రేసులో కమలాహారిస్ ముందంజ
ABN, Publish Date - Jul 22 , 2024 | 04:20 AM
అభ్యర్థిత్వం నుంచి తప్పుకొన్నట్టు బైడెన్ ప్రకటించారు సరే! మరి.. ఆయన స్థానంలో అధ్యక్ష పదవికి పోటీ పడబోయే అభ్యర్థి ఎవరు? ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ అభ్యర్థిత్వానికి మద్దతిస్తానని బైడెన్ చెప్పారుగానీ.. అది ఆయన అభిప్రాయం
ఆమెతో పోటీ పడుతున్న మిషిగన్, కాలిఫోర్నియా గవర్నర్లు
బైడెన్‌తో పోలిస్తే.. కమలను ఓడించడం సులువన్న ట్రంప్!
అభ్యర్థిత్వం నుంచి తప్పుకొన్నట్టు బైడెన్ ప్రకటించారు సరే! మరి.. ఆయన స్థానంలో అధ్యక్ష పదవికి పోటీ పడబోయే అభ్యర్థి ఎవరు? ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ అభ్యర్థిత్వానికి మద్దతిస్తానని బైడెన్ చెప్పారుగానీ.. అది ఆయన అభిప్రాయం మాత్రమే. అభ్యర్థిగా ఎవరు ఉండాలనేది డెమొక్రాట్లందరూ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. కమలాహారిస్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే కొందరు బహిరంగ వ్యాఖ్యలు కూడా చేశారు. ‘బైడెన్‌ను తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నామంటే.. కమలాహారిస్ అభ్యర్థిత్వాన్ని ఒప్పుకొంటున్నట్టు కాదు’ అన్నది వారి వాదన. సాధారణంగా.. అధ్యక్ష పదవికి తమ పార్టీ నుంచి ఎవరు పోటీలో ఉండాలో తేల్చుకోవడానికి అమెరికాలో పార్టీలు ప్రైమరీలు, కాక్‌సలు నిర్వహిస్తాయి. ప్రైమరీలంటే.. బ్యాలెట్ ద్వారా జరిపే ఓటింగ్. కాకస్ అంటే చర్చల ద్వారా జరిపే ఓటింగ్. డెమొక్రాట్ సభ్యుల్లో ఎవరి మద్దతు ఎవరికి ఉందో? ఎవరికి అత్యధికుల మద్దతు ఉందో? ప్రైమరీలు, కాక్‌సల ద్వారా తేలిపోతుంది. ఆ తర్వాత జరిగే పార్టీ జాతీయస్థాయి సదస్సులో ఎక్కువ మంది మద్దతు పొందిన అభ్యర్థి పేరును లాంఛనంగా ప్రకటిస్తారు. షెడ్యూలు ప్రకారం డెమొక్రాట్ల జాతీయస్థాయి సదస్సు ఆగస్టు 19న జరగనుంది. సమయం ఇంత తక్కువగా ఉన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో ప్రైమరీలు నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో నిర్వహించి (మినీ ప్రైమరీలు) అభ్యర్థిని ప్రకటించే అంశంపై డెమొక్రాట్లు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
డెమొక్రాట్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని కాంక్షిస్తున్నవారిలో మిషిగన్ గవర్నర్ గ్రెచెన్ విట్మర్, క్యాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ఉన్నట్టు సమాచారం. కానీ, వారికి కమలాహారి్‌సను మించి మద్దతు రాకపోవచ్చని పార్టీ సభ్యులే అభిప్రాయపడుతున్నారు. మిషెల్ ఒబామా పేరు కూడా వినిపిస్తోంది. అంతిమంగా పార్టీసభ్యులు వీరిలో ఎవరిని ఎంచుకుంటారో వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికైతే రేసులో కమలాహారిసే ముందంజలో ఉందని చెప్పొచ్చు. ఒకవేళ ఆ పార్టీ సభ్యులు కమలాహారి్‌సనే అభ్యర్థిగా ఎంచుకుంటే మాత్రం అమెరికా చరిత్రలోనే అదో మైలురాయిగా నిలిచిపోతుంది. ఒక నల్లజాతి, భారతీయ మూలాలు కలిగిన మహిళ అధ్యక్ష పదవికి పోటీ పడడం చరిత్రాత్మకమే అవుతుంది!! కాగా.. బైడెన్‌తో పోలిస్తే కమలాహారి్‌సను ఓడించడం తనకు చాలా సులువు అవుతుందని డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించినట్టు సీఎన్‌ఎన్ వార్తాసంస్థ రిపోర్టర్ ఒకరు ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.
Updated Date - Jul 22 , 2024 | 04:20 AM