Jharkhand Floor test: బలపరీక్షకు హాజరుకానున్న హేమంత్ సోరెన్... కోర్టు అనుమతి
ABN, Publish Date - Feb 03 , 2024 | 05:09 PM
జార్ఖాండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఈడీ అరెస్టుతో బిర్సా ముండా జైలులో ఉన్న హేమంత్ సోరెన్‌కు ఊరట లభించింది. జేఎంఎం కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంపయి సోరెన్ ఈనెల 5న అసెంబ్లీలో బలనిరూపణ చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగే ఓటింగ్‌కు హాజరయ్యేందుకు హేమంత్ సోరెన్‌ను రాంచీ ప్రత్యేక కోర్టు అనుమతించింది.
రాంచీ: అనూహ్య పరిణామాల మధ్య జార్ఖాండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఈడీ అరెస్టుతో బిర్సా ముండా జైలులో ఉన్న హేమంత్ సోరెన్ (Hemant Soren)కు ఊరట లభించింది. జేఎంఎం కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంపయి సోరెన్ ఈనెల 5న అసెంబ్లీలో బలనిరూపణ చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగే ఓటింగ్‌కు హాజరయ్యేందుకు హేమంత్ సోరెన్‌ను రాంచీ ప్రత్యేక కోర్టు అనుమతించింది.
ప్రభుత్వ బలపరీక్షలో పాల్గొనేందుకు తనను అనుమతించాలంటూ హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్‌పై శనివారంనాడు విచారణ సందర్భంగా ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిని హేమంత్ సోరెన్ తరఫున వాదిస్తున్న అడ్వకేట్ జనరల్ తప్పుపట్టారు. హేమంత్ సోరెన్‌ను అనుమతించరాదన్న ఈడీ చర్య వెనుక ప్రభుత్వాన్ని కుప్పకూల్చడమే ప్రధాన ఉద్దేశం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్నా్రు. ఓటింగ్‌కు ఒక ఎమ్మెల్యేను హాజరుకాకుండా చేయడం ద్వారా ప్రభుత్వాన్ని దించాలనుకుంటోందన్నారు. ఈ ప్రక్రియ మొత్తం అప్రతిష్టపాలు చేసేందుకు ఉద్దేశించినదేనని తాము మొదట్నించీ చెబుతూనే ఉన్నామని అన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న ప్రత్యేక కోర్టు ప్రభుత్వ బలపరీక్షలో పాల్గొనేందుకు హేమంత్ సోరెన్‌ను అనుమతిస్తున్నట్టు ప్రకటించింది. ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం 11 గంటలకు ఫ్లోర్ టెస్ట్ మొదలై, ఓటింగ్ ముగిసేంత వరకూ హేమంత్‌ను అనుమతిస్తున్నట్టు తెలిపింది.
బలాబలాలు
జార్ఖాండ్ అసెంబ్లీలో 81 మంది సభ్యులు ఉండగా, జార్ఖాండ్ ముక్తి మోర్చాకు 29 మంది సభ్యుల బలం ఉంది. జేఎంఎం భాగస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్‌కు 17, ఆర్జేడీ, సీపీఐఎంఎల్‌కు ఒక్కో సభ్యుడు ఉన్నారు. మెజారిటీకి 41 మంది ఎమ్మెల్యేల బలం కావాలి. జేఎంపీ కూటమి తమకు 43 మంది ఎమ్మెల్యేల మద్దతున్నట్టు ప్రకటించింది.
Updated Date - Feb 03 , 2024 | 05:09 PM