రాజ్యసభ ఎన్నికల్లో హైడ్రామా!
ABN, Publish Date - Feb 28 , 2024 | 03:02 AM
మూడు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు అత్యంత ఉత్కంఠ భరితంగా సాగాయి. ఉత్తరప్రదేశ్‌లో 10, కర్ణాటకలో 4, హిమాచల్ ప్రదేశ్‌లో ఒక రాజ్యసభ స్థానానికి మంగళవారం పోలింగ్ నిర్వహించారు.
మూడు రాష్ట్రాల్లోనూ క్రాస్ ఓటింగ్
కర్ణాటకలో బీజేపీ-జేడీఎ్‌సకు ఎదురుదెబ్బ
ఉమ్మడి అభ్యర్థి కుపేంద్ర రెడ్డి పరాజయం
3 స్థానాలు ‘హస్త’గతం.. కమలానికి ఒకటే
హిమాచల్‌లో కాంగ్రెస్ నేత సింఘ్వీ ఓటమి
సమానంగా ఓట్లు.. ‘డ్రా’లో బీజేపీదే అదృష్టం
9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్!
అవిశ్వాస తీర్మానం పెట్టే ప్రయత్నాల్లో బీజేపీ
మా ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారు: సీఎం సుఖు
కాంగ్రెస్ అప్రమత్తం.. నేడు సిమ్లాకు డీకే
యూపీలో కమలానికి దక్కిన అదనపు సీటు
బీజేపీకి 8.. సమాజ్‌వాదీ పార్టీకి రెండు సీట్లే!
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: మూడు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు అత్యంత ఉత్కంఠ భరితంగా సాగాయి. ఉత్తరప్రదేశ్‌లో 10, కర్ణాటకలో 4, హిమాచల్ ప్రదేశ్‌లో ఒక రాజ్యసభ స్థానానికి మంగళవారం పోలింగ్ నిర్వహించారు. కర్ణాటకలో బీజేపీ-జేడీఎ్‌సకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఓడిపోయారు. హిమాచల్‌లో అధికార కాంగ్రె్‌సకు చుక్కెదురైంది. క్రాస్ ఓటింగ్‌తో ఆ పార్టీ ప్రముఖ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ ఓటమి చవిచూశారు. ఉత్తరప్రదేశ్‌లోనూ పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఎస్పీ ఎమ్మెల్యేల కారస్ ఓటింగ్‌తో బీజేపీ అదనంగా మరో స్థానం గెలుచుకోగలిగింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ఎల్.మురుగన్ సహా 41 మంది అభ్యర్థులు ఈ నెల 20న వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. మిగిలిన స్థానాలకు మంగళవారం ఓటింగ్ జరిగింది. కర్ణాటకలో అధికార కాంగ్రెస్ మూడు స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించింది. నాలుగో స్థానం కోసం బరిలోకి దిగిన బీజేపీ-జేడీఎస్ ఉమ్మడి అభ్యర్థి, పారిశ్రామికవేత్త కుపేంద్రరెడ్డి ఓటమిపాలయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే ఎస్‌టీ సోమశేఖర్ కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకన్‌కు క్రాస్ ఓటింగ్ చేశారు. హిమాచల్‌లో రోజంతా హైడ్రామా సాగింది. కాంగ్రె్‌సకు 45 మంది, బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉండగా, మరో ముగ్గురు ఇండిపెండెంట్లు. మొత్తం 68 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ, బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్‌కు సమానంగా చెరో 34 ఓట్లు వచ్చాయి. దీంతో డ్రా తీయగా విజయం మహాజన్‌ను వరించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 9 మంది బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసినట్టు ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్‌లో 10 రాజ్యసభ సీట్లకు ఎన్నిక జరగ్గా.. ప్రస్తుత బలాల్ని బట్టి బీజేపీ 7, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) 3 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. కానీ, బీజేపీ ఎనిమిదో అభ్యర్థిని బరిలో నిలిపి.. పోటీని ఆసక్తికరంగా మార్చింది. ఎస్పీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతో కమలం పార్టీ 8 సీట్లు గెలుచుకోగలిగింది. ఎస్పీకి 2 సీట్లే దక్కాయి. పార్టీ సోమవారం నిర్వహించిన సమావేశానికి 8 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం గమనార్హం.
మా ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారు: సుఖ్వీందర్
తాజా ఓటమి దరిమిలా హిమాచల్‌లో కాంగ్రెస్ సర్కారు మైనారిటీలో పడిపోయిందని, అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని బీజేపీ భావిస్తోంది. రాష్ట్ర బీజేపీ నాయకుడు జైరామ్ ఠాకూర్ బుధవారం ఉదయం గవర్నర్‌ను కలుసుకోవాలని నిర్ణయించడం ఆసక్తి రేపుతోది. దీంతో హుటాహుటిన హిమాచల్‌కు పార్టీ పరిశీలకుడిగా ‘ట్రబుల్‌షూటర్’ డీకే శివకుమార్‌ను పంపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆయన బుధవారం నాడే సిమ్లా చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది. తమ ఎమ్మెల్యేలు ఐదారుగుర్ని ‘కిడ్నాప్’ చేశారని హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు సంచలన ఆరోపణలు చేశారు. సీఆర్‌పీఎ్‌ఫతో పాటు హరియాణా పోలీసులు వారిని తీసుకెళ్లిపోయారన్నారు. బీజేపీ గూండాయిజానికి పాల్పడుతోందని, జైరాం ఠాకుర్ పదే పదే కౌంటింగ్ హాలులోకి వచ్చి అధికారులను బెదిరించారని ఆరోపించారు.
బీజేపీ-జేడీఎ్‌సకు రెండో ఓటమి!
బెంగళూరు: కర్ణాటక రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముగ్గురూ విజయం సాధించడంతో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ ఎంత ప్రలోభపెట్టినా లొంగకుండా కాంగ్రె్‌సపై విధేయతను చాటుకున్నారని ప్రశంసించారు. మరోవైపు, లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన రెండు ఎన్నికల్లోనూ బీజేపీ-జేడీఎస్ కూటమి పరాజయాలను మూటగట్టుకుంది. ఇటీవల జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లోనూ ఉమ్మడి అభ్యర్థులు ఓడిపోయారు.
Updated Date - Feb 28 , 2024 | 03:16 AM