Mallikarjuna Kharge: ఇలాంటి పిరికివాళ్లుంటే.. ప్రజాస్వామ్యం ఎలా మనుగుడ సాగిస్తుంది?
ABN, Publish Date - Jan 30 , 2024 | 04:31 PM
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇటీవల ‘ఇండియా’ కూటమి నుంచి వైదొలగడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతలకు కేంద్ర దర్యాప్తు సంస్థలు నోటీసులు అందిస్తున్న నేపథ్యంలోనే ఆయన భయంతో కూటమి నుంచి వాకౌట్ చేశారని విమర్శించారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇటీవల ‘ఇండియా’ కూటమి నుంచి వైదొలగడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేతలకు కేంద్ర దర్యాప్తు సంస్థలు నోటీసులు అందిస్తున్న నేపథ్యంలోనే ఆయన భయంతో కూటమి నుంచి వాకౌట్ చేశారని విమర్శించారు. రాజకీయాల్లో ఇలాంటి పిరికివాళ్లు కొనసాగితే.. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఎలా మనుగడ సాగిస్తాయని ప్రశ్నించారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో నిర్వహించిన వర్కర్స్ కన్వెన్షన్‌లో ఆయన ఈ మేరకు నితీశ్‌పై ధ్వజమెత్తారు.
‘‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను భయపెట్టించేందుకు, బెదిరించేందుకు ఈడీ ద్వారా నోటీసులు పంపిస్తోంది. ఈ నోటీసులు ఇస్తున్నప్పటి నుంచి స్నేహంగా మెలుగుతున్న నేతలు విడిపోతున్నారు. పార్టీలను విడిచిపెట్టడంతో పాటు కూటమిని వీడుతున్నవారిని కూడా చూస్తున్నాం. ఇలాంటి పిరికివాళ్లు రాజకీయాల్లో ఉంటే.. ఈ దేశం, ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తాయా?’’ అని మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. కాబట్టి.. త్వరలో రాబోతున్న లోక్‌సభ ఎన్నికల్లో బాగా ఆలోచించి ఓటు వేయాలని ఆయన ప్రజల్ని కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు దేశ ప్రజలకు ఈ ఏడాదే చివరి అవకాశమని హెచ్చరించారు. ఈ సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధాని మోదీ నియంతృత్వ పాలనను ప్రకటిస్తారని.. అప్పుడు ప్రజాస్వామ్యం, ఎన్నికలు ఉండవని పేర్కొన్నారు.
ఇంకా మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రను ఆపేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ఇంతకుముందు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టినప్పుడు ఎలాంటి అడ్డంకులు ఎదురవ్వలేదని.. కానీ బీజేపీ పాలిత అస్సాంలో కక్షపూరితంగా యాత్రని ఆపడానికి ప్రయత్నించారని నిప్పులు చెరిగారు. యాత్రని ఆపివేయడంతో పాటు వాహనాలపై రాళ్లు విసిరారని, పోస్టర్లు కూడా చింపేశారని గుర్తు చేశారు. అయినా తాము భయపడబోమని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తమ పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని మల్లికార్జున ఖర్గే చెప్పుకొచ్చారు.
Updated Date - Jan 30 , 2024 | 04:31 PM