చెవిలోని జోరీగ..
ABN, Publish Date - Aug 20 , 2024 | 04:27 AM
చెవులంటే మనకు చెప్పలేనంత నిర్లక్ష్యం. చెవులను శుభ్రం చేయడం కోసం చేతికందిన వస్తువులను వాడేస్తూ ఉంటాం. ఎటువంటి రక్షణ చర్యలు పాటించకుండా స్విమ్మింగ్‌పూల్‌లోకి దూకేస్తూ ఉంటాం.
చెవులంటే మనకు చెప్పలేనంత నిర్లక్ష్యం. చెవులను శుభ్రం చేయడం కోసం చేతికందిన వస్తువులను వాడేస్తూ ఉంటాం. ఎటువంటి రక్షణ చర్యలు పాటించకుండా స్విమ్మింగ్‌పూల్‌లోకి దూకేస్తూ ఉంటాం. ఫలితంగా చెవుల్లో సమస్య తలెత్తినా, దాన్ని కూడా తెలిసిన చిట్కాతో పరిష్కరించే ప్రయత్నం చేస్తాం! కానీ ఇవన్నీ అంతిమంగా వినికిడి శక్తిని దెబ్బ తీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
విమాన ప్రయాణంలో చెవిపోటుతో ఇబ్బంది పడేవారుంటారు. చెవిలో శబ్దాలతో నిద్రపట్టక రాత్రంతా మేలుకునే వాళ్లూ ఉంటారు. గులిమితో చెవులు మూసుకుపోయి, వినికిడి శక్తిని పోగొట్టుకున్నవాళ్లు కూడా ఉంటారు. ఇవన్నీ చిన్నపాటి జాగ్రత్తలతో పరిష్కరించుకోదగిన సమస్యలే! ఇలాంటి చెవి సమస్యల గురించి కొంత అవగాహనతో మెలగగలిగితే, అసౌకర్యాలతో ఇబ్బంది పడే తిప్పలు తప్పుతాయి. సర్వసాధారణమైన చెవి సమస్యల గురించి మాట్లాడుకుంటే....
విమాన ప్రయాణాల్లో చెవి నొప్పి
కొందరికి విమాన ప్రయాణాల్లో చెవి పోటు వేధిస్తుంది. చెవులు దిబ్బెడ పడతాయి. చెవిలో శబ్దం బాధిస్తుంది. కొన్ని తీవ్రమైన పరిస్థితుల్లో కళ్లు తిరగడం, మత్తు తలెత్తుతాయి. అరుదుగా కొందర్లో కర్ణభేరి పగిలిపోయి, తీవ్రమైన నొప్పి, రక్తస్రావం కూడా మొదలవుతాయి. గాలి పీడనాల్లో చోటుచేసుకునే మార్పులకు తగ్గట్టుగా చెవుల్లోని యూస్టేషియన్ ట్యూబ్‌లు స్పందించని సందర్భాల్లో ఇలాంటి సమస్యలు వేధిస్తాయి. సాధారణంగా అంతర్జాతీయ విమనాలు 30 నుంచి 40 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి. ఆ సమయంలో అట్మాస్ఫియరిక్ ప్రెజర్ పాయింట్ 3 నుంచి పాయింట్ 2 ఉంటుంది. కాబట్టి విమానం క్యాబిన్ ప్రెజర్ ఒక అట్మాస్ఫియర్ ఉండేలా చూసుకోవాలి. కానీ విమానాల్లో పాయింట్ 7 లేదా పాయింట్ 8 అట్మాస్ఫియరిక్ ప్రెషర్‌నే మెయింటెయిన్ చేయగలిగే పరిస్థితి ఉంటుంది. దాంతో కొందర్లో చెవి పోటు మొదలవుతుంది.
పరిష్కారాలు ఇవే!
విమాన ప్రయాణం చేసే అందరికీ ఇలాంటి సమస్యలు తలెత్తవు. జలుబు వల్ల ముక్కులో కంజెషన్ ఉన్నవాళ్లు, అలర్జీలు, సైనసైటిస్ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవాళ్లు, పాలు తాగే పసిపిల్లలు, తరచూ విమాన ప్రయాణాలు చేసేవాళ్లలో ఈ సమస్య ఎక్కువ. ఈ కోవకు చెందిన వాళ్లు చిన్నపాటి చిట్కాలతో సమస్య తీవ్రతరం కాకుండా చూసుకోవచ్చు. అవేంటంటే...
విమానం గాల్లోకి లేచేటప్పుడు, కిందకు దిగేటప్పుడు ఆవులించడం, చూయింగ్ గమ్ నమలడం లాంటివి చేయాలి.
ముక్కును వేళ్లతో మూసి, నోరును గట్టిగా మూసేసి, ముక్కు ద్వారా గాలిని బయటకు ఊదే ప్రయత్నం చేసి, చెవి దిబ్బెడను తొలగించుకోవాలి.
ట్రావెలర్ ఇయర్ ప్లగ్స్ వాడుకోవాలి.
విమాన ప్రయాణం అసాంతం నీళ్లు తాగుతూ ఉండాలి.
జలుబు, దగ్గు ఉన్నవాళ్లు విమానం గాల్లోకి లేచే ముందు, నేల మీదకు దిగిన తర్వాత నేసల్ స్ర్పేలు వాడుకోవాలి.
జలుబు ఉన్న పసికందులకు కూడా నేసల్ డ్రాప్స్ వేయాలి.
స్కూబా డైవింగ్‌తో చెవి అసౌకర్యం
సాధారణంగా ఆకాశంలోకి పైకి వెళ్లేటప్పుడు వాతావరణ పీడనం తగ్గుతుంది. కానీ నీటి అడుగుకు వెళ్లేటప్పుడు పీడనం పెరుగుతుంది. ఒక్కొక అడుగు నీళ్ల దిగువకు డైవ్ చేసేకొద్దీ పీడనం కూడా క్రమేపీ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ పీడనాన్ని శరీరానికి అలవాటు చేయడం కోసం ఒక్కొక్క అడుగు దిగువకు దశలవారీగా విరామం తీసుకుంటూ డైవ్ చేయాలి. ఒక అడుగు దిగువకు చేరుకున్న తర్వాత కొంత సేపు ఆగి, తర్వాత ఇంకొక అడుగు కిందకు డైవ్ చేయాలి. అలాగే నీళ్ల పైకి చేరుకునేటప్పుడు కూడా ఒకేసారి పైకి వచ్చేయకుండా, నెమ్మదిగా రావాలి. లేదంటే శరీరంలోని వాయువులన్నీ కీళ్లలో ఉండిపోయి నడక కష్టమవుతుంది. విమాన ప్రయాణం చేసి గమ్యానికి చేరుకున్న 24 గంటల లోపు స్కూబా డైవింగ్, అండర్ వాటర్ స్పోర్ట్స్‌లో పాల్గొనకూడదు. అలాగే స్కూబా డైవింగ్, అండర్ వాటర్ స్పోర్ట్స్ ఆడిన 24 గంటల వరకూ విమాన ప్రయాణం చేయకూడదు. ఇలా చేస్తే, వాతావరణ పీడనంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పులను చెవులు తట్టుకోలేక, ఇబ్బంది పెడ తాయి.
చెవుల్లో చిక్కులు
పిల్లలు లెగోలను, బొమ్మలను, థర్మకోల్ బాల్స్‌ను చెవుల్లో పెట్టేసుకుంటూ ఉంటారు. పెద్దలు కూడా చెవులను శుభ్రం చేయడం కోసం ఇయర్ బడ్స్ వాడినప్పుడు, దూది చెవుల్లోనే ఇరుక్కుపోతూ ఉంటుంది. నేల మీద పడుకున్నప్పుడు బొద్దింకలు, గడ్డిలో పడుకున్నప్పుడు చీమలు, పురుగులు లాంటివి కూడా చెవుల్లోకి చేరిపోతూ ఉంటాయి. కొందరికి మెత్తని గులిమి చెవికి అడ్డుపడిపోయి, దాన్ని తొలగించడం కోసం చేసే ప్రయత్నాల ఫలితంగా అది మరింత లోపల ఇరుక్కుపోతూ ఉంటుంది. సాధారణంగా చెవుల్లో ఏదైనా ఇరుక్కుపోతే స్వయంగా బయటకు లాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేదంటే ఆన్‌లైన్‌లో దొరికే కొన్ని పరికరాలను కొనుగోలు చేసి, వాటి సహాయంతో సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రయత్నాల వల్ల ఇయర్ కెనాల్, కర్ణభేరి దెబ్బతినే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో శాశ్వతంగా వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం కూడా రావచ్చు.
పరిష్కారాలు ఇవే...
చెవిలో ఇరుక్కున్న వాటిని తొలగించే పనిముట్ల వాడకం మానేయాలి. మరీముఖ్యంగా ప్రత్యేకించి ఇందుకోసమే ఇంటర్నెట్‌లో దొరికే గ్యాడ్జెట్స్‌ను కొని వాడుకోవడం మానేయాలి. ప్రతి ఒక్కరి ఇయర్ కెనాల్ భిన్నంగా ఉంటుంది. మనం మన చెవుల్లోకి తొంగి చూడలేం కాబట్టి, చెవికి తగని గ్యాడ్జెట్స్‌ను ఉపయోగించడం వల్ల చెవి అంతర్భాగం దెబ్బతింటుంది.
ఇయర్ బడ్స్‌తో ఇరుక్కుపోయిన వస్తువులను బయటకు లాగే ప్రయత్నం చేయకూడదు
ఫోర్‌సెప్స్ ఉపయోగించకూడదు
తలను పక్కకు వంచితే ఫారిన్ బాడీ బయటకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చేయవచ్చు
చెవిలో చీమలు, పురుగులు చొరబడితే ఆలివ్ నూనె లేదా కొబ్బరినూనె వేసుకోవచ్చు. వాటితో అవి చనిపోయి, బయటకు వచ్చేస్తాయి.
మరీ ముఖ్యంగా ఈన్‌టి వైద్యులను కలిస్తే, వాళ్ల దగ్గర తగిన పరికరాలుంటాయి కాబట్టి కర్ణభేరి దెబ్బతినకుండా సమస్య నుంచి బయటపడవచ్చు.
చెవుల్లో గులిమి
చెవుల్లో స్వేద గ్రంథుల్లాంటి సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి. వాటి నుంచి వెలువడే స్రావాలే గులిమిగా ఏర్పడతాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు కలిగిన గులిమి, ఇన్‌ఫెక్షన్ల నుంచి చెవులను రక్షిస్తుంది. దుమ్ము, ధూళి చెవుల్లోకి చొరబడకుండా అడ్డుకుంటుంది. అలాగే చెవిలోని చర్మానికి కూడా తేమను అందిస్తుంది. కాబట్టి కొంత పరిమాణాల్లో చెవుల్లో గులిమి ఉండడం ఆరోగ్యకరం. ఇలా చెవుల్లో తయారయ్యే గులిమి, నమిలే క్రమంలో దవడలు కదలుతూ ఉన్నప్పుడు, దానంతట అదే బయటకు కూడా వచ్చేస్తూ ఉంటుంది. అరుదుగా కొందర్లో అవసరానికి మించి స్రావాలు స్రవించడం మూలంగా, ఇయర్ కెనాల్ ఇరుకుగా ఉండడం మూలంగా, చెవుల నిర్మాణం అసాధారణంగా ఉండడం మూలంగా గులిమి లోపలే పేరుకుపోతుంది. కొందర్లో ఇది చెవిని పూర్తిగా మూసేస్తుంది. దాంతో చెవి ఇన్‌ఫెక్షన్లు, నొప్పి రావచ్చు.
పరిష్కారాలు ఇవే
డ్రై వ్యాక్స్‌ను కరిగించే ఇయర్ డ్రాప్స్ వాడుకోవాలి
అనుభవజ్ఞులైన వైద్యులను కలిసి గులిమి తొలగించుకోవాలి
స్వయంగా గులిమిని తొలగించే ప్రయత్నం చేయకూడదు.
చెవుల్లో శబ్దాలు
ఈ సమస్యను వైద్య పరిభాషలో టిన్నిటస్ అంటారు. పబ్స్, పెళ్లిళ్లలో పెద్ద శబ్దాలకు బహిర్గతమైనప్పుడు తాత్కాలికమైన టిన్నిట్‌సకు గురవుతాం. ఈ సమస్య ఎనిమిది గంటలకు సర్దుకుంటుంది. కానీ చెవుల్లోని హియరింగ్ నాడి బలహీనపడినప్పుడు శాశ్వత టిన్నిట్‌సకు గురవుతాం! అలాగే టిన్నిట్‌సలో చెవిలో శబ్దాలు ఇతరులకు కూడా వినిపించే టిన్నిటస్ ఉంటుంది. కేవలం సమస్య ఉన్న వాళ్లకే చెవుల్లోపల శబ్దాలు వినిపించే పరిస్థితి ఉంటుంది. బయటివాళ్లకు కూడా వినిపించే శబ్దాలను అందుకు కారణమైన సమస్యను చికిత్సతో సరిదిద్దడం ద్వారా ఆబ్జెక్టివ్ టిన్నిటస్‌ను నయం చేయవచ్చు. హీమోగ్లోబిన్ తగ్గినవాళ్లలో కూడా ఈ రకమైన టిన్నిటస్ ఉంటుంది. కానీ సమస్య ఉన్నవాళ్లకి మాత్రమే చెవిలో శబ్దాలు వినిపించే సబ్జెక్టివ్ టిన్నిటస్ సమస్యకు శాశ్వత చికిత్స లేదు. కాబట్టి, ఆ సమస్యకు అలవాటుపడే జీవనశైలిని అలవరుచుకోవలసి ఉంటుంది. అందుకోసం...
ఏకాంతంగా, నిశ్శబ్దంగా ఉండే గదుల్లో నిద్రపోకుండా పరిసరాల శబ్దాలతో నిండిన ప్రదేశాల్లో నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి.
ఫ్యాన్ రెక్కలకు చిన్న కాగితాన్ని అంటించి, తిరిగేటప్పుడు శబ్దం వెలువడేలా చూసుకుని, ఆ గదిలో నిద్రపోవాలి
ఏదైనా మ్యూజిక్ వింటూ నిద్రపోయే ప్రయత్నం చేయాలి.
ఆందోళన వల్ల కూడా టిన్నిటస్ పెరుగుతుంది. కాబట్టి ఆందోళన తగ్గించుకోవాలి.
వినికిడి లోపం ఉన్నా టిన్నిటస్ వస్తుంది. అలాంటి వాళ్లు హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకోవాలి.
టిన్నిటస్ మార్కర్స్ పెట్టుకుని చెవుల్లోపలి శబ్దాలను తగ్గించుకోవచ్చు.
డాక్టర్ పి.వి.ఎల్.ఎన్ మూర్తి
పిడియాట్రిక్ ఈన్‌టి, స్నోరింగ్ అండ్ స్లీప్ ఆప్నియా సర్జన్,
స్టార్ హాస్పిటల్స్,
బంజారాహిల్స్, హైదరాబాద్
Updated Date - Aug 20 , 2024 | 04:27 AM