Kalki: కల్కి వచ్చేది అప్పుడే
ABN, Publish Date - Aug 16 , 2024 | 06:03 AM
కల్కి అవతారాన్ని భవిష్యత్తులో జరగబోయేదిగా మన పూర్వ ఋషులు వర్ణించారు. ఆయన జన్మించే శంభల గ్రామం ధర్మబద్ధమైనదనీ, అది సామాన్యులకు అగోచరంగా... అంటే కంటికి కనిపించకుండా ఉంటుందనీ కూడా వెల్లడించారు. కానీ ప్రజలలో కుతూహలం పెరిగి, వాటిపై రకరకాల కల్పిత కథనాలు ఊహాపోహలు
కల్కి అవతారాన్ని భవిష్యత్తులో జరగబోయేదిగా మన పూర్వ ఋషులు వర్ణించారు. ఆయన జన్మించే శంభల గ్రామం ధర్మబద్ధమైనదనీ, అది సామాన్యులకు అగోచరంగా... అంటే కంటికి కనిపించకుండా ఉంటుందనీ కూడా వెల్లడించారు. కానీ ప్రజలలో కుతూహలం పెరిగి, వాటిపై రకరకాల కల్పిత కథనాలు ఊహాపోహలు ఎక్కువయ్యాయి. నిరాధారమైన అప్రామాణిక కథలు చిలవలుపలవలుగా సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో సనాతన ధార్మిక గ్రంథాలు చెబుతున్న అసలు విషయాలను తెలుసుకొనే ప్రయత్నం చేయాలి. కల్కి ఈ యుగాంతంలో ఆవిర్భవించే అవతారం. ‘అథాసౌ యుగసంధ్యాయాం...’ అంటే ‘యుగసంధిలో...’ అని పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి. దానికి ఇంకా చాలా సమయం ఉంది.
సృష్టి స్థితి లయకారకుడైన పరమాత్మ... ధర్మ ప్రతిష్ఠాపన కోసం, అధర్మ నిర్మూలన కోసం తనను తాను యోగమాయా శక్తితో అవతరింపజేసుకుంటాడనేది సనాతన ధర్మ శాస్త్రాలు చెబుతున్న మాట. వాటిలో ప్రధానంగా... త్రేతాయుగంలో రామావతారం, ద్వాపర యుగంలో కృష్ణావతారం, కలియుగాంతంలో కల్కి అవతారం సంభవిస్తాయని పూర్వ ఋషులు పలుచోట్ల ప్రస్తావన చేశారు. ప్రజలు ఒకరంటే ఒకరికి గిట్టక... పరస్పర కలహాలతో ధర్మనాశనం జరిగే కాలం కలియుగం. ‘కల్యంతే కలహం కుర్వంత్యస్మిన్నితి కలిః’ అని వ్యుత్పత్తి. పాపం, దురాచారం, విచ్చలవిడితనం, మర్యాదారాహిత్యం, పరస్పర హింస, ప్రకృతి వైపరీత్యాలు లాంటి దుర్లక్షణాలు... కలి స్వభావాలు. దుర్మార్గులు పాలకులై, ధర్మ విరోధుల దాష్టీకాలతో దెబ్బతిన్న కలియుగంలో... ధర్మ రక్షణ కోసం శ్రీమహావిష్ణువు ఆవిర్భవిస్తాడనే విషయాన్ని ‘విష్ణుపురాణం’, ‘శ్రీమద్భాగవతం’, ‘విష్ణు ధర్మోత్తర పురాణం’ తదితర పురాణాలలో, కొన్ని కావ్యాల్లో వివరించారు. భాగవతానికి అనుబంధమైన ఉప పురాణం ‘శ్రీ కల్కి పురాణం’లో కల్కి కథ విస్తృతంగా వివరించి ఉంది.
ఇత్థం కలౌ గతప్రాయే జనేషు ఖర ధర్మిషు... ధర్మత్రాణాయ సత్త్వేన భగవానవతరిష్యతి... శంభల గ్రామ ముఖ్యస్య బ్రాహ్మణస్య మహాత్మనః... భవనే విష్ణుయశసః కల్కిః ప్రాదుర్భవిష్యతి... తదితర శ్లోకాల్లో కల్కి అవతార విశేషాలను ‘శ్రీమద్భాగవతం’ వర్ణించింది. ఇదే అర్థాన్ని ఇచ్చే వాక్యాలు, శ్లోకాలు ఇతర పురాణాలలోనూ ఉన్నాయి. ‘‘గాడిదల మాదిరిగా ప్రవర్తించే జంతుప్రాయులైన మానవుల వల్ల అధర్మం ప్రబలుతుంది. దానివల్ల ప్రకృతి వైపరీత్యాలు విజృంభిస్తాయి. ఆ సమయంలో భగవానుడు ధర్మ రక్షణ కోసం సత్త్వగుణంతో అవతరిస్తాడు. సకలలోక గురువైన, సర్వులకూ ఆత్మ అయిన, సర్వేశ్వరుడైన మహావిష్ణువు... సాధువులను రక్షించడానికి ఆవిర్భవిస్తాడు. శంభల గ్రామంలో విష్ణుయశుడనే వేదవేత్తకు తనయుడిగా జన్మిస్తాడు. దేవదత్తమనే అశ్వాన్ని అధిరోహిస్తాడు. మహాశక్తిమంతమైన ఖడ్గంతో... కపటపాలకులుగా ఉన్న దోపిడీదారులను, మ్లేచ్ఛులను హతమారుస్తాడు. ఆ తరువాత కృతయుగాన్ని స్థాపిస్తాడు’’ అని అవి వివరిస్తున్నాయి. గరుత్మంతుడి శక్తే అశ్వంగా పుడుతుందనీ, సర్మజ్ఞమనే శక్తి స్వామికి లీలాశుకంగా (చిలుక)గా ఉంటుందనీ పురాణాలు వర్ణించాయి. ముగ్గురు సోదరుల తరువాత కల్కి జన్మిస్తాడు. అతని పత్ని పద్మ. పరశురాముని దగ్గర శిష్యరికం చేసి, శివోపాసనతో అస్త్రవిద్యలను ఆర్జించి, ఆ తరువాత భూమి అంతటా పర్యటించి దుష్టత్వాన్ని నివారిస్తాడు.
కల్కిం కల్కవినాశార్థం ఆవిర్భూతం విదుర్భుధాః
నామా కుర్వంస్తతస్తస్య కల్కిరిత్యభివిశ్రుతమ్.. అని చెప్పింది కల్కి పురాణం. అంటే ‘కల్కమును వినాశనం చేయువాడు కల్కి’ అని అర్థం. ‘కల్కో అస్య అస్తి ఇతి హార్యతయా కల్కిః’ అనేది కల్కి నామానికి వ్యుత్పత్తి. ‘కల్కము’ అంటే కపటం, వంచన, పాపం, భయభ్రాంతులు తదితర అర్థాలు ఉన్నాయి. వాటన్నిటినీ తొలగించి, యదార్థ ధర్మాన్ని స్థాపన చేసేవాడు కల్కి.
ఇది భవిష్యత్ అవతారమే అయినా... విష్ణు స్వరూపమే కాబట్టి, ఈ కాలంలో కూడా ఈ నామంతో విష్ణువును ఆరాధించినా, స్మరించినా స్వామి కృప లభిస్తుంది. అలా ఆరాధించేవారికి కలి బాధ సోకకుండా స్వామి రక్షిస్తాడు. కాబట్టి కల్కిరూప శ్రీమన్నారాయణ స్మరణతో ధన్యులమవుదాం.
సామవేదం షణ్ముఖశర్మ
ఇవి కూడా చదవండి...
తెలంగాణ మహిళలపై కేటీఆర్ వ్యాఖ్యలు.. కాంగ్రెస్ సీరియస్
Drugs: హైదరాబాద్‌లో 620 గ్రాముల హెరాయిన్ పట్టివేత..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Aug 16 , 2024 | 02:02 PM