ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ప్రొఫెసర్‌ సాయిబాబా నిర్దోషి

ABN, Publish Date - Mar 06 , 2024 | 04:26 AM

మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై గత పదేళ్లుగా జైలులో ఉన్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబాను బాంబే హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌ నిర్దోషిగా ప్రకటించింది.

ఆరోపణలను ప్రాసిక్యూషన్‌ నిరూపించలేకపోయింది

దిగువ కోర్టు తీర్పు న్యాయసూత్రాల మేరకు లేదు

కాబట్టే కొట్టివేస్తున్నాం, యావజ్జీవ శిక్షను రద్దు చేస్తున్నాం

ఈ కేసులో మరో ఐదుగురూ నిర్దోషులే: బాంబే హైకోర్టు

సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం

నాగ్‌పూర్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై గత పదేళ్లుగా జైలులో ఉన్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబాను బాంబే హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌ నిర్దోషిగా ప్రకటించింది. సాయిబాబాపై ఉన్న ఆరోపణలను నిరూపించటంలో ప్రాసిక్యూషన్‌ పూర్తిగా విఫలమైందని ధర్మాసనం పేర్కొంది. 54 ఏళ్ల సాయిబాబాపై ఉన్న యావజ్జీవ కారాగార శిక్షను కోర్టు కొట్టివేసింది. ఆయనతోపాటు ఇదే కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న హేమ్‌ మిశ్రా, మహేష్‌ టిర్కీ, నారాయణ్‌ సాంగ్లీకర్‌, ప్రశాంత్‌ రాహి, పాండు నరోటెలు కూడా నిర్దోషులేనని తీర్పు చెప్పింది. ఈ ఆరుగురిలో పాండు నరోటె ఇప్పటికే మరణించారు. జస్టిస్‌ వినయ్‌ జోషి, జస్టిస్‌ వాల్మీకి ఎస్‌ఏ మెంజె్‌సలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ మంగళవారం ఈ తీర్పు ఇచ్చింది. నిందితులపై ఉగ్రవాద కార్యకలాపాల వ్యతిరేక చట్టం ఉపా కింద అభియోగాలు నమోదు చేయటానికి గతంలో ప్రాసిక్యూషన్‌కు లభించిన అనుమతి చెల్లదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో గతంలో విచారణ కోర్టు ఇచ్చిన తీర్పు న్యాయసూత్రాల మేరకు లేదని, కాబట్టే దానిని పక్కనపెట్టి నిందితులందరినీ విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నామని తెలిపింది. కాగా, తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్‌ దాఖలు చేయటానికి వీలుగా తీర్పు అమలును ఆరు వారాలపాటు నిలిపివేయాలని ప్రాసిక్యూషన్‌ న్యాయవాది మౌఖికంగా కోర్టును కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. స్టే కోరుతూ విజ్ఞాపనను దాఖలు చేయమని ఆదేశించింది. ఈ నేపథ్యంలో, మహారాష్ట్ర ప్రభుత్వం బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

మావోయిస్టులతో భేటీకి ఏర్పాటు చేశారని..

ఐదేళ్ల వయసులోనే పోలియో సోకడంతో సాయిబాబాకు 90 శాతానికిపైగా వైకల్యం ఏర్పడింది. చిన్ననాటి నుంచే ఆయన వీల్‌చైర్‌కు పరిమితమయ్యారు. ఢిల్లీ యూనివర్సిటీకి అనుబంధంగా ఉండే రామ్‌లాల్‌ ఆనంద్‌ కాలేజీలో సాయిబాబా ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌గా పని చేసేవారు. ఆయనకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు పలుమార్లు ఆరోపించారు. మావోయిస్టులతో భేటీ కానున్నారనే ఆరోపణలపై హేమ్‌ మిశ్రా, ప్రశాంత్‌ రాహీలను పోలీసులు 2013లో అరెస్టు చేశారు. వారు మావోయిస్టులను కలిసేందుకు ప్రొఫెసర్‌ సాయిబాబా ఏర్పాటు చేశారని 2014లో మహారాష్ట్ర పోలీసులు సాయిబాబాను ఢిల్లీలోని ఆయన ఇంటిలోనే అరెస్టు చేశారు. అప్పటి నుంచి నాగ్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో ఉన్నారు.

ఇంటికి తిరిగొచ్చే వరకూ ఆందోళనే!

ప్రొఫెసర్‌ సాయిబాబాను హైకోర్టు విడుదల చేస్తూ తీర్పు ఇవ్వటంపై ఆయన భార్య వసంత కుమారి హర్షం వ్యక్తం చేశారు. చాలా సంతోషంగా ఉందని, అయితే, 2022లో కూడా ఇలాగే తీర్పు వచ్చినప్పటికీ.. ఆ తీర్పును ప్రభుత్వం సవాల్‌ చేసిందని, కాబట్టి, ఈసారి సాయిబాబా ఇంటికి వచ్చే వరకూ కుటుంబమంతా ఆదుర్దాగానే ఎదురు చూస్తుంటామని తెలిపారు. తన భర్త జైలులో ఉన్న పదేళ్లు తమకు మానసికంగానేగాక ఆర్థికంగానూ సవాళ్లతో కూడుకున్న కష్ట కాలమని ఆవేదన వ్యక్తం చేశారు. సాయిబాబా తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్‌ ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ‘సాయిబాబాను పదేళ్ల తర్వాత నిర్దోషిగా తేల్చారు. ఆ నష్టానికి బాధ్యులెవరు’ అని ప్రశ్నించారు.

Updated Date - Mar 06 , 2024 | 04:26 AM

Advertising
Advertising