ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నీట్‌ లీకేజీ.. సుస్పష్టం

ABN, Publish Date - Jul 09 , 2024 | 05:08 AM

నీట్‌ పేపర్‌ లీక్‌ అయ్యిందనేది స్పష్టమైందని, అయితే.. ఏ స్థాయిలో జరిగిందో, ఆ ప్రశ్నపత్రం ఎంతమందికి చేరిందో గుర్తించాల్సిన అవసరం ఉన్నదని దేశ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయ పడింది. ఆ అంశాలను బట్టే పరీక్షను మళ్లీ నిర్వహించాలా? వద్దా?

ఏ స్థాయిలో జరిగిందో ముందు గుర్తించాలి

దాన్ని బట్టే మళ్లీ పరీక్షపై నిర్ణయానికి చాన్స్‌

సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున

అందరికీ చేరితే రీ టెస్ట్‌ నిర్వహించాల్సిందే

ఈ పరీక్ష పవిత్రత నిస్సందేహంగా దెబ్బతింది

అందరికీ మళ్లీ పరీక్ష అంటే.. తీవ్ర నిర్ణయమే!

నీట్‌పై.. సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీఏపై ప్రశ్నల వర్షం

దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని సీబీఐకి ఆదేశం

న్యూఢిల్లీ, జూలై 8 (ఆంధ్రజ్యోతి): నీట్‌ పేపర్‌ లీక్‌ అయ్యిందనేది స్పష్టమైందని, అయితే.. ఏ స్థాయిలో జరిగిందో, ఆ ప్రశ్నపత్రం ఎంతమందికి చేరిందో గుర్తించాల్సిన అవసరం ఉన్నదని దేశ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయ పడింది. ఆ అంశాలను బట్టే పరీక్షను మళ్లీ నిర్వహించాలా? వద్దా? అనేది నిర్ణయించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. నీట్‌-యూజీ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించడం ఆఖరు ప్రత్యామ్నాయం మాత్రమేనని తేల్చిచెప్పింది. ప్రశ్నపత్రం సోషల్‌ మీడియా ద్వారా పెద్ద ఎత్తున లీక్‌ అయినా రీ టెస్టుకు ఆదేశించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నీట్‌ నిర్వహణలో అవకతవకలు, పేపర్‌ లీకేజీకి, పరీక్ష రద్దుకు సంబంధించి దాఖలైన పలు వ్యాజ్యాలపై సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర సర్కారుపైన, జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)పైన ప్రశ్నల వర్షం కురిపించింది. ‘‘పేపర్‌ లీక్‌ ఎలా జరిగింది? మొదట ఎక్కడ జరిగింది? ప్రశ్నపత్రాలను నిందితులకు చేరవేసిన విధానం ఏమిటి? పేపర్‌ లీకేజీకి, పరీక్షకు మధ్య ఎంత సమయం ఉంది? పరీక్ష మొత్తాన్ని ప్రభావితం చేసే స్థాయిలో జరిగిందా? పేపర్‌ లీకేజీ ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులను పూర్తిస్థాయిలో గుర్తించడం సాధ్యమేనా? పేపర్‌ లీకేజీ వ్యవహారంలో నిందితులను గుర్తించేందుకు తీసుకున్న చర్యలేంటి?’’ అంటూ కేంద్ర ప్రభుత్వంపైన, ఎన్‌టీఏపైన సీజేఐ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘పేపర్‌ లీక్‌ అయినప్పటి నుంచి పరీక్ష జరిగేటప్పటికి తక్కువ సమయమే ఉందని తేలితే.. నీట్‌ను రద్దు చేసి మళ్లీ పరీక్ష పెట్టాలనే నిర్ణయానికి రాలేని పరిస్థితి ఏర్పడుతుంది’’ అని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. ‘‘లీకేజీ ఒకవేళ సామాజిక మాధ్యమాల ద్వారా జరిగి ఉంటే పేపర్‌ విస్తృతంగా వ్యాపించే అవకాశం ఉంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా.. కేంద్రానికి, ఎన్‌టీఏకి కొన్ని ప్రశ్నలు సంధించి, వాటికి సమాధానాలు ఇవ్వాలని కోరుతూ తదుపరి విచారణను గురువారానికి (జూలై 11) వాయిదా వేశారు. అలాగే, నీట్‌ అక్రమాలపై దర్యాప్తు ఏ దశలో ఉందో తెలుపుతూ బుధవారానికల్లా నివేదిక ఇవ్వాలని సీబీఐని ఆదేశించారు.

సందేహమే లేదు..

‘‘ఒక్కటి మాత్రం సుస్పష్టం. లీకేజీ జరిగింది. ఈ పరీక్ష పవిత్రత దెబ్బతిందన్న విషయంలో ఎలాంటి సందేహానికీ తావు లేదు. అయితే.. లీక్‌ ఏ స్థాయిలో జరిగిందన్నదే ప్రశ్న’’ అని విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. తప్పు చేసినవారిని పట్టుకోవాలంటే.. ముందు ఎక్కడెక్కడ లోపాలున్నాయో, తప్పులు జరిగాయో గుర్తించాలని పేర్కొంది. అలాంటివారిని గుర్తించగలిగితే.. వారికి మళ్లీ పరీక్ష పెట్టడం తప్పనిసరి కావొచ్చని అభిప్రాయపడింది. అంతే తప్ప అందరు అభ్యర్థులకూ మళ్లీ పరీక్ష పెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని, తీవ్రమైన నిర్ణయం అవుతుందని స్పష్టం చేసింది. ‘‘మళ్లీ పరీక్ష పెట్టాలనే నిర్ణయం తీసుకోవడానికి ముందు.. లీక్‌ ఎలా జరిగిందో మనం తెలుసుకోవాలి. ఇంకోసారి పరీక్షకు హాజరు కావాలని 23 లక్షల మందిని అడగడం చాలా కష్టం’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా.. నీట్‌ పరీక్షకు సంబంధించి నిగ్గు తేల్చాల్సిన అంశాలు కొన్నింటిని ధర్మాసనం గుర్తించింది. అవేంటంటే..

  • ఈ ఏడాది 720కి 720 మార్కులు వచ్చిన విద్యార్థులు మునుపెన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారిలో గ్రేస్‌ మార్కుల వల్ల ప్రయోజనం పొందినవారు ఎంతమంది?

  • ఒక సెంటర్‌లో పరీక్ష రాయడానికి రిజిస్టర్‌ చేసుకుని.. ఆ తర్వాత పరీక్షా కేంద్రాన్ని దూరంగా ఉన్న మరోచోటుకు మార్చుకుని, ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులు ఎందరు?

  • నీట్‌లో అసాధారణంగా ఎక్కువ మార్కులు పొంది.. పన్నెండో తరగతిలో మాత్రం ఆ స్థాయిలో సామర్థ్యాన్ని చూపని విద్యార్థులు ఎవరు? (అయితే.. నీట్‌కు సిద్ధమైనంత కఠినంగా బోర్డు పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం కారని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయపడింది).

  • ఒక సబ్జెక్టులో అసాధారణంగా ఎక్కువ మార్కులు పొంది.. మరో సబ్జెక్టులో అతి తక్కువ మార్కులు పొందిన విద్యార్థులెవరు?

..అనే అంశాలపై దృష్టి సారించాలని పేర్కొంది. అయితే, ఒక్కచోట (పట్నాలో) మినహా పేపర్‌ మరెక్కడా లీక్‌ కాలేదని సొలిసిటర్‌ జనరల్‌ పేర్కొన్నారు. ఆ ఒక్కచోట కూడా కేసు దర్యాప్తులో ఉందని కోర్టుకు విన్నవించారు. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం కోర్టు.. పేపర్‌ లీక్‌ విస్తృతంగా జరిగిందా? ఆ లీకేజీ.. పరీక్ష నిర్వహణ ప్రక్రియ విశ్వసనీయతనే దెబ్బతీసిందా? ఏ తప్పూ చేయని విద్యార్థులను, తప్పు చేసి లబ్ధి పొందిన విద్యార్థులను వేరు చేయడం సాధ్యమేనా? ..అనే అంశాలను తాము పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. పరీక్ష పవిత్రతనే దెబ్బతీసే స్థాయిలో లీక్‌ జరిగి.. తప్పు చేసిన విద్యార్థులను గుర్తించలేని పరిస్థితి ఉంటే మాత్రం మళ్లీ పరీక్ష నిర్వహించక తప్పదని అభిప్రాయపడింది. అదే సమయంలో.. పేపర్‌ లీకేజీ కొన్ని ప్రాంతాలకే పరిమితమై, తప్పు చేసినవారిని గుర్తించగలిగితే 23 లక్షల మందికి మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించడం అనుచితమే అవుతుందని పేర్కొంది.

ఆ వివరం చెప్పొద్దు..

విచారణ సందర్భంగా కేంద్రానికి, ఎన్‌టీఏకి ధర్మాసనం పలు ప్రశ్నలను సంధించింది. ‘‘ప్రశ్నపత్రాన్ని ఒకరే తయారు చేస్తారా? లేక ఎక్కువ మందా? ప్రింటింగ్‌ ప్రెస్‌ ఏది? ఆ ప్రశ్నపత్రాలను ప్రింటింగ్‌ ప్రెస్‌కి ఎన్‌టీఏ ఎప్పుడు పంపింది? ప్రింటింగ్‌ ప్రెస్‌కి పంపడానికి చేసిన రవాణా ఏర్పాట్లు ఏంటి’ అని పలు ప్రశ్నలు సంధించారు. దీనికి ఎన్‌టీఏ తరఫు న్యాయవాది.. ప్రశ్నపత్రాన్ని నిపుణుల బృందం సిద్థం చేస్తుందని తెలిపారు. ప్రింటింగ్‌ ప్రెస్‌ ఇక్కడే ఉందని న్యాయవాది చెబుతుండగా.. సీజేఐ జోక్యం చేసుకుని.. ‘‘ప్రింటింగ్‌ ప్రెస్‌ ఎక్కడ ఉందో చెప్పనవసరం లేదు. ఎందుకంటే అదెక్కడ ఉండో తెలిస్తే వచ్చే ఏడాది మళ్లీ లీక్‌ అయ్యే ప్రమాదం ఉంది. అయితే.. ప్రింటింగ్‌ ప్రెస్‌కు ఎలా పంపించారు, ఏ కస్టడీలో ఉంచారు? ప్రింట్‌ అయిన తర్వాత మళ్లీ ఎన్‌టీఏకి ఎలా పంపిస్తారో మాత్రం చెప్పండి ?’’ అన్నారు.


23 లక్షల జీవితాలతో..

నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీ 23 లక్షల కుటుంబాలతో ముడిపడిన అంశమని విచారణ సందర్భంగా సీజేఐ వ్యాఖ్యానించారు. అందుకే ఈ అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాకే తీర్పు ఇస్తామని స్పష్టం చేశారు. ‘‘పేపర్‌ ఎంతమందికి లీక్‌ అయింది? అందులో ఎంతమంది ఫలితాలను నిలిపివేశారు? వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ఒకవేళ ప్రభుత్వం పరీక్షను రద్దు చేయలేకపోతే, లీకేజీ ద్వారా ప్రయోజనం పొందినవారిని గుర్తించడానికి ప్రభుత్వం ఏం చేస్తోంది?’’ అని ప్రశ్నించారు. పరీక్షకు మూడు గంటల ముందే ప్రశ్నపత్రం లీకేజీ జరిగిందని ఎన్‌టీఏ న్యాయవాది తెలపగా.. సమగ్ర నివేదికను సమర్పించాలంటూ కేంద్రంతోపాటు ఎన్‌టీఏని ఆదేశించారు. నీట్‌ లీకేజీపై దర్యాప్తు ఎంతదాకా వచ్చిందో నివేదిక అందించాలని సీబీఐని ఆదేశించి.. విచారణను గురువారానికి వాయిదా వేశారు.

ఈ వివరాలు ఇవ్వండి..

  • ఈ కింది అంశాలపై పూర్తివివరాలు సమర్పించాలంటూ కోర్టు ఎన్‌టీఏని ఆదేశించింది.

  • పేపర్‌ ఎలా లీక్‌ అయ్యింది? అసలు మొట్టమొదటిగా పేపర్‌ ఎక్కడ లీక్‌ అయ్యింది?

  • ఏయే ప్రాంతాల్లో లీకేజీ జరిగింది? ఎలా వ్యాప్తి చెందింది?

  • పేపర్‌ లీక్‌ అయిన సమయానికి పరీక్ష జరిగిన సమయానికి మధ్య ఎంత తేడా ఉంది?

  • లీక్‌ జరిగిన పరీక్షా కేంద్రాలు/నగరాలను గుర్తించడానికి ఎన్‌టీఏ తీసుకున్న చర్యలేమిటి?

  • లీకేజీ వల్ల లబ్ధి పొందినవారిని ఎలా గుర్తిస్తున్నారు?

  • ఇప్పటివరకూ అలాంటి అభ్యర్థులు ఎంతమందిని గుర్తించారు?

..అనే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది. అనుమానిత కేసులను గుర్తించేందుకు డేటా ఎనలిటిక్స్‌ను వాడే అవకాశం ఉందేమో పరిశీలించాలని కేంద్రానికి, ఎన్‌టీఏకి సూచించింది. అది సాధ్యమైతే తప్పుచేసినవారిని గుర్తించవచ్చని అభిప్రాయపడింది. అలాగే, నీట్‌ కౌన్సెలింగ్‌ పరిస్థితి ఏమిటో తెలపాలని ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు చోటుచేసుకోకుండా నీట్‌ పరీక్ష పవిత్రతను కాపాడేందుకు.. సబ్జెక్ట్‌ నిపుణులతో కమిటీ ఏర్పాటు సహా పలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.

Updated Date - Jul 09 , 2024 | 05:08 AM

Advertising
Advertising
<