పీక మీద కత్తి పెట్టి.. ఏడుగురు రేప్ చేశారు..
ABN, Publish Date - Mar 04 , 2024 | 04:49 AM
దక్షిణాసియా పర్యటన కోసం ఎక్కడో స్పెయిన్ నుంచి బైక్‌లపై భారత్‌కు వచ్చిన పర్యాటకులు(ట్రావెల్ వ్లోగర్స్) ఆ దంపతులు.
ఝార్ఖండ్‌లో తనపై జరిగిన దారుణాన్ని
ఇన్‌స్టాలో వెల్లడించిన స్పెయిన్ యువతి
న్యూఢిల్లీ, మార్చి 3: దక్షిణాసియా పర్యటన కోసం ఎక్కడో స్పెయిన్ నుంచి బైక్‌లపై భారత్‌కు వచ్చిన పర్యాటకులు(ట్రావెల్ వ్లోగర్స్) ఆ దంపతులు. అయితే, భారత పర్యటన వారికి పీడకల మిగిల్చింది. ఆ జంటలోని 28 ఏళ్ల మహిళపై ఏడుగురు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఆ దంపతుల పీక మీద కత్తి పెట్టి, వారిని కొట్టి, హింసించి ప్రాణం తీస్తామని బెదిరించి ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారా కిరాతకులు. దేశానికే కళంకం తెచ్చిన ఈ ఘటన ఝార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో శుక్రవారం రాత్రి జరగ్గా... తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరిస్తూ బాధితురాలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ‘‘మేము ఆస్పత్రిలో ఉన్నాం. మాకు జరిగింది మరెవరికీ జరగకూడదు. నన్ను, నా భర్తను కొట్టారు. పీక మీద కత్తి పెట్టి చంపేస్తామని బెదిరించారు. నన్ను ఏడుగురు రేప్ చేశారు. మా వస్తువులను ఎత్తుకెళ్లారు’’ అని ఆమె వీడియోలో పేర్కొంది. కాగా, శుక్రవారం అర్ధరాత్రి తర్వాత అటుగా వచ్చిన పోలీసు వాహనాన్ని ఆపి తమకు జరిగిన దారుణాన్ని ఆ మహిళ వెల్లడించడంతో విషయం తమకు తెలిసిందని స్థానిక పోలీసులు వెల్లడించారు. దుమ్కా వద్ద ఓ నిర్మానుష్య ప్రదేశంలో తాత్కాలిక గుడారాన్ని వేసుకుని రాత్రి తాము నిద్రిస్తుండగా స్థానిక యువకులు లోపలికి ప్రవేశించి దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఏడుగురు నిందితులను గుర్తించామని వారిలో నలుగురిని ఇప్పటికే అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించారు.
Updated Date - Mar 04 , 2024 | 04:49 AM