ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Dr. Prema Dhanraj : ఆమె లక్ష్యం అగ్ని రక్ష

ABN, Publish Date - Feb 19 , 2024 | 03:50 AM

తమిళనాడులోని వెల్లూరు క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రి (సిఎంసిహెచ్‌). డైరెక్టర్‌ జోసెఫ్‌ గదిలోకి అటెండర్‌ వచ్చి ‘‘సార్‌! ఎవరో డాక్టర్‌. మిమ్మల్ని కలవడానికి వచ్చారు’’ అని చెప్పాడు. ‘‘లోపలికి పంపించు’’ అని అన్నారు జోసెఫ్‌.

గొప్ప గాయని కావాలనే ఆమె ఆశ మంటల్లో కాలిపోయింది.

అందమైన ఆమె రూపం తనకే భయం పుట్టేంత వికారంగా మారింది. కానీ తల్లి

సంకల్పాన్ని తన దృఢ నిశ్చయంగా

మార్చుకున్నారు డాక్టర్‌ ప్రేమా ధనరాజ్‌.

పాతికవేల మందికి పైగా అగ్నిప్రమాద బాధితులకు ప్లాస్టిక్‌ సర్జరీతో కొత్త

జీవితాన్నిచ్చారు. తన స్వచ్ఛంద సంస్థ ద్వారా వారి జీవనోపాధికి సైతం దోహదం చేస్తున్నారు.

తమిళనాడులోని వెల్లూరు క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రి (సిఎంసిహెచ్‌). డైరెక్టర్‌ జోసెఫ్‌ గదిలోకి అటెండర్‌ వచ్చి ‘‘సార్‌! ఎవరో డాక్టర్‌. మిమ్మల్ని కలవడానికి వచ్చారు’’ అని చెప్పాడు. ‘‘లోపలికి పంపించు’’ అని అన్నారు జోసెఫ్‌. గదిలోకి ఒక అమ్మాయి ప్రవేశించి ‘‘డాక్టర్‌! నేను గుర్తున్నానా?’’ అని అడిగింది. లేదు అన్నారు జోసెఫ్‌. ‘‘నా పేరు ప్రేమా ధనరాజ్‌ సర్‌! మీరు నాకు సర్జరీలు చేశారు. చాలా రోజులు ఈ ఆసుపత్రిలోనే పేషెంట్‌గా ఉన్నాను. ఇప్పుడు డాక్టర్‌నయ్యాను’’ అని చెప్పిందామె. జోసెఫ్‌ ఆశ్చర్యంగా చూస్తూ ‘‘నిజమా? నువ్వు డాక్టర్‌ అయ్యావా?’’ అని అడిగారు. అవునన్నట్టు తల ఊపిందామె. ఆమె వైద్యురాలు కావాలనే నిర్ణయానికి బీజం పడింది కూడా ఆ ఆసుపత్రిలోనే.

వైద్యులు కనిపిస్తే అరిచేదాన్ని...

ప్రేమ స్వస్థలం బెంగళూర్‌. రోజీ స్టెల్లా, ధనరాజ్‌ దంపతుల నలుగురు సంతానంలో ఆమే పెద్దది. బంగారు రంగులో, చక్కటి కళ్ళతో... ఎంతో అందంగా ఉండే ప్రేమకు సంగీతం అంటే ప్రాణం. పోటీల్లో పాల్గొంటే బహుమతి గెలవాల్సిందే. అది 1965. ఎనిమిదేళ్ళ ప్రేమ స్కూల్‌లో జరిగే పాటల పోటీకి సిద్ధమవుతోంది. అమ్మా, నాన్నా బయటకు వెళ్ళడంతో... కాఫీ కాచడానికి స్టవ్‌ వెలిగించింది. కిరోసిన్‌ లేకపోవడంతో స్టవ్‌ మండలేదు. సీసాతో కిరోసిన్‌ తెచ్చి, స్టవ్‌లో పోస్తూండగా... హఠాత్తుగా మంటలు చెలరేగి ఆమె ముఖాన్ని తాకాయి. స్టవ్‌ పేలిపోయింది. ఆమె కేకలు విని ఇరుగు పొరుగువారు వచ్చి, ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ‘‘అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నా కింది పెదవి ఛాతీకి అంటుకుపోయిది. నా మెడ ఉందో లేదో తెలియడం లేదు. యాభై శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన నాకు ప్రథమ చికిత్స చేసిన తరువాత... వెల్లూరు సిఎంసిహెచ్‌కు బెంగళూరు వైద్యులు రిఫర్‌ చేశారు. నా గొంతులోంచి ట్యూబ్‌ అమర్చడానికి మూడు సర్జరీలు చేసినా... మెడ దగ్గర అవరోధం వల్ల అవన్నీ ఫెయిలయ్యాయి. ఆ సర్జరీల సమయంలో నరకం చూశాను. వైద్యులు కనిపిస్తే వారి మీద అరిచేదాన్ని’’ అని గుర్తు చేసుకున్నారు ప్రేమ. నాలుగో సర్జరీకి ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు... ఆమె తల్లి ‘‘దేవుడా! ఎలాగైనా నా బిడ్డను కాపాడు. ఆమెను వైద్యురాల్ని చేస్తాను. ఇదే ఆసుపత్రిలో ఆర్తులైన రోగులకు సాయపడేలా తీర్చిదిద్దుతాను’’ అని మొక్కుకున్నారు. పన్నెండు గంటలపాటు జరిగిన ఆ సర్జరీ విజయవంతమయింది. ఆరు నెలల తరువాత వెల్లూరు ఆసుపత్రి నుంచి బెంగళూరుకు ప్రేమ తిరిగొచ్చారు. ‘‘కాస్త కోలుకున్నాక మళ్ళీ బడికి వెళ్ళాలనుకున్నాను. కానీ నా ముఖం అందవికారంగా తయారైంది. పూర్తిగా కాలిపోయిన జుట్టు అప్పుడప్పుడే కాస్త వస్తోంది. అందరికీ ఎంతో ఇష్టమైన నా గొంతు బొంగురుగా మారిపోయింది. మంచి గాయని కావాలనుకున్న నా ఆశ నాశనమైపోయింది. రోజూ నాతో ఆడుకొనే పిల్లలు నా దగ్గరకు రావడం మానేశారు. అద్దంలో నా ముఖాన్ని చూసుకోవడానికి భయపడేదాన్ని. ఆ సమయంలో నా తోబుట్టువులు నాకు ధైర్యం చెప్పేవారు’’ అని తెలిపారు ప్రేమ.

అది దైవ నిర్ణయం

ఆమె హైస్కూల్‌ చదువంతా ప్రైవేటుగానే సాగింది. దాదాపు ఆరేళ్ళలో పధ్నాలుగు సర్జరీలు చేయించుకోవాల్సి రావడంతో... చదువుకు మూడేళ్ళ విరామం వచ్చింది. ఎక్కువసేపు మెడను నిలబెట్టి కూర్చోలేకపోవడంతో పాఠాలు చదవడానికి ఇబ్బందయ్యేది. కానీ డాక్టర్‌ కావాలనే తపన ఆ కష్టాన్నీ, వేదననూ భరించేలా చేసింది. మంచి మార్కులతో టెన్త్‌ పాసవడం ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇంటర్‌ పూర్తి చేశారు. హుబ్లీ మెడికల్‌ కాలేజీ నుంచి ఎంబిబిఎస్‌ డిగ్రీ అందుకున్నారు. తల్లి దేవుడికి చేసిన వాగ్దానం ప్రకారం... సిఎంసిహెచ్‌లో... డైరెక్టర్‌ హోదాకు చేరుకున్న డాక్టర్‌ జోసె్‌ఫను కలిశారు. అక్కడే వైద్యురాలుగా చేరారు. ఆయన ప్రోత్సాహంతో... లూథియానాలోని సిఎంసిలో ప్లాస్టిక్‌, రీకనస్ట్రక్షన్‌ సర్జరీలో స్పెషలైజేషన్‌ చేశారు. సర్జన్‌గా సిఎంసిహెచ్‌లో సేవలు అందించడం ప్రారంభించారు. ‘‘నన్ను ఆసుపత్రికి తీసుకువెళ్ళిన ప్రతిసారీ... మా అమ్మ నన్ను డాక్టర్‌ కుర్చీలో కూర్చున్నట్టు ఊహించుకొనేది. నన్ను రోగుల సేవకే అంకితం చేయాలన్న అమ్మ నిర్ణయాన్ని దేవుడి నిర్ణయంగానే పరిగణిస్తాను’’ అంటారు ప్రేమ. అగ్ని ప్రమాద బాధితులకు ప్లాస్టిక్‌ సర్జరీ చేయడంలో నిపుణురాలుగా అతి తక్కువ కాలంలోనే ఆమె పేరుపొందారు. మరోవైపు దేశ, విదేశీ వైద్య విద్యార్థులెందరికో సర్జరీలో శిక్షణ ఇచ్చారు. పాతికవేలకు పైగా ప్లాస్టిక్‌ సర్జరీలు చేసి, అగ్నిప్రమాద బాధితులకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ప్రస్తుతం వెల్లూరు సిఎంసిహెచ్‌లో ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం అధిపతిగా, యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సా్‌సలో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు. పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి పురస్కారాలు అందుకున్నారు.

బాధ్యత పెరిగింది...

సమాజానికి తన వంతు సేవ చేయాలనే ఆలోచనతో... 2002లో ‘అగ్ని రక్ష’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదాలకు గురైనవారికి సంపూర్ణమైన చికిత్స, పునరావాసం కల్పించడం ఈ సంస్థ లక్ష్యం. అంతేకాదు, బాధితులకు ఆరోగ్య కార్యకర్తలుగా శిక్షణనిచ్చి, ఉపాధి కూడా కల్పిస్తున్నారు. ‘‘ మా సంస్థ ద్వారా ఇప్పటివరకూ 18 వేల మంది అగ్ని ప్రమాద బాధితులకు చికిత్స చేశాం. సుమారు 17 మందికి కౌన్సెలింగ్‌ ఇచ్చాం. ఇంటి దగ్గరే వైద్యం, ఫిజియోథెరపీ, న్యాయపరమైన సహాయం లాంటివి పొందినవారి సంఖ్య దాదాపు 15 వేల వరకూ ఉంటుంది. పేద కుటుంబాల వారికి, ముఖ్యంగా మహిళలకు, పిల్లలకు సమగ్రమైన వైద్యంతో పాటు ఆదాయాన్ని పొందే అవకాశాలను కూడా కల్పిస్తున్నాం. వాళ్ళ జీవితాల్లో మార్పు కనిపించినప్పుడు... నన్ను వారి సేవకు అంకితం చేస్తానని మొక్కుకొని, అది సాధ్యం కావడానికి దోహదం చేసిన మా అమ్మ సంకల్పాన్ని తలచుకుంటాను. అది నాకు నిరంతరం ప్రేరణ ఇస్తూనే ఉంటుంది’’ అంటారామె. డాక్టర్‌ ప్రేమ సేవానిరతిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమెకు ఈ ఏడాది ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటించింది. ‘‘ఇది నాకు ఎంతో ప్రత్యేకం. ఎందరెందరో అభినందనలు చెబుతూ ఉంటే... నా బాధ్యత మరింత పెరిగినట్టు అనిపిస్తోంది. నాకు ప్రమాదం జరిగిన తరువాత ఎన్నో ఏళ్ళ పాటు శారీరకంగా, భావోద్వేగపరంగా, సామాజికంగా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాను. అలాంటి బాధ ఎవరూ పడకూడదు. బాధితుల్లో చాలామంది కుంగిపోతూ ఉంటారు. కానీ జీవితం అక్కడితో ముగిసిపోదు. ఇది కొత్త జీవితానికి ఆరంభంగా భావిస్తే... కొత్త దారులు కనిపిస్తాయి. దానికి నాకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు’’ అంటున్నారు ప్రేమ.

Updated Date - Feb 19 , 2024 | 03:50 AM

Advertising
Advertising