Delhi: ఏఐతో బీజేపీ ఎన్నికల ప్రచారం.. ప్రధాని మోదీ ప్రసంగం ఇక నచ్చిన భాషలో
ABN, Publish Date - Mar 06 , 2024 | 05:54 PM
సాంకేతికతను వినియోగించుకోవడంలో ఎప్పుడూ ముందుండే బీజేపీ(BJP).. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ద్వారా ఓటర్లకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో 370 స్థానాలను గెలుచుకోవాలనే తపనతో ఉన్న ఆ పార్టీ.. దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి సారించింది.
ఢిల్లీ: సాంకేతికతను వినియోగించుకోవడంలో ఎప్పుడూ ముందుండే బీజేపీ(BJP).. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ద్వారా ఓటర్లకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో 370 స్థానాలను గెలుచుకోవాలనే తపనతో ఉన్న ఆ పార్టీ.. దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి సారించింది. 2019 ఎన్నికల్లో బీజేపీ సాధారణంగా ప్రభావం చూపించిన రాష్ట్రాల్లో ఈ సారి ఎలాగైనా పట్టు సాధించాలని ఆ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ(PM Modi) ఎక్కడ ప్రసంగించినా.. కొన్ని రాష్ట్రాల మాతృ భాషలోకి ఆయన ప్రసంగాన్ని అనువాదించడానికి బీజేపీ ఏర్పాట్లు చేసింది.
మోదీ ప్రసంగాలను కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ, ఒడియా, పంజాబీ, మరాఠీ భాషల్లోకి అనువదించడం ప్రారంభించింది. 2019 ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లోని 129 లోక్‌సభ స్థానాల్లో (పుదుచ్చేరితో కలిపి 130) బీజేపీ కేవలం 29 మాత్రమే గెలుచుకుంది. వీటిలో ఎక్కువ కర్ణాటక నుంచి వచ్చాయి. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తరువాత తెలంగాణలోనూ బీజేపీ గణనీయంగా ప్రభావం చూపింది. ప్రస్తుతం ఇక్కడా కాంగ్రెస్ అధికారంలో ఉంది.
దీంతో ఆయా రాష్ట్రాల ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రసంగాలను అనువాదించి.. ప్రజల్లోకి తీసుకెళ్తోంది. గతేడాది డిసెంబర్‌లో కాశీ తమిళ సంగమం సందర్భంగా మోదీ ప్రసంగాన్ని తమిళంలోకి అనువాదించారు. 2019లో మహారాష్ట్రలో బీజేపీ 23 సీట్లు గెలుచుకోగా, దాని మిత్రపక్షమైన శివసేన 18 స్థానాల్లో విజయం సాధించింది. బెంగాల్‌లోని 42 సీట్లలో 18 సీట్లు గెలుచుకుంది.
ఒడిశాలోని 21 స్థానాల్లో 8, పంజాబ్‌లోని 13 స్థానాల్లో 2 కైవసం చేసుకుంది. అనువాదించిన ప్రసంగాలు @NaMoInBengali, @NamoinKannada, @NaMoinTamil, @NaMoinTelugu, @NaMoinMarathiతో సహా ఇతరాలు Xలోని సంబంధిత హ్యాండిల్స్‌లో అందుబాటులో ఉంటాయి. ఇలా 8 భాషల్లోకి ప్రసంగాన్ని ట్రాన్స్‌లెట్ చేస్తున్నారు. టెక్నాలజీని వాడుకోవడంలో బీజేపీ ఎప్పడూ టాప్‌లోనే ఉంటుంది. 2014 ఎన్నికల నుంచి బీజేపీ ఐటీ సెల్ మోదీ చరిష్మాను ప్రజల్లోకి పంపడంలో కీలకంగా వ్యవహరించింది.
బీజేపీ సందేశాలు ప్రతి ఓటరుకు చేరువయ్యేలా ఈ సెల్ పని చేసింది. పార్టీ డేటాబేస్‌లను రూపొందించడానికి, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఎన్నుకోవడానికి నమో యాప్‌ని రూపొందించింది. డొనేషన్ ఫర్ నేషన్ బిల్డింగ్ క్యాంపెయిన్ కింద పార్టీ కోసం విరాళాలు సేకరించేందుకు కూడా ఈ యాప్‌ని ఉపయోగిస్తోంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 06 , 2024 | 06:03 PM