Yogi Adityanath: అప్పటిలా.. ఇప్పుడు కర్ఫ్యూ లేదు, ఫైరింగ్ లేదు
ABN, Publish Date - Jan 22 , 2024 | 04:28 PM
రాముడు పుట్టిన అయోధ్యలో రామాలయం నిర్మించాలన్న 500 ఏళ్ల నాటి ప్రజల కల నేటికి సాకారమైందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.1990లో కరసేవకులకు ఎదురైన అనుభవాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పుడు అయోద్యలో ఎలాంటి కర్ఫ్యూలు, కాల్పులు లేవన్నారు.
అయోధ్య: రాముడు పుట్టిన అయోధ్యలో రామాలయం (Ayodhya Ram Temple) నిర్మించాలన్న 500 ఏళ్ల నాటి ప్రజల కల నేటికి సాకారమైందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) అన్నారు. రామ్ లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం అనంతరం సోమవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తమ ఆరాధ్యదైవాన్ని సరైన ప్రాంతంలో ప్రతిష్ఠించాలని మెజారిటీ కమ్యూనిటీ చిరకాల పోరాటం చేయడం చరిత్రలో ఇదే మొదటిసారని అన్నారు. 1990లో కరసేవకులకు ఎదురైన అనుభవాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పుడు అయోద్యలో ఎలాంటి కర్ఫ్యూలు, కాల్పులు లేవన్నారు. యావద్దేశం ఇప్పుడు 'అయోధ్యా థామ్' అయిందని అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీని ప్రపంచంలోని అత్యంత జనాకర్షణ కలిగిన నేతగా కొనియాడారు.
''ఎక్కడైతే రామాలయం కట్టాలనుకుని మనం బలంగా తీర్మానించుకున్నామో అక్కడే రామాలయ నిర్మాణం సాధించుకున్నాం. ఈ శుభ తరుణాన్ని వర్ణించడానికి మాటలు కూడా పెగలడం లేదు. ప్రతి ఒక్కరూ భావోద్వేగంతో, సంతోషంతో తడిసి ముద్దవుతున్నారు. ఈ చారిత్రక క్షణాల్లో దేశంలోని ప్రతి పల్లె, నగరం అయోధ్యగా మారింది. ప్రతి మార్గం రామజన్మభూమికి దారితీసింది'' అని యోగి ఆదిత్యనాథ్ సంబరం వ్యక్తం చేశారు. ఈరోజు జాతికి గర్వకారణమైన రోజని, దేశమంతటా రామయ్య నామం మారుమోగుతోందని, త్రేతాయుగంలోకి వచ్చినట్టు ఉందని అన్నారు.
Updated Date - Jan 22 , 2024 | 04:28 PM