I.N.D.I.A. alliance: ఇండియా కూటమి వర్చువల్ మీట్.. నితీష్‌ను కన్వీనర్‌గా ప్రకటించే అవకాశం
ABN, Publish Date - Jan 02 , 2024 | 02:16 PM
విపక్ష ఇండియా కూటమిపై జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ అసంతృప్తితో ఉన్నారనే ఊహాగానాల నడుమ కూటమి వర్చువల్ మీట్ ఈనెల 3న జరుగనుంది. ఈ సమావేశంలో నితీష్ కుమార్ పేరును కూటమి కన్వీనర్‌గా కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రతిపాదించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల సమాచారం.
న్యూఢిల్లీ: విపక్ష ఇండియా (I.N.D.I.A.) కూటమిపై జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ (Nitish Kumar) అసంతృప్తితో ఉన్నారనే ఊహాగానాల నడుమ కూటమి వర్చువల్ మీట్ ఈనెల 3న జరుగనుంది. ఈ సమావేశంలో నితీష్ కుమార్ పేరును కూటమి కన్వీనర్‌గా కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రతిపాదించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల సమాచారం. జూమ్ మీటింగ్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా పలువురు కీలక నేతలు పాల్గోనున్నారు. కూటమి ప్రధాన పార్టీల జాతీయ అధ్యక్షులు కూడా ఈ వర్చువల్ మీట్‌లో పాల్గొంటారు.
నేతల అభిప్రాయాల సేకరణ
నితీష్‌ను కూటమి కన్వీనర్‌గా ప్రకటించే విషయంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ అభిప్రాయాలు తీసుకుందని, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరేతో ఇప్పటికే సంప్రందిపులు జరిపిందని తెలుస్తోంది. ఇండియా కూటమి నాలుగో సమావేశం న్యూఢిల్లీలో జరిగిన అనంతరం నితీష్ మనస్తాపానికి గురయ్యారనే ప్రచారం జరిగింది. ప్రధానమంత్రి అభ్యర్థిగా తన పేరును ప్రతిపాదిస్తారని నితీష్ భావించారని, అందుకు భిన్నంగా మల్లికార్జున్ పేరును మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించడం ఆయనను అసంతృప్తికి గురిచేసిందని అంటున్నారు. సమావేశానంతరం కూడా నితీష్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఏమాత్రం సంతోషంగా కనిపించలేదని చెబుతున్నారు. కాగా, ఇండియా కూటమి ఇంతవరకూ నాలుగు సార్లు సమావేశమైంది. తొలి సమావేశం పాట్నాలో జూన్ 23న, రెండో సమావేశం బెంగళూరులో జూలై 17-18న, మూడో సమావేశం ముంబైలో ఆగస్టు 31-సెప్టెంబర్ 1న, నాలుగో సమావేశం గత డిసెంబర్ 19న జరిగాయి.
ఏప్రిల్, మేలో సార్వత్రిక ఎన్నికలు
కాగా, 18వ లోక్‌సభ ఎన్నికలు ఈ ఏడాది ఏప్రిల్-మే మాసాల్లో జరిగే అవకాశం ఉంది. జూన్ చివరికల్లా 17వ లోక్‌సభ గడువు తీరనుంది. గత లోక్‌సభ ఎన్నికలు 2019 ఏప్రిల్-మేలో జరిగాయి. బీజేపీ సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టారు.
Updated Date - Jan 02 , 2024 | 02:16 PM