Jharkhand: సోరెన్ భార్యకు సీఎం పగ్గాలు.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Jan 01 , 2024 | 08:26 PM
మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా చేసి తన భార్య కల్పన సోరెన్ ను సీఎం పీఠంపై కూర్చోబెట్టనున్నారా? అవునంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సోమవారంనాడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాంచీ: మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ (Jarkhand) ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) రాజీనామా చేసి తన భార్య కల్పన సోరెన్ (Kalpana Soren)ను సీఎం పీఠంపై కూర్చోబెట్టనున్నారా? అవునంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే (Nishikant Dubey) సోమవారంనాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేస్తూ, జేఎంఎం ఎమ్మెల్యే సర్ఫరాజ్ అహ్మద్ తన పదవికి రాజీనామా చేశారని, దానిని సీఎం ఆమోదించారని తెలిపారు. సోరెన్ సైతం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారని, ఆయన భార్య కల్పన సోరెన్ జార్ఖండ్ తదుపరి సీఎం కానున్నారని అందులో పేర్కొన్నారు.
సోరెన్‌పై కేసు ఏమిటి?
అక్రమ మైనింగ్ వ్యవహారంలో సంబంధం ఉన్న ఆరోపణలపై మనీలాండరింగ్ కేసు కింద సోరెన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో డిసెంబర్ 30న ఈడీ ఆయనకు లెటర్-కమ్-సమన్లు పంపింది. మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు అందుబాటులో ఉండే సమయం చెప్పాలని ఈడీ ఆయనను కోరింది. ఈ కేసులో ఈడీ ఆయనకు సమన్లు పంపడం ఇది ఏడోసారి. అయితే ఇంతవరకూ ఆయన ఈడీ ముందు హాజరుకాలేదు. ఆగస్టు 14న ఈడీ తొలి నోటీసు ఇవ్వగా ఈడీ చర్యల నుంచి ప్రొటక్షన్ కోరుతూ సుప్రీంకోర్టు ముందు, ఆ తర్వాత జార్ఖండ్ హైకోర్టు ముందు ఆయన పిటిషన్ వేశారు. అయితే ఆయన పిటిషన్లను హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టివేశాయి. తప్పుడు అభియోగాలు, ఉద్దేశాలతో తనకు సమన్లు పంపారని, జార్ఖండ్‌లో అనిశ్చితి సృష్టించడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని సోరెన్ అంటున్నారు. ఈ కేసులో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా, రాంచీ డిప్యూటీ కమిషనర్‌గా గతంలో పనిచేసిన 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఛావి రంజన్‌తో సహా 14 మందిని ఈడీ అరెస్టు చేసింది.
Updated Date - Jan 01 , 2024 | 08:29 PM