ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కోల్‌కతా ఆర్జీ కర్‌ ఆస్పత్రిపై దాడి!

ABN, Publish Date - Aug 16 , 2024 | 05:15 AM

జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన కోల్‌కతా ఆర్జీ కర్‌ వైద్యకళాశాల ఆస్పత్రిలో బుధవారం అర్ధరాత్రి భయానక వాతావరణం నెలకొంది. గుర్తుతెలియని దుండగులు ఆస్పత్రిలో పెను విధ్వంసం సృష్టించారు. ఆందోళనకారుల ముసుగులో ఆ పరిసరాల్లోకి వచ్చిన గూండాలు ఆస్పత్రిలోకి చొచ్చుకెళ్లారు.

నిరసనకారుల ముసుగులో చొచ్చుకెళ్లిన 40మంది దుండగులు.. ఆస్పత్రి ఆస్తుల ధ్వంసం

ఎమర్జెన్సీ విభాగం, నర్సింగ్‌ సెక్షన్‌ మెడిసిన్‌ స్టోర్‌లో విధ్వంసకాండ

పోలీసు వాహనం.. పలు బైక్‌ల ధ్వంసం

బాష్పవాయువు, లాఠీచార్జితో పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు

కోల్‌కతా, ఆగస్టు 15: జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన కోల్‌కతా ఆర్జీ కర్‌ వైద్యకళాశాల ఆస్పత్రిలో బుధవారం అర్ధరాత్రి భయానక వాతావరణం నెలకొంది. గుర్తుతెలియని దుండగులు ఆస్పత్రిలో పెను విధ్వంసం సృష్టించారు. ఆందోళనకారుల ముసుగులో ఆ పరిసరాల్లోకి వచ్చిన గూండాలు ఆస్పత్రిలోకి చొచ్చుకెళ్లారు. దవాఖానా ఆస్తులు, విలువైన వైద్యపరికరాలను ధ్వంసం చేశారు. హత్యాచార ఘటనపై నిరసన వ్యక్తం చేస్తున్న జూనియర్‌ డాక్టర్లపైనా దాడికి పాల్పడ్డారు. బుధవారం రాత్రి 11:55 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. జూనియర్‌ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన నేపథ్యంలో మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ‘స్వాతంత్య్రం సిద్ధించిన ఆ అర్ధరాత్రిని తిరిగి పొందుదాం’ (రీక్లెయిమ్‌ ది నైట్‌) అనే పేరుతో పశ్చిమ బెంగాల్‌ వ్యాప్తంగా ముఖ్య ప్రాంతాల్లో బుధవారం రాత్రి ప్రదర్శనలు జరిగాయి. ఈ క్రమంలో కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ ఆస్పత్రి వద్దకు నిరసనకారుల ముసుగులో 40మంది దాకా గుర్తుతెలియని దుండగులు చేరుకున్నారు. వచ్చీరావడంతోనే పోలీసులపై రాళ్లు రువ్వుతూ ఆస్పత్రిలోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించారు. ఎమర్జెన్సీ విభాగం, నర్సింగ్‌ సెక్షన్‌, మెడిసిన్‌ స్టోర్‌లో విధ్వంసం సృష్టించారు. సీసీ కెమెరాలనూ పగులగొట్టారు. జూనియర్‌ డాక్టర్‌పై హత్యాచారం ఘటనకు నిరసనగా ఆగస్టు 9 నుంచి అక్కడి వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేదిక వద్దకొచ్చి భయానక వాతావరణాన్ని సృష్టించారు. గూండాల దాడిలో కొందరు వైద్యసిబ్బంది, పోలీసులకు గాయాలయ్యాయి. ఆస్పత్రి ప్రాంగణంలోని పోలీసు వాహ నం, కొన్ని ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు బాష్పవాయువును ప్రయోగించి.. లాఠీచార్జి చేసి ఆ మూకను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. గూండాల దాడిలో ఆస్పత్రి ఆస్తులకు తీవ్ర నష్టం జరిగిందని పోలీసులు చెప్పారు. ప్రణయ్‌ దాస్‌ అనే ఆస్పత్రి సెక్యూరిటీ గార్డు మాత్రం దుండగులు 500 నుంచి 1000 మంది దాకా ఉన్నారని చెప్పడం విశేషం. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటిదాకా తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచారం ఘటన తాలూకు ఆధారాలను చెరిపివేసేందుకే ఓ వర్గం ఈ దాడికి పాల్పడినట్లుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కోల్‌కతా పోలీసులు కీలక ప్రకటన చేశారు. ‘వైద్య కళాశాలలోని సెమినార్‌ రూంలో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచారం జరిగింది. ఘటనాస్థలి చెక్కుచెదరకుండా ఉంది. అక్కడికెవ్వరూ రాలేదు’ అని స్పష్టం చేశారు. తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు.. ఆస్పత్రిపై దుండగుల దాడిపై అక్కడి నర్సులు గురువారం ఉదయం తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆర్జీ కార్‌ ఆస్పత్రిపై దుండగల విధ్వంసాన్ని బెంగాల్‌ గవర్నర్‌ సీజీ ఆనంద బోస్‌ తీవ్రంగా ఖండించారు. ఆస్పత్రిపై దాడి ఘటన సభ్య సమాజానికి సిగ్గుచేటు అని పేర్కొన్నారు. గురువారం ఆయన ఆర్జీ కర్‌ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిపై గూండాల దాడిని భారత వైద్య మండలి (ఐఎంఏ) తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై ఆ రాష్ట్ర విభాగాలతో అత్యవసర సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఇక.. ఆర్జీ కర్‌ ఆస్పత్రిపై దుండగుల దాడికి బాధ్యత వహిస్తూ బెంగాల్‌ సీఎం మమత రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. అయితే.. ఆస్పత్రిపై దుండగుల దాడి వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయని.. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం ద్వారా ఇబ్బందులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు.

Updated Date - Aug 16 , 2024 | 05:15 AM

Advertising
Advertising
<