతిని మాత్రం తర్వాత బహిరంగం చేస్తారు.
నెలరోజుల క్రితం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తమ నివేదికను సీల్ వేసిన కవర్‌లో కోర్టుకు అందజేసింది. దీనిపై కోర్టు బుధవారంనాడు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కోర్టు ఉత్తర్వు సాయంత్రానికి అందుతుంది. అనంతరం సంబంధిత పార్టీలు కోర్టుకు దరఖాస్తు చేసుకోవాలి. సర్వే నివేదికను ఫోటోకాపీ తీసి వారికి అందిస్తారు. కాగా, జ్ఞానవాసి కేసులో ఏఎస్ఐ నివేదక కీలకం కానుంది. హిందూ ఆలయంపై మసీదు కట్టారని హిందూ వర్గాల వాదనగా ఉంది. దీనిని ముస్లిం వర్గాలు తోసిపుచ్చుతున్నాయి. వాజుఖానా ప్రాంతంలో ఒక శివలింగం దొరికిందని, గతంలో ఇక్కడ దేవాలయం ఉందనడానికి ఇది నిదర్శనమని హిందూ వర్గం వాదిస్తుండగా, అది శివలింగం కాదని, పౌంటైన్ అని మసీదు కమిటీ వాదనగా ఉంది. దీనిపై జ్ఞానవాపి మసీదు ఆవరణలో గత ఆగస్టు 4న ఏఎస్ఐ సర్వే నిర్వహించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీల్ వేసిన వాజుఖానా ఏరియా మినహా మిగతా ప్రాంతంలో ఏఎస్ఐ సర్వే సాగింది.
Updated Date - Jan 24 , 2024 | 05:30 PM