Bihar politics: రాజీనామాకు నితీష్ రెడీ.. మళ్లీ సీఎంగా ప్రమాణం ఎప్పుడంటే..?
ABN, Publish Date - Jan 27 , 2024 | 08:25 PM
పాట్నా: బీహార్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం పతాక స్థాయికి చేరుకుంది. 'మహాఘట్బంధన్'కు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ గుడ్‌బై చెప్పడం ఖాయమైంది. ముఖ్యమంత్రి పదవికి నితీష్ శనివారం పొద్దుపోయేలోగా రాజీనామా చేయనున్నారని, ఆదివారంనాడే సీఎంగా తిరిగి ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తోంది.
పాట్నా: బీహార్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభం పతాక స్థాయికి చేరుకుంది. 'మహాఘట్బంధన్'కు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) సారథ్యంలోని జేడీయూ (JDU) గుడ్‌బై చెప్పడం ఖాయమైంది. ముఖ్యమంత్రి పదవికి నితీష్ శనివారం పొద్దుపోయేలోగా రాజీనామా చేయనున్నారని, పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఆయనతో కలవనున్నారని పార్టీ వర్గాల సమాచారం. రాజీనామా లేఖతో గవర్నర్‌ను కలుసుకుని, బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వెంటనే ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఆదివారం సాయంత్రం 4 గంటలకు సీఎంగా నితీష్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. బీజేపీతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి రెండు ఉపముఖ్యమంత్రి పదవులతో పాటు స్పీకర్ పదవి కూడా దక్కనుంది.
కాగా, ప్రభుత్వం ఏర్పాటుకు ఆర్జేడీ బలసమీకరణ జరిపే లోపే వేగంగా నితీష్ రాజీనామా చేయడం, తిరిగి సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం చకచకా జరిగిపోవాలని అటు జేడీయూతో పాటు ఆ పార్టీతో చెలిమికి సిద్ధమైన బీజేపీ పెద్దలు వ్యూహరచన సాగిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, ఆర్జేడీ నేత, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సైతం తమ పార్టీ నేతలతో పాట్నాలో అత్యవసర సమావేశం జరిపారు. తాజా పరిస్థితిపై ఒక స్పష్టత వచ్చేంతవరకూ ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని, సంయమనం పాటించాలని కోరారు. ''ఇక ఆట మొదలుపెట్టడమే తరువాయి'' అని ఆర్జేడీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ నేతలంతా అందుబాటులోనే ఉండాలని, బీజేపీతో చేతులు కలిపేందుకు నితీష్ నిర్ణయం తీసుకుంటే దీనిని సవాలు చేస్తూ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఫిబ్రవరి 5న "విశ్వాస పరీక్ష''కు వెళ్దామని సూచించినట్టు కూడా తెలుస్తోంది.
పాట్నాకు అమిత్‌షా, నడ్డా..
నితీష్‌ను సీఎంగానే ఉంచి లోక్‌సభ ఎన్నికలకు కలిసి వెళ్లేందుకు సూత్రప్రాయంగా బీజేపీ అంగీకరించనందున ప్రమాణస్వీకారానికి హాజరయ్యేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆదివారంనాడు పాట్నాకు వస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. తాజా పరిణామాలతో బీహార్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఏ క్షణాన ఏమి జరుగనుందనే ఉత్కంఠ ప్రధాన పార్టీల్లో నెలకొంది.
అసెంబ్లీలో ఎవరి బలం ఎంత..?
243 సీట్ల బిహార్ అసెంబ్లీలో కనీస మెజారిటీకి 122మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం ఆర్జేడీకి 79, బీజేపీకి 78, జేడీయూకి 45, కాంగ్రెస్‌కు 19, వామపక్షాలకు 16, హెచ్‌ఏఎం(ఎ్‌స)కు నలుగురు ఎమ్మెల్యేలు, ఎంఐఎంకు ఒక్కరు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. కాంగ్రెస్, వామపక్షాలు ఆర్జేడీతో కలిసి ఉన్నాయి. ఈ 3 పార్టీల బలం 114. అంటే మెజారిటీకి మరో 8 మంది ఎమ్మెల్యేలు అవసరం. జేడీయూ-బీజేపీ చేతులు కలిపితే 123మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతాయి.
Updated Date - Jan 27 , 2024 | 08:46 PM