ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Modi : మోదీ ‘మిషన్‌ సౌత్‌’!

ABN, Publish Date - Mar 12 , 2024 | 04:37 AM

లోక్‌సభ ఎన్నికల్లో 400కిపైగా సీట్లలో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అందుకు కార్యాచరణ ప్రారంభించింది. ఎన్‌డీఏ కూటమిలోని పాత మిత్రులను తిరిగి చేర్చుకోవడంతో పాటు, వాటి సాయంతో దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తోంది. దక్షిణ భారతంలో

15 నుంచి 5 రోజుల పాటు 5 రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన

16న విశాఖపట్నం, జహీరాబాద్‌

17న గుంటూరు, మల్కాజిగిరి

19న నాగర్‌కర్నూలులో సభలు

గుంటూరులో చంద్రబాబు, పవన్‌తో కలిసి ఒకే వేదికపై..

న్యూఢిల్లీ/హైదరాబాద్‌/అమరావతి, మార్చి 11: లోక్‌సభ ఎన్నికల్లో 400కిపైగా సీట్లలో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అందుకు కార్యాచరణ ప్రారంభించింది. ఎన్‌డీఏ కూటమిలోని పాత మిత్రులను తిరిగి చేర్చుకోవడంతో పాటు, వాటి సాయంతో దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తోంది. దక్షిణ భారతంలో ఒక్క కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాల్లో పెద్దగా బలం లేకపోవడం, విజయాలను రుచి చూడకపోవడంతో ఆ లోటును పూడ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ప్రధాని మోదీ ఈ నెల 15 నుంచి 19 వరకు ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో 5 రోజుల పాటు సుడిగాలిలా పర్యటించి ప్రజలకు చేరువకానున్నారు. ఇక్కడ విజయ పతాకాన్ని ఎగరవేసే బాధ్యతను స్వయంగా తీసుకున్నారు. ‘మిషన్‌ సౌత్‌’లో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో పర్యటించి పలు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ నెల 15న తమిళనాడులో అడుగిడడం ద్వారా మోదీ తన దక్షిణ భార త యాత్రను ప్రారంభించనున్నారు. ఒక రాష్ట్రంలో పర్యటన పూర్తి చేసి, మరో రాష్ట్రానికి వెళ్లాలన్న విధా నం కాకుండా ఒకేరోజున పక్కపక్క రాష్ట్రాల్లో సభలు ఉండేలా ప్రణాళికను రూపొందించారు.

తమిళనాడు: 15న సేలంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. 16న కన్యాకుమారిలో జరిగే సభలో ప్రసంగిస్తారు. 18న కోయంబత్తూరులో జరిగే రోడ్‌ షోలో పాల్గొంటారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలతో పొత్తులపైనా చర్చలు జరిపే అవకాశం ఉంది. ప్రస్తుతం కన్యాకుమారి నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న పి.రాధాకృష్ణన్‌కే మళ్లీ టికెట్‌ దక్కే అవకాశం ఉండడంతో ఆ స్థానాన్ని నిలుపుకోవడంపై మోదీ దృష్టి పెట్టారు.

కేరళ: 15న పాలక్కాడ్‌లో జరిగే రోడ్డు షోలో పాల్గొంటారు. 17న పథనంథిట్టలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

కర్ణాటక: దక్షిణాదిలో బీజేపీ విజయాలను సమకూర్చుతున్న కర్ణాటకపై మోదీ అత్యధిక శ్రద్ధ చూపిస్తున్నారు. నాలుగు రోజుల పాటు ఈ రాష్ట్రంలో పర్యటించనున్నారు. 15న కోలార్‌, 17న షిమోగా, 18న బీదర్‌, 19న ధార్వాడల్లో పర్యటించనున్నారు. షిమోగా.. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు గట్టి పట్టున్న ప్రాంతం కాగా, ధార్వాడ.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి నియోజకవర్గం కావడం గమనార్హం.

ఆంధ్రప్రదేశ్‌: తెలుగుదేశం, జనసేనతో బీజేపీ పొత్తు కుదిరిన తరువాత తొలిసారి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌కు రానుండడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. 16న విశాఖపట్నంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 17న గుంటూరులో చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌లతో కలిసి బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. పదేళ్ల తరువాత ఆ ముగ్గురు అగ్రనాయకులు పాల్గొనే తొలి బహిరంగ సభ ఇదే కానుండటంతో మూడు పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

తెలంగాణ: విజయంపై ఎన్నో ఆశలు ఉన్న తెలంగాణపైనా మోదీ దృష్టి పెట్టారు. 16న జహీరాబాద్‌లో జరిగే రోడ్‌ షో, 17 మల్కాజిగిరిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 19న నాగర్‌ కర్నూల్‌లో జరిగే బహిరంగ సభతో తన యాత్రను ముగిస్తారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ విజయం సాధించడం ముఖ్యం కావడంతో ఏ అవకాశాన్ని కూడా వదులుకోకూడదని కమలనాథులు భావిస్తున్నారు.

నేడు రాష్ట్రానికి అమిత్‌షా

హైదరాబాద్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మంగళవారం రాష్ట్రంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్‌ గార్డెన్స్‌లో పార్టీ సోషల్‌ మీడియా వారియర్స్‌ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం, ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 2.30 గంటలకు పోలింగ్‌ బూత్‌ సమ్మేళనంలో పాల్గొంటారు. అనంతరం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్‌చార్జులతో ఐటీసీ కాకతీయలో సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, అమిత్‌ షా రెండున్నర మాసాల వ్యవధిలో రెండోసారి షా రాష్ట్రానికి వస్తున్నారు.

Updated Date - Mar 12 , 2024 | 04:37 AM

Advertising
Advertising