ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jyoti Surekha : సహనంతోనే సాధించా..

ABN, Publish Date - Aug 14 , 2024 | 04:45 AM

గురి చూసి బాణం కొడితే యాభై మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కొట్టాల్సిందే. పతకం పట్టాల్సిందే. ఆ ఆర్చరీ అథ్లెట్‌ పేరు వెన్నం జ్యోతి సురేఖ. మనదేశంలోనే విలువిద్యలో మేటి క్రీడాకారిణి అనేందుకు సాక్ష్యం... ఇప్పటి వరకూ ఆమె సాధించిన 62 జాతీయ, 61 అంతర్జాతీయ పతకాలే నిదర్శనం. త్వరలో కెనడా, మెక్సికో దేశాల్లో

Sportswoman Jyoti Surekha

గురి చూసి బాణం కొడితే యాభై మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కొట్టాల్సిందే. పతకం పట్టాల్సిందే.

ఆ ఆర్చరీ అథ్లెట్‌ పేరు వెన్నం జ్యోతి సురేఖ. మనదేశంలోనే విలువిద్యలో మేటి క్రీడాకారిణి అనేందుకు సాక్ష్యం...

ఇప్పటి వరకూ ఆమె సాధించిన 62 జాతీయ, 61 అంతర్జాతీయ పతకాలే నిదర్శనం. త్వరలో కెనడా, మెక్సికో దేశాల్లో ప్రపంచ ఆర్చరీ పోటీల్లో పాల్గొనటానికి సిద్ధమవుతున్న క్రీడాకారిణి జ్యోతి సురేఖను ‘నవ్య’ పలకరించిందిలా...

కృష్ణా జిల్లాలోని చల్లపల్లి గ్రామం మాది. అమ్మ పేరు శ్రీ దుర్గ, నాన్న పేరు సురేంద్ర కుమార్‌. నాన్న వ్యవసాయం చేస్తారు. మేము ఉండేది... నేను చదివింది విజయవాడలోనే. ఇక నేనొక్కదాన్నే కావటంతో అల్లారుముద్దుగా పెంచారు. విభిన్నంగా ఆలోచించే మనస్తత్వం ఇద్దరిదీ. అందుకే మూడేళ్లప్పుడే స్విమ్మింగ్‌ క్లాసులో జాయిన్‌ చేశారు. అలా బాల్యంలో స్విమ్మింగ్‌ అంటే ఇష్టం పెంచుకున్నా. ఎంతంటే.. కేవలం నాలుగేళ్ల వయసులోనే ఏకంగా ఐదు కిలోమీటర్ల మేర కృష్ణానదిలో ఈదాను. ఊహ తెలియని వయసులో చేసిన ఫీట్‌ అది. ఎన్నో ప్రశంసలు అందుకున్నా. ‘యంగెస్ట్‌ స్విమ్మర్‌’గా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోకి ఎక్కాను. ఎందుకో తెలీదు కానీ.. మా పేరెంట్స్‌ విలువిద్యను నేర్చుకోమన్నారు. వారికి తెల్సినంతగా నా గురించి ఎవ్వరికీ తెలీదు కాబట్టి ‘సరే’ అన్నాను. వెంటనే స్విమ్మింగ్‌ వదిలేయటం బాధనిపించినా.. వదిలేశా. అలా పదకొండేళ్ల వయసులో(2007) ఆర్చరీలోకి వచ్చా.

అలా ఆత్మవిశ్వాసం..

ఆర్చరీలో జాయిన్‌ అవుతూనే కొత్తగా అనిపించింది. అది కాకుండా ఆ సమయంలో నేషనల్‌ స్విమ్మింగ్‌ పోటీ మిస్సయ్యాను. అయ్యో.. ఎందుకిలా చేశారని బాధపడ్డా. అయితే ఆర్చరీలో సాధన చేసే కొద్దీ ఇష్టం పెరిగింది. ఈ గేమ్‌లో ఏకాగ్రత, భుజబలం ఉండాల్సిందే అని అర్థమైంది. స్విమ్మింగ్‌ వల్ల భుజబలం వచ్చింది. అది ఆర్చరీకి ఉపయోగపడింది. ఇక ఏకాగ్రత నాకు ఎక్కువే. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రాక్టీస్‌ చేసేదాన్ని. బాగా గుర్తుంది.. నేషనల్‌ గేమ్స్‌ విజయవాడలో జరుగుతాయని.. కొన్ని నెలల ముందే నా చేతికి విల్లు ఇచ్చారు. తొలి నేషనల్‌ గేమ్స్‌లోనే ఆరు బంగారు పతకాలు వచ్చాయి. ఎనిమిదో తరగతిలో మెక్సికో వెళ్లి ఆడాను. విద్య, విలువిద్యను బ్యాలెన్స్‌ చేసుకోవాలని పేరెంట్స్‌ చెప్పేవారు. అలానే చేశా. నలంద విద్యానికేతన్‌లో ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకూ చదివా. పోటీలు ఉన్నప్పుడు ప్రాక్టీస్‌ చేసేదాన్ని. ప్రత్యేక క్లాసులు పెట్టించుకునేదాన్ని. అంతే కానీ చదువుల్లో వెనకపడలేదు. సాధన చేయటం.. గేమ్‌లో పతకాలు కొట్టడం.. అలా మెల్లమెల్లగా లాంగ్‌ రన్‌లో ఆర్చరీ అథ్లెట్‌గా నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అంతేకానీ ఓవర్‌నైట్‌లో ఏదీ రాలేదు. రాదు కూడా!

నామీద నాకే కోపం వచ్చేది..

కె.ఎల్‌. విశ్వవిద్యాలయం నుంచి బిటెక్‌, ఎంబీఏ చేశా. యూనివర్శిటీ యాజమాన్యం సపోర్టుగా నిలిచింది. ఏనాడూ ఇబ్బంది అవ్వలేదు చదువుకి. ట్యూషన్స్‌లో చదివి డిస్టింక్షన్‌ పాసయ్యాను. దాదాపు కాలేజీకి వెళ్లలేదు కాబట్టి విద్యార్థి జీవితం మిస్సయ్యాననే బాధ ఉంటుంది. అయితే చిన్నవయసులోనే దేశానికి ఆడగటం గొప్ప విషయమే అనిపిస్తుంది. గేమ్‌లోనే కాదు లైఫ్‌లోనూ స్ట్రగుల్స్‌ ఉంటాయి. అప్‌ అండ్‌ డౌన్స్‌ ఉండనే ఉంటాయి. వాటిని దాటుకుని ముందుకు వెళ్లాల్సిందే. కొందరు స్పోర్ట్స్‌ చాలా సులువు అనుకుంటారు. కష్టపడితే కానీ.. తెలీదు. ఏదీ సులువుగా రాదు. కొన్నిసార్లు బాగా ఆడినప్పటికీ మెడల్స్‌ రావట్లేదని బాధపడేదాన్ని. నామీద నాకే కోపం వచ్చేది. ఆ సమయంలో పేరెంట్స్‌ ‘నువ్వు చేసే పని చేయి.. తప్పకుండా వస్తాయి మెడల్స్‌’ అనేవారు. నాలో ధైర్యాన్ని నింపారు. ఆర్చరీ ఆటతో ఎంతో సహనం నేర్చుకున్నా.

అదే నా కల...

అమెరికా, యూరప్‌, చైనా, థాయ్‌లాండ్‌, టర్కీ, మెక్సికో, దక్షిణ కొరియా... లాంటి దేశాల్లో ఎక్కువగా పోటీలు జరుగుతాయి. 2007 నుంచి 26 జాతీయ, 57 అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నా. సక్సెస్‌ కంటే ఫెయిల్యూర్‌ ఇష్టం నాకు. మెడల్‌ వస్తే రెండు రోజులు సంతోషమే. ఫెయిల్యూర్‌ వస్తే సక్సెస్‌ అయ్యేంతవరకూ నాతోనే ఉంటుంది. గతేడాది చైనాలో జరిగిన ఏషియన్‌ గేమ్స్‌లో మూడు బంగారు పతకాలు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన వరల్డ్‌ కప్‌ పోటీల్లో మూడు బంగారు పతకాలు వచ్చాయి. నిల్చిపోయే విజయాలివి. గతంలో కంటే ఇప్పుడు వసతులు బావున్నాయి. కేంద్ర ప్రభుత్వం బాగా సపోర్టు చేస్తోంది. ఇప్పుడు ఆర్చరీలోకి అమ్మాయిలు బాగానే వస్తున్నారు. పదిహేడేళ్ల అదితి సీనియర్‌ వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌లో ఇండివిడ్యువల్‌గా గోల్డ్‌ కొట్టింది. ఇదో మంచి పరిణామం. అర్జున అవార్డు గ్రహీతను. స్పోర్ట్స్‌ కోటాలో డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం వచ్చింది. త్వరలో పోస్టింగ్‌ ఇవ్వనుంది ప్రభుత్వం. ఇకపోతే.. పదిహేడేళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఆర్చరీలో ఇంత సాధించానా? అనిపిస్తుంది. అమ్మానాన్న తీసుకున్న నిర్ణయమే సరైనదని అర్థమైంది. లేకుంటే ఇవాళ ఈ స్టేజ్‌లో ఉండేదాన్ని కాదేమో! ఇకపోతే ఇప్పటి వరకూ ఇన్ని పతకాలొచ్చాయి అని లెక్కపెట్టుకోను. ఎందుకంటే సాధించిన పతకాలు చెబుతూ కూర్చోలేం. ఆ ఆలోచనలు వదిలేస్తా. ఇక్కడ ఎప్పటికప్పుడు సాధన చేస్తూ.. ఫిట్‌నెస్‌, ప్రతిభను ప్రూవ్‌ చేసుకుంటేనే నిలబడగలం. ఇకపోతే దాదాపు ప్రతి టోర్నమెంట్‌లో పతకాలు ఉన్నాయి. వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌లో ఇండివిడ్యువల్‌ గోల్డ్‌ లేదు. దీంతోపాటు వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఇండివిడ్యువల్‌గా గోల్డ్‌ మెడల్‌ లేదు. ఆ రెండింటినీ సంపాదించాలన్నదే నా కల.’’

నా కూతురు అని కాదు కానీ.. మేము ఊహించని గొప్ప విజయాలు సాధించింది. నాలుగేళ్ల వయసులోనే స్విమ్మింగ్‌లో లిమ్కా రికార్డు అందుకుంది. మేం గేమ్‌ మార్చినా.. ఫోకస్‌ మారలేదు. ఆర్చరీలో అద్భుతమైన విజయాలు సాధించింది. పట్టిన పట్టు వదలదు. దేశం తరఫున సుదీర్ఘకాలం నుంచి విజయాల పరంపర కొనసాగిస్తోంది. ఒకే ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌ గోల్డ్‌ మెడల్స్‌ అందుకున్న వాళ్లు లేరు! పతకాలు కొట్టి దేశం పేరు నిలబెడుతున్నా.. రావాల్సినంత గుర్తింపు మా అమ్మాయికి రాలేదనేది నా అభిప్రాయం.

- సురేంద్ర కుమార్‌, తండ్రి

క్వాలిఫికేషన్‌ కోసం 720 పాయింట్స్‌ ఉంటాయి. అంటే 72 బాణాలు షూట్‌ చేయాలి. హైయస్ట్‌ పది పాయింట్స్‌ ఉంటాయి. తొమ్మిది, ఎనిమిది.. ఇలా పాయింట్స్‌ను లెక్కగడతారు. పాయింట్స్‌ బట్టి ర్యాంక్‌ ఇస్తారు. ఆ తర్వాత ఎలిమినేషన్‌ మ్యాచ్‌లు ఉంటాయి. పూల్‌గా డివైడ్‌ చేస్తారు. ఆ మ్యాచ్‌లో 15 బాణాలు సంధించాల్సి ఉంటుంది. ఎవరు ఎక్కువ స్కోరయితే వాళ్లు గెలుస్తారు. ఇద్దరి పాయింట్స్‌ సమానమైతే షూట్‌ ఆఫ్‌ ఉంటుంది. ఎవరి బాణమైతే సెంటర్‌కి క్లోజ్‌లో ఉంటుందో వారే విన్నర్‌ అవుతారు. ఖాళీగా ఉంటే పేరెంట్స్‌తో ఎక్కువ సమయం గడుపుతా. మంచి మ్యూజిక్‌ వింటా. ఫలానా ిసినిమా బావుంది అంటే చూస్తా. పజిల్‌ గేమ్స్‌ ఆడుతుంటా. ఖాళీగా ఉంటే ఇతర గేమ్స్‌ చూస్తుంటా. ఈసారి ఒలింపిక్స్‌ బాడ్మింటన్‌, షూటింగ్‌ విభాగాలను చూశా.

రాళ్లపల్లి రాజావలి

Updated Date - Aug 14 , 2024 | 04:45 AM

Advertising
Advertising
<