Space Station: 2035 నాటికి భారత్ సొంత స్పేస్ స్టేషన్‌ను కలిగి ఉంటుంది.. ప్రధాని మోదీ ప్రకటన
ABN, Publish Date - Feb 27 , 2024 | 03:52 PM
మన భారతదేశం 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని (Space Station) కలిగి ఉంటుందని, ఇది అంతరిక్షంలో ఎన్నో అధ్యయనాలు చేసేందుకు సహాయపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) చెప్పారు. అలాగే.. భారత వ్యోమగామి మన సొంత రాకెట్‌లోనే చంద్రుని ఉపరితలంపై దిగుతారని నమ్మకం వెలిబుచ్చారు.
మన భారతదేశం 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని (Space Station) కలిగి ఉంటుందని, ఇది అంతరిక్షంలో ఎన్నో అధ్యయనాలు చేసేందుకు సహాయపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) చెప్పారు. అలాగే.. భారత వ్యోమగామి మన సొంత రాకెట్‌లోనే చంద్రుని ఉపరితలంపై దిగుతారని నమ్మకం వెలిబుచ్చారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో (Vikram Sarabhai Space Centre) జరిగిన సభలో మోదీ ప్రసంగిస్తూ.. ‘‘2035 నాటికి భారత్ సొంత స్పేస్ స్టేషన్‌ను కలిగి ఉంటుంది. ఇది స్పేస్‌లో అధ్యయనాలు చేయడంలో సహాయపడుతుంది. ఈ అమృత్‌కాల్ కాలంలో.. భారతీయ వ్యోమగామి మన సొంత రాకెట్‌లో చంద్రునిపై కాలుమోపుతారు’’ అని చెప్పారు.
21వ శతాబ్దంలో భారతదేశం డైనమిక్ గ్లోబల్ ప్లేయర్‌గా ఎదుగుతోందని, అన్ని రంగాల్లోనూ గణనీయమైన పురోగతిని ప్రదర్శిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. తన శక్తితో భారత్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోందని, గత పదేళ్లలో సుమారు 400 ఉపగ్రహాలను ప్రయోగించామని అన్నారు. కానీ.. అంతకుముందు పదేళ్ల కాలంలో కేవలం 33 ఉపగ్రహాలనే ప్రయోగించారని గుర్తు చేశారు. ఇదే సమయంలో.. గగన్‌యాన్ మిషన్‌లో ఉపయోగించే చాలా పరికరాలు భారత్‌లోనే తయారు చేయబడతాయని తెలిసి తాను చాలా సంతోషించానని చెప్పారు. ప్రపంచంలో భారత్ మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తున్న సమయంలోనే గగన్‌యాన్ మిషన్ చోటు చేసుకోవడం గొప్ప యాదృచ్ఛికమని తెలిపారు. ఈ మిషన్ మన అంతరిక్ష రంగాన్ని కొత్త ఎత్తుకు తీసుకెళ్తుందని అభిప్రాయపడ్డారు.
2024-25లో ప్రయోగించనున్న భారతదేశ తొలి మానవ అంతరిక్ష విమాన కార్యక్రమం గగన్‌యాన్‌లో (Gaganyaan) భాగమైన నలుగురు వ్యోమగాముల పేర్లను కూడా ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రశాంత్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, శుభాంశు శుక్లా ఈ మిషన్‌కు ఎంపికయ్యారని.. ఈ నలుగురు వ్యోమగాములు రష్యాలోని యూరి గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పొందారని వెల్లడించారు. ఈ నలుగురు వ్యోమగాముల్ని కలిసి, వారిని దేశానికి ప్రెజెంట్ చేసే భాగ్యం కలిగినందుకు తాను సంతోషంగా ఉన్నానన్నారు. వీళ్లు 140 కోట్ల ప్రజల ఆకాంక్షల్ని తీసుకొని అంతరిక్షంలోకి వెళ్లనున్నారన్నారు. అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన విజయం.. దేశంలోని యువ తరంలో శాస్త్రీయ దృక్పథ బీజాల్ని నాటుతోందని మోదీ చెప్పుకొచ్చారు.
Updated Date - Feb 27 , 2024 | 03:52 PM