Jharkhand: ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వండి.. గవర్నర్‌ను కోరిన చంపై సోరెన్
ABN, Publish Date - Feb 01 , 2024 | 05:43 PM
జార్ఖండ్‌లో గడిచిన కొన్ని గంటలుగా ప్రభుత్వం లేకపోవడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని జార్ఖండ్ ముక్తీ మోర్చా సీనియర్ నేత చంపై సోరెన్ అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కోరుతూ ఆయన లేఖ రాశారు.
రాంచీ: జార్ఖండ్(Jharkhand)లో గడిచిన కొన్ని గంటలుగా ప్రభుత్వ అస్థితరత లేకపోవడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని జార్ఖండ్ ముక్తీ మోర్చా(JMM) సీనియర్ నేత చంపై సోరెన్(Champai Soren) అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కోరుతూ ఆయన లేఖ రాశారు. హేమంత్ సోరెన్(Hemanth Soren) ముఖ్యమంత్రి సీఎం పదవి నుంచి వైదొలగడం, అవినీతి కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)అరెస్టు చేసిన తర్వాత సోరెన్ నిన్న జార్ఖండ్ ముక్తి మోర్చా శాసనసభా పక్ష నేతగా ఎంపికయ్యారు.
81 మంది సభ్యులున్న అసెంబ్లీలో మెజారిటీ జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికే ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. మొత్తంగా తమ బలం 47గా ఉన్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి ఎమ్మెల్యేలు సంతకం చేసిన మద్దతు లేఖను గవర్నర్‌కు సమర్పించినట్లు గవర్నర్‌కు రాసిన లేఖలో తెలిపారు. ఎమ్మెల్యేలందరూ తనతో పాటు రాజ్‌భవన్‌కు వచ్చారని, అయితే లోపలికి అనుమతించలేదన్నారు. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఆయన ప్రస్తుత ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు.
ఇదీ కేసు..
జార్ఖండ్‌లో భూకుంభకోణం ఆరోపణలపై హేమంత్ సోరెన్‌పై ఈడీ దర్యాప్తు జరుగుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు దర్యాప్తు సంస్థతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని జేఎంఎం నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలో సోరెన్ ఈడీ అధికారులపై కేసు పెట్టారు. తాజాగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు పిటిషన్‌ని శుక్రవారానికి వాయిదా వేసింది.
Updated Date - Feb 01 , 2024 | 05:49 PM