బలపరీక్ష నెగ్గిన నితీశ్!
ABN, Publish Date - Feb 13 , 2024 | 04:54 AM
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జేడీయూ-బీజేపీ సర్కారు బలపరీక్ష నెగ్గింది. సోమవారం బిహార్ అసెంబ్లీలో పలు నాటకీయ పరిణామాల మధ్య నితీశ్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. తొలుత సీఎం
పట్నా, ఫిబ్రవరి 12: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జేడీయూ-బీజేపీ సర్కారు బలపరీక్ష నెగ్గింది. సోమవారం బిహార్ అసెంబ్లీలో పలు నాటకీయ పరిణామాల మధ్య నితీశ్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. తొలుత సీఎం నితీశ్‌కుమార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ల మధ్య మాటల యుద్ధం నడిచింది. నితీశ్ సభలో మాట్లాడుతూ.. ఆర్జేడీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆర్జేడీ ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి జరిగిందని, దానిపై తమ (ఎన్డీయే) సర్కారు దర్యాప్తు చేపడుతుందని వెల్లడించారు. 2005కు ముందు బిహార్‌లో ఆర్జేడీ ప్రభుత్వ పాలనలో శాంతిభద్రతలే లేవని, మతపరమైన హింసాత్మక ఘటనలు అనేకం జరిగాయని ఆరోపించారు. ఆర్జేడీ నేత, మాజీ డిప్యుటీ సీఎం తేజస్వీ యాదవ్.. నితీశ్‌పై మండిపడ్డారు. ‘పల్టు కుమార్’ అంటూ విమర్శలు గుప్పించిన ప్రధాని మోదీతోనే నితీశ్ చేతులు కలిపారని ధ్వజమెత్తారు. నితీశ్ మళ్లీ కూటమి మారరని మోదీ గ్యారెంటీ ఇవ్వగలరా? అని ప్రశ్నించారు. బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న ఇవ్వడం కూడా బీజేపీ-జేడీయూ డీల్‌లో భాగమేనని ఆరోపించారు. తేజస్వి ప్రసంగం తర్వాత ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. సభలో విశ్వాస పరీక్షకు ముందు స్పీకర్ అవధ్ బిహారీ చౌధరిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆయన ఆర్జేడీ సభ్యుడు. చౌధరికి వ్యతిరేకంగా 125 మంది సభ్యులు ఓటేయడంతో ఆయన్ను స్పీకర్‌గా తొలగించారు. అనంతరం జరిగిన బలపరీక్షలో నితీశ్ ప్రభుత్వానికి అనుకూలంగా 130 ఓట్లు లభించాయి. మొత్తం 243 మంది సభ్యులున్న శాసనసభలో మెజారిటీ మార్కు 122 కాగా.. ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేయడంతో జేడీయూ-బీజేపీ సర్కారుకు 130-0 ఓట్లు దక్కాయి. ఇందులో ఆర్జేడీకి చెందిన ముగ్గురు సభ్యుల ఓట్లు కూడా ఉండడం విశేషం.
Updated Date - Feb 13 , 2024 | 04:54 AM