Nobel Prize : ప్రోటీన్లపై పరిశోధనలకు పట్టం!
ABN, Publish Date - Oct 10 , 2024 | 05:56 AM
ఈ ఏడాది కూడా రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలను ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి వరించింది. ప్రోటీన్ల నిర్మాణానికి సంబంధించిన పరిశోధనలకుగానూ డేవిడ్ బేకర్, డెమిస్ హస్సాబిస్, జాన్ జంపర్‌లను ఈ ఏడాది నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్
రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి
డేవిడ్ బేకర్, హస్సాబిస్, జంపర్‌కు దక్కిన గౌరవం
స్టాక్‌హోం, అక్టోబరు 9: ఈ ఏడాది కూడా రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలను ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి వరించింది. ప్రోటీన్ల నిర్మాణానికి సంబంధించిన పరిశోధనలకుగానూ డేవిడ్ బేకర్, డెమిస్ హస్సాబిస్, జాన్ జంపర్‌లను ఈ ఏడాది నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బుధవారం ప్రకటించింది. కంప్యుటేషనల్ ప్రోటీన్ డిజైన్‌కుగానూ బేకర్‌కు, ఆ ప్రోటీన్ల నిర్మాణాన్ని అంచనా వేసినందుకుగానూ డెమిస్, జంపర్... నోబెల్ అందుకోనున్నారు. డేవిడ్ బేకర్ అమెరికాలో సియాటిల్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. హస్సాబిస్, జంపర్ ఇద్దరూ లండన్‌లోని గూగుల్ డీప్‌మైండ్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి ప్రతిష్ఠాత్మక అవార్డుతోపాటు రూ.8.90 కోట్లు ప్రైజ్‌మనీ దక్కనుంది. దీనిలో.. కంప్యుటేషనల్ ప్రోటీన్ డిజైన్ చేసిన బేకర్‌కు సంగం ప్రైజ్‌మనీ ఇవ్వనుండగా.. మిగతా సగాన్ని హస్సాబిస్, జంపర్ పంచుకోనున్నారు. క్వాంటమ్ డాట్‌ల ఆవిష్కరణకుగానూ గతేడాది కూడా ముగ్గురు శాస్త్రవేత్తలు మౌంగి బవెండి, లూయిస్ బ్రూస్, అలెక్సీ ఎకిమోవ్ రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. 2003లో బేకర్ ఒక కొత్త ప్రోటీన్‌ను రూపొందించారు. ఆ తర్వాత దాని ఆధారంగా అతని పరిశోధన బృందం రకరకాలుగా దాదాపు 200 మిలియన్ల కొత్త ప్రోటీన్లను ఉత్పత్తి చేసింది. వీటిలో ఔషధాలు, వ్యాక్సిన్లు, నానో పదార్థాలు, చిన్నసెన్సర్లుగా ఉపయోగించగల ప్రోటీన్లు కూడా ఉన్నాయి. కాగా... బేకర్ బృందం రూపొందించిన ఈ 200 మిలియన్ల ప్రోటీన్ల నిర్మాణాన్ని అంచనా వేయగలిగే కృత్రిమ మేధస్సు (ఏఐ) నమూనాను హస్సాబిస్, జంపర్ రూపొందించారు. అమినో ఆమ్ల క్రమం, ప్రోటీన్ల నిర్మాణం మధ్య సంబంధాలను కనుగొనేందుకు వారు చేసిన పరిశోధనలకుగానూ ఈ అవార్డుతో గౌరవిస్తున్నామని రసాయన శాస్త్ర నోబెల్ కమిటీ చైర్మన్ హీనర్ చెప్పారు.
Updated Date - Oct 10 , 2024 | 05:56 AM