ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PM Modi hat trick : నెగ్గారు తగ్గారు

ABN, Publish Date - Jun 05 , 2024 | 04:09 AM

సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరపడింది! పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఓటర్లు ఎన్డీయేకు పట్టం కట్టారు! ఇది ‘మోదీ గ్యారెంటీ’ అని పదే పదే హామీ ఇచ్చినా.. బీజేపీని మాత్రం మేజిక్‌ మార్కును దాటనివ్వలేదు! ఫలితంగా.. ఈసారి కేంద్రంలో సంకీర్ణ సర్కారు ఏర్పాటుకానుంది! సంపూర్ణ ఆధిపత్యం పోయి..

  • ఎన్డీయే హ్యాట్రిక్‌.. బీజేపీకి 241 మాత్రమే.. కీలకంగా టీడీపీ,

    జేడీయూ.. సత్తా చాటిన ‘ఇండియా’

  • నేడు ఢిల్లీలో ఎన్డీయే భేటీ.. నాయకుడి ఎంపిక

  • బీజేపీని దెబ్బతీసిన యూపీ, మహారాష్ట్ర,

  • పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌, కర్ణాటక రాష్ట్రాలు

  • ఎన్డీయేను ఆదుకున్న ఏపీ, బిహార్‌, మధ్యప్రదేశ్‌

  • దేశవ్యాప్తంగా పుంజుకున్న ఇండి కూటమి

  • సెంచరీ మార్కు వద్ద కాంగ్రెస్‌ దోబూచులు

  • వారాణసీలో మోదీకి భారీగా తగ్గిన మెజారిటీ

  • రాయ్‌బరేలీ, వయనాడ్‌లో రాహుల్‌ విజయం

  • టీడీపీ, జేడీయూ మా పాత మిత్రులు

రాజ్యాంగంపై మోదీ, అమిత్‌ షా దాడిని ప్రజలు తిరస్కరించారు. మోదీ సర్కారు మా ఖాతాల్ని ఫ్రీజ్‌ చేసినప్పుడు, మా సీఎంలను జైల్లో పెట్టినప్పుడు, పార్టీలను విచ్ఛిన్నం చేసినప్పుడు ప్రజలు ఐక్యంగా పోరాడతారన్న నా ఆకాంక్ష నిజమైంది. కేంద్రంలో ఇండియా ప్రభుత్వ ఏర్పాటుకు మా పాత మిత్రులు టీడీపీ, జేడీయూలను సంప్రదించే విషయంలో మా కూటమి సమావేశమై నిర్ణయం తీసుకుంటుంది. - రాహుల్‌

  • 1962 తర్వాత హ్యాట్రిక్‌ ప్రధాని నేనే..

ఎన్డీయేపై ప్రజలు వరుసగా మూడోసారి నమ్మకాన్ని ఉంచారు. ఇది వికసిత్‌ భారత్‌కు లభించిన విజయం. ఒక ప్రధాని వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం 1962 తర్వాత ఇదే తొలిసారి. తెలంగాణలో బీజేపీ గతంలోకన్నా ఈసారి రెట్టింపు సీట్లు గెలిచింది. ఏపీలో చంద్రబాబు, బిహార్‌లో నితీశ్‌ ఆధ్వర్యంలో మా కూటమి అద్భుత ఫలితాలను సాధించింది. ఒడిసాలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. కేరళలో తొలిసారి ఖాతా తెరిచింది. అవినీతి నిర్మూలనపై దృష్టిపెడతాం. మరిన్ని భారీ నిర్ణయాలు ఉంటాయి.

- నరేంద్ర మోదీ

వ్యవస్థలను విధ్వంసం చేసినా తమకు ఎదురు లేదని

విర్రవీగిన వాళ్లను చీరి చింతకు కట్టారు!

పార్టీలను ఇష్టమొచ్చినట్లు చీల్చి.. ప్రజాస్వామ్యాన్ని చెరబట్టినా

తమకే ఓటు వేస్తారనుకున్న వాళ్లపై వేటు వేశారు!

ధరలు పెంచినా.. పన్నులు వేసినా.. కుల, మత, ప్రాంత

భావోద్వేగాలతో తమకే పట్టం కడతారని అనుకున్న వాళ్లను

నేలకు దింపారు!

సంక్షేమ పథకాలు పంచి పెడితే చాలు..

గెలిచేస్తామనుకున్న వాళ్లను దంచికొట్టారు!

అధికారం ఉందన్న అహంకారంతో ప్రతిపక్ష నేతలను ఎద్దేవా

చేసి.. బండ బూతులు తిట్టిన వాళ్లను బండకేసి బాదారు!

కాకినాడ నుంచి కశ్మీరు వరకూ.. పాలమూరు నుంచి పాలక్కాడ్‌

వరకూ భారత ఓటర్ల విలక్షణ తీర్పు.. ఇది ప్రపంచంలోనే అతి

పెద్ద ప్రజాస్వామ్యం పరిణతికి నిదర్శనం!

న్యూఢిల్లీ, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరపడింది! పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఓటర్లు ఎన్డీయేకు పట్టం కట్టారు! ఇది ‘మోదీ గ్యారెంటీ’ అని పదే పదే హామీ ఇచ్చినా.. బీజేపీని మాత్రం మేజిక్‌ మార్కును దాటనివ్వలేదు! ఫలితంగా.. ఈసారి కేంద్రంలో సంకీర్ణ సర్కారు ఏర్పాటుకానుంది! సంపూర్ణ ఆధిపత్యం పోయి.. మిత్రులపై ఆధారపడి మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అనివార్య పరిస్థితి బీజేపీకి ఎదురైంది! అదే సమయంలో, ఇండి కూటమి అనూహ్యంగా పుంజుకుంది! కానీ, మేజిక్‌ మార్కును చేరుకోలేకపోయింది. కేంద్రంలో 18వ లోక్‌సభ కొలువుదీరడానికి ఏడు దశల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. వాటి ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. వీటిలో 241 సీట్లను సాధించిన బీజేపీ అతి పెద్ద పార్టీగా నిలిచింది. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే 293 స్థానాల్లో ఘన విజయం సాధించింది. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 272 సీట్లు అవసరం. అంటే, అత్తెసరు మెజారిటీతో ఎన్డీయే మేజిక్‌ మార్కును దాటినట్లే! అదే సమయంలో గత ఎన్నికల్లో కేవలం 44 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్‌ ఈసారి 99 సీట్లు సాధించింది! ఆ పార్టీ నేతృత్వంలోని ఇండి కూటమి కూడా గతం కంటే భారీగా బలపడింది. ఈసారి ఎన్నికల్లో 233 స్థానాల్లో ఘన విజయం సాధించింది.


  • కింగ్‌ మేకర్లుగా చంద్రబాబు, నితీశ్‌

గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగానే మేజిక్‌ మార్కు దాటిన బీజేపీ ఈసారి ‘టార్గెట్‌ 370’ అంటూ బరిలోకి దిగింది! ఎన్డీయే కూటమిగా 400కుపైగా సీట్లను సాధించాలని లక్ష్యం పెట్టుకుంది. కానీ, తుది ఫలితాల్లో అత్తెసరు మెజారిటీతోనే ఎన్డీయే మేజిక్‌ మార్కును దాటింది. ఎన్డీయే మిత్రపక్షాల్లో టీడీపీ-జనసేన సాధించిన 18 స్థానాలు; జేడీయూకు వచ్చిన 12 సీట్లు కీలకంగా మారాయి. ఆయా పార్టీలకు చెందిన 30 మంది ఎంపీలు మద్దతు ఇస్తేనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు మార్గం సుగమం అవుతుంది. అదే సమయంలో, ఇండి కూటమికి కూడా మేజిక్‌ మార్కు చేరడానికి దాదాపు 40 సీట్లు తగ్గాయి. ఈ నేపథ్యంలోనే, రాజకీయ గండరగండడు శరద్‌ పవార్‌ రంగంలోకి దిగినట్లు ప్రచారం జరిగింది.

ఆయన అటు నితీశ్‌ కుమార్‌తోనూ ఇటు చంద్రబాబుతోనూ మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కూడా ఇండియా కూటమి నేతలు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా చంద్రబాబుకు స్వయంగా ఫోన్‌ చేసి ఏపీలో ఎన్డీయే కూటమి ఘన విజయంపై అభినందించారు. ఎన్డీయే కన్వీనర్‌గా మళ్లీ బాధ్యతలు చేపట్టాలని చంద్రబాబును అమిత్‌ షా కోరినట్లు సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలోనే ఎన్డీయే కూటమి బుధవారం ఢిల్లీలో సమావేశం కానుంది. దీనికి చంద్రబాబు సహా కూటమి నేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశం తర్వాత కూటమి భవిష్యత్తు, ప్రధాన మంత్రి ఎవరనే అంశాలపై పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది. మరోవైపు, ఇండి కూటమి కూడా తన ప్రయత్నాలు తాను చేస్తూనే.. బుధవారం దేశ రాజధానిలో విస్తృతంగా సమావేశాలు జరపనుంది.

  • యూపీ, మహారాష్ట్రల్లో చావుదెబ్బ

మేజిక్‌ మార్కుకు దాదాపు 40 సీట్ల దూరంలో నిలిచిపోయిన బీజేపీకి ఆ పార్టీకి కంచుకోటగా నిలిచిన ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రల్లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. శతాబ్దాల కలను సాకారం చేస్తూ రామ మందిరాన్ని నిర్మించినా యూపీ ఓటర్లు బీజేపీకి పట్టం కట్టలేదు. చివరికి, అయోధ్య రామమందిరం కొలువైన ఫైజాబాద్‌ నియోజకవర్గంలోనూ బీజేపీ ఓటమి పాలైంది. ఇంకా చెప్పాలంటే, ఫలితాలు వెలువడడం మొదలైన తొలి రౌండ్లలో వారాణసీలో ప్రధాని మోదీ దాదాపు ఆరు వేల ఓట్ల వెనుకంజలో ఉన్నారు. చివరికి, ఆయన లక్షన్నర ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కానీ, గత ఎన్నికలో పోలిస్తే ఇక్కడ ఆయన మెజారిటీ దాదాపు మూడు లక్షల ఓట్లు తగ్గిపోవడం విశేషం.

అంతేనా.. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా 71, 62 సీట్లు సాధించిన బీజేపీ ఈసారి కేవలం 33 సీట్లకే పరిమితమైంది. ఇక్కడ మతం కంటే కులానిదే పైచేయి అయింది. యూపీలో కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ జట్టుకట్టడం.. గతంలో టికెట్ల కేటాయింపులో యాదవులకే పెద్దపీట వేసిన అఖిలేశ్‌ ఈసారి యాదవేతరులకు ఎక్కువ సీట్లు ఇవ్వడం.. మాయావతి ప్రభ మసకబారి దళితుల ఓట్లు కాంగ్రె్‌సకు బదిలీ కావడంతో ఇక్కడ ఇండియా కూటమి అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా 43 స్థానాల్లో ఘన విజయం సాధించింది. ఒక్క యూపీలోనే బీజేపీకి దాదాపు 30 సీట్లు తగ్గిపోయాయి. ఇక, అధికారం కోసం మహారాష్ట్రలో పార్టీలను చిన్నభిన్నం చేయడంతో అక్కడి ఓటర్లు బీజేపీపై విముఖత చూపారు. అందుకే, గత ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎన్డీయేకు 41 సీట్లు రాగా.. ఇప్పుడు కేవలం 20 స్థానాలే దక్కాయి. అప్పట్లో 23 సీట్లను గెలుచుకున్న బీజేపీని ఈసారి పది స్థానాలకు పరిమితం చేశారు. ఇక్కడ బీజేపీకి మరో 13 సీట్లు తగ్గాయి.

ఇక, పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. గత ఎన్నికల్లో ఇక్కడ 19 సీట్లను గెలుచుకున్న బీజేపీ ఈసారి 10 స్థానాలకే పరిమితమైంది. రాజస్థాన్‌లో గత ఎన్నికల్లో 25 సీట్లలో విజయం సాధించిన బీజేపీ ఈసారి 14 స్థానాల్లోనే గెలిచింది. గతంతో పోలిస్తే కర్ణాటకలో ఏడు; హరియాణాలో ఐదు సీట్లు తగ్గాయి. వెరసి, కీలకమైన ఐదారు రాష్ట్రాల్లోనే దాదాపు 70 సీట్లను బీజేపీ కోల్పోయింది. మొత్తంగా గత ఎన్నికల్లో సొంతంగా 303 సీట్లు గెలుచుకున్న బీజేపీకి ఈసారి 65 స్థానాలు తగ్గిపోవడం గమనార్హం! గతానికి భిన్నంగా బీజేపీ ఈసారి దాదాపు వంద సీట్లలో సిటింగ్‌ ఎంపీలను మార్చింది. ఇతర పార్టీల నుంచి చేర్చుకుని మరీ టికెట్లు ఇచ్చింది. పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నాలుగు రాష్ట్రాల్లో సీఎంలనూ మార్చింది. అయినా, మేజిక్‌ మార్కును చేరుకోవడంలో విఫలమైంది. ఇండియా కూటమి గతంతో పోలిస్తే బలంగా పుంజుకోవడానికి ఈ ఐదారు రాష్ట్రాలతోపాటు తమిళనాడు కారణం.

  • ఎన్డీయేని ఆదుకున్న ఏపీ, ఎంపీ, బిహార్‌

ఎన్డీయే కూటమిని ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌ ఆదుకున్నాయి. ఏపీలో కూటమి అభ్యర్థులు 18 స్థానాల్లో విజయం సాధిస్తే.. బిహార్లో బీజేపీతో కలిపి కూటమి 24 స్థానాల్లో గెలిచింది. ఈ రెండు రాష్ట్రాలే ఎన్డీయే కూటమి ఆధిక్యంలోకి రావడానికి కారణమైంది. ఇక, మధ్యప్రదేశ్‌, ఢిల్లీల్లో బీజేపీ క్లీన్‌ స్వీప్‌ చేయగా.. ఒడిసా, గుజరాత్‌, ఛత్తీ్‌సగఢ్‌, ఉత్తరాఖండ్‌, అసోం, జార్ఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, త్రిపురల్లో బీజేపీ తన పట్టును నిలబెట్టుకుంది. తెలంగాణలో గతంతో పోలిస్తే రెట్టింపు సీట్లను సాధించింది.

ఈసారి దక్షిణాదిపై ప్రత్యేకంగా కన్నేసిన బీజేపీ తమిళనాడులో సిటింగ్‌ సీటును కోల్పోయినా.. కమ్యూనిస్టుల కంచుకోట కేరళలో కాలుమోపింది. ఇక్కడి త్రిసూర్‌లో సినీ నటుడు సురేశ్‌ గోపీ బీజేపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అదే సమయంలో, కూటమి భాగస్వామిగా పోటీ చేసి ఏపీలో మూడు సీట్లు గెలిచినా.. కర్ణాటకలో ఎనిమిది స్థానాలను కోల్పోయింది. ఇక, ఈ ఎన్నికలకు సంబంధించి బీజేపీ పూర్తిస్థాయిలో ఆనందపడే సందర్భం ఒడిసాలో అధికారంలోకి రావడం.. అక్కడ ఎంపీ సీట్లలోనూ మెజారిటీ సాధించడమే!

Updated Date - Jun 05 , 2024 | 04:35 AM

Advertising
Advertising