ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రతి జీవిలో పరమాత్మను దర్శించాలి

ABN, Publish Date - Aug 29 , 2024 | 11:25 PM

‘‘శ్రీమద్రామానుజులు ప్రవచించిన ఆధ్యాత్మిక ధర్మం, చూపిన సంస్కరణ మార్గం నేటి సమాజంలోని సమస్యలకు తరుణోపాయం’’ అంటారు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్‌ స్వామి. ఆయన సుమారు రెండున్నర దశాబ్దాల క్రితం శ్రీభాష్యకార సిద్ధాంత పీఠాన్ని స్థాపించి...

‘‘శ్రీమద్రామానుజులు ప్రవచించిన ఆధ్యాత్మిక ధర్మం, చూపిన సంస్కరణ మార్గం నేటి సమాజంలోని సమస్యలకు తరుణోపాయం’’ అంటారు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్‌ స్వామి. ఆయన సుమారు రెండున్నర దశాబ్దాల క్రితం శ్రీభాష్యకార సిద్ధాంత పీఠాన్ని స్థాపించి... శ్రీవైష్ణవ ధర్మ ప్రచారాన్ని, సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 27వ చాతుర్మాస్య దీక్షలో ఉన్న ఆయన ‘నివేదన’తో సంభాషించారు.

ఆధ్యాత్మికతను ఎలా నిర్వచిస్తారు?

ఆధ్యాత్మికత అంటే... తమను, ఈ జగత్తును సృష్టించిన భగవత్‌ తత్త్వాన్ని తెలుసుకోవడం, భగవంతుడి పట్ల భక్తి ప్రపత్తులు కలిగి ఉండడం. మన ఋషులు గ్రహించిన ధర్మం ఏదైతే ఉన్నదో... దాని గురించి పెద్దల ద్వారా వివరంగా తెలుసుకొని ఆచరించడం. జీవితంలో తటస్థించే అనేక సమస్యలను ఎదుర్కొంటూ, సుఖదుఃఖాలను సమానంగా భావిస్తూ, భగవన్నామ సంకీర్తనాదులతో, పవిత్రమైన భగవద్గాథల శ్రవణంతో, తత్సంబంధమైన ఆచరణతో జీవితాన్ని భగవన్మయం చేసుకోవడం.

పరివ్రాజక జీవనంలోకి ప్రవేశించడానికి ముందు మీ నేపథ్యం ఏమిటి?

స్వస్థలం గుంటూరు. కిడాంబి రత్నమాచార్యులు, వెంకట లక్ష్మివర్యుల కనిష్ట సంతానం. పారంపర్యంగా తిరువారాధన, స్వయమాచార్యత్వం ఉన్నాయి. మేము బికామ్‌ చదువుతున్న రోజుల్లో... శ్రీకృష్ణపరమాత్మ బలంగా ఆకర్షించాడు. తన కైంకర్యం తప్ప మరే కోరికా లేకుండా చేశాడు. అప్పటివరకూ సాధారణ యువకుడిగా జీవిస్తున్న మామీద నిర్హేతుకమైన కృపను ప్రసాదించి... తనవాణ్ణి చేసుకున్నాడు. శ్రీ వైష్ణవ సంప్రదాయ అనుష్ఠానపరులైన శ్రీమాన్‌ ఉభయవేదాంత ప్రవర్తకాచార్యులు తెలికచర్ల కందాడై గోపాలాచార్య స్వామివారి శిష్యత్వం కూడా ఆ భగవంతుడి అనుగ్రహమే. అది కూడా చాలా విచిత్రంగా జరిగింది. కృష్ణ భక్తుడైన ఒక వ్యక్తి కలిసి... మాకు దగ్గరలోని నడిగడ్డపాలెంలో కొందరు స్వాములు శ్రీకృష్ణ లీలల గురించి ప్రవచనం ఇస్తున్నారని చెప్పాడు. అక్కడికి వెళ్ళి చూస్తే... పెరియాళ్వార్‌ అనుగ్రహించిన ‘తిరుమొళి’ అనే గ్రంథ ప్రవచనం సాగుతోంది. ప్రవచనం ఇస్తున్నది కులపతులు శ్రీతెలికచర్ల కందాడై గోపాలాచార్యస్వామి. ఆయన శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్‌ స్వామివారితో సహా తొమ్మిదిమంది యతులకు (జీయర్‌లకు) గురువు. ఆయనను చూడగానే ‘ఈయనే మాకు ఆచార్యులు’ అని నిశ్చయం కలిగింది. ఇంతలో ఆయన ‘‘ఇక మేము ఎవ్వరికీ పాఠం చెప్పము’’ అని ప్రకటించారు. కార్యక్రమం ముగిశాక ఆయనను కలిసి ‘‘మాకు పాఠం చెప్పండి’’ అని విన్నవించుకుంటే.... ‘‘మేము చెప్పము’’ అన్నారు. ఆయనను ఎంతగానో ప్రార్థించాక... చివరకు ‘‘మళ్ళీ రా!’’ అన్నారు. అలా పదిహేనురోజులకు ఒకసారి... దాదాపు పదిసార్లు ఆయనను కలుసుకోవడం జరిగింది. అలా అయిదునెలల పాటు పరీక్షించారు. తమ శిష్యరికం చెయ్యాలన్న సంకల్పం మాలో దృఢంగా ఉందని నిశ్చయపరుచుకున్నాక శిష్యుడిగా స్వీకరించారు. తొమ్మిదేళ్ళపాటు సంప్రదాయ గ్రంథాల్లోని రహస్యాలను బోధించారు. భగవద్రారామానుజులు అనుగ్రహించిన గ్రంథాలను అధ్యయనం చేయించారు.

సన్న్యాసాశ్రమాన్ని ఎప్పుడు స్వీకరించారు?

ఆళ్వార్‌ తిరునగరి పెద్ద ఆత్తాన్‌ వరదాచార్య స్వామివారు, శ్రీశ్రీశ్రీ త్రిదండి మన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామివారు మంత్రదీక్ష ఇచ్చారు. మాకు ముప్ఫయ్యేళ్ళ వయసున్నప్పుడు... 1998 జూన్‌ 10న వానమామలైకి చెందిన కలియన్‌ రామానుజ జీయర్‌ స్వామి సన్యాసాశ్రమ దీక్ష ఇచ్చారు. శ్రీమాన్‌ నల్లాన్‌ చక్రవర్తుల రఘునాథాచార్యస్వామి శ్రీభాష్యాన్ని అనుగ్రహించారు. మా ఆచార్యులు సంతృప్తి చెందే విధంగా మమ్మల్ని తయారు చేసుకున్నదీ తన నిత్య కైంకర్యాలకు ఏలోటూ లేకుండా చేయించుకుంటున్నదీ ఆ శ్రీ భూ గోదాసమేత గోవింద పెరుమాళ్‌. ఇలా... ఒక సామాన్యుడు ఆధ్యాత్మికంగా ఎదగడం అనే అద్భుతం జరిగేలా చేసింది ఆ స్వామే.

మీ దినచర్య, నియమాలు ఎలా ఉంటాయి?

సన్న్యాసాశ్రమ ధర్మానుసారం నిత్యం మా ఆరాధ్యదైవమైన ఆ పెరుమాళ్‌ ఆరాధన, సంబంధిత అనుష్ఠానాలు, జపతపాలు ఉంటాయి. అలాగే చాతుర్మాస దీక్ష, ధనుర్మాస దీక్ష, ఏకాదశి వ్రతాలు పాటిస్తాం. నిత్యం నాతోపాటు నా అనుయాయులు స్వామివారి సేవతో పాటు వివిధ కార్యక్రమాలలో భాగమవుతారు. ప్రస్తుతం చాతుర్మాస దీక్షలో ఉన్నాం.

శ్రీమద్రామానుజాచార్యులు ప్రవచించిన ధర్మం నేటి సమాజానికి ఏ విధంగా మార్గదర్శకత్వం అందిస్తుంది?

మనుషులే కాదు, సకల చరాచర జీవకోటిలోనూ శ్రీమన్నారాయణుడు అంతర్యామిగా ఉంటాడు. వాటిని రక్షిస్తాడు. స్వామిని ఆశ్రయించినవారందరికీ ఆయన రక్షణ పొందడానికి సమానమైన అధికారం ఉంది అనే సత్యాన్ని సమాజంలో అందరూ తెలుసుకోవాలి. శరీరంలో ఒక భాగానికి కష్టం కలిగితే వేరొక భాగం వెంటనే ఎలా స్పందిస్తుందో... అలాగే సమాజంలోని అన్ని వర్గాలు కలిసికట్టుగా ఉండాలి. ఒకరి సుఖదుఃఖాలను వేరొకరు పంచుకోవాలి. తమ శ్రేయస్సునే కాకుండా... మొత్తం సమాజ శ్రేయస్సును కోరుకోవాలి. ఇదీ పన్నెండువందల ఏళ్ళ క్రితం శ్రీమద్రామానుజులు అందించిన సందేశం. ఎందుకంటే భక్తి వ్యక్తిగతమే కాదు, సామాజికం కూడా. వ్యక్తిగా తాము ఆచరించాలి. తద్వారా సమాజానికి ఆదర్శంగా నిలవాలి. వారు ఆదర్శాలతో సామాజిక ఉజ్జీవనం కలిగించడం ద్వారా... అది సామాజికంగా కూడా మారుతుంది. ఈ విధంగా భక్తి ద్వారా సమాజానికి సామరస్యత నేర్పిన సమతామూర్తి మన రామానుజులు. వైష్ణవ ధర్మానుసరణతో, సర్వ జగత్కారకుడైన శ్రీమన్నారాయణుడి పట్ల భక్తి ప్రపత్తులను కలిగి ఉండడం వల్ల... తమ తమ పూర్వ కర్మల కారణంగా ఏర్పడిన సుఖదుఃఖాల నుంచి విముక్తి కలుగుతుందనేది భగవద్రామానుజులు లాంటి పెద్దలు మానవాళికి అందించిన తరుణోపాయం. ఈనాటి పరిస్థితుల్లో... ఆధ్యాత్మిక సాధన ద్వారా ప్రజలు తమ ఒత్తిడులను పోగొట్టుకోవడం తప్ప వేరే మార్గం లేదు.

శ్రీభాష్యకార సిద్ధాంత పీఠ స్థాపనకు ప్రేరణ ఏమిటి?

సమాజంలోని అట్టడుగు వర్గాల వరకూ... భగవద్రామానుజ సిద్ధాంతానికి అనుగుణంగా భగవత్‌ తత్త్వాన్ని చేరవేయడానికే పీఠాన్ని స్థాపించాం.

శ్రీవైష్ణవ సంప్రదాయ పీఠాలు ఎన్నో ఉన్నాయి. మీ పీఠం ప్రత్యేకత ఏమిటి? ఇతర పీఠాలతో సమన్వయం ఎలా ఉంటుంది?

శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఎన్ని పీఠాలు ఉన్నా దేని ప్రత్యేకత దానిదే. వారివారి శక్త్యానుసారం సమాజ శ్రేయస్సు కోసం కార్యక్రమాలు చేయడం, ప్రజల్ని ఉత్తేజపరచి, సనాతన ధర్మాన్ని ఆచరించే విధంగా వారిని ముందుకు నడపడమే అన్ని పీఠాల ఉద్దేశం. ఈ క్రమంలో అన్ని పీఠాలు ఒక సమన్వయ పద్ధతిలో ఉండి తీరాల్సి ఉంది.


హిందూ ధర్మం నిమ్న వర్గాలకు దూరమయిందనే వాదన ఉంది. అందరికీ దాన్ని దగ్గర చేయడానికి మీ పీఠం చేస్తున్న కృషి, ఇతర కార్యక్రమాలు ఏమిటి?

అన్ని వర్గాలవారికి మన ధర్మం పట్ల విశ్వాసాన్ని కలుగజేసే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ‘భగవంతుడే రక్షకుడు’ అనే విశ్వాసంతో వచ్చినవారికి సమాశ్రయణ సంస్కారం (దీక్ష ఇవ్వడం) చేస్తున్నాం. వారికి భగవత్తత్వాన్ని విశదంగా తెలియజేసే గ్రంథాల సారాన్ని బోధిస్తున్నాం, మంత్రోపదేశం చేస్తున్నాం. గురు శిష్య పరంపరను కొనసాగించడం ద్వారా సనాతన ధర్మాన్ని కలకాలం నిలిపే ప్రయత్నం జరుగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, తిరుచానూరు, ముంగనూరు (హైదరాబాద్‌ సమీపంలో)లలో శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠాన్ని స్థాపించాం. శ్రీవైష్ణవ సంప్రదాయ ప్రచారం, ధర్మప్రచారం జరుగుతున్నాయి. మా సిద్ధాంతాలు, సంప్రదాయాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం అనేక పురాణ, ఇతిహాస, సంప్రదాయ గ్రంథాలను వ్యయప్రయాసలకోర్చి ముద్రిస్తున్నాం. సామాజిక కార్యక్రమాల్లో భాగంగా... శ్రీభాష్యకార ఎడ్యుకేషనల్‌ సర్వీస్‌ ట్రస్ట్‌ ద్వారా శ్రీవాగీశ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి... పలువురు వేదపండితులను సమాజానికి అందించాం. గోసంరక్షణ చేస్తున్నాం. సంప్రదాయ విద్య మాత్రమే కాదు... లౌకిక విద్యను అభ్యసించే ఎంతో మంది విద్యార్థులకు కూడా ఆర్థిక, వస్తు రూపేణా చేయూత అందిస్తున్నాం. మేము ఆరాధించే గోవిందుని కృపకు వారిని పాత్రులుగా చేస్తున్నాం. ఇక... 2000నుంచి 2016 వరకు... పదహారేళ్ళపాటు శ్రీమహాలక్ష్మీ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించాం. అనేకమంది ప్రజలను వాటిలో భాగస్వాముల్ని చేశాం. ఇప్పుడు మళ్ళీ ప్రతి సంవత్సరం శ్రీమహాలక్ష్మీ యాగాలు నిర్వహిస్తున్నాం. భీమవరం, మునగనూరుల్లో ఆలయ నిర్మాణాలు జరుగుతున్నాయి.

సమాజంలో ఎటువంటి మార్పును ఆశిస్తున్నారు?

పీఠం కార్యక్రమాల ద్వారా, ప్రవచనాల ద్వారా సనాతన ధర్మం పట్ల ప్రజల్లో అవగాహన కలిగించడం, వారిలో భగవంతుడి పట్ల భక్తి ప్రపత్తులు కలిగించడం... ఇదే మేము ఆశించేది. అంతేకాకుండా ‘వసుధైవ కుటుంబకమ్‌’ అనే సూక్తిని ఆచరణలో పెట్టడం ద్వారా ప్రతి జీవిలో అంతర్యామిగా ఉన్న పరమాత్మను దర్శించడం, సమాజంలో అహింసా ప్రవృత్తిని ప్రేరేపించడం కూడా.

చాతుర్మాస్య దీక్ష ప్రాధాన్యత ఏమిటి? పరివ్రాజకులందరికీ అది తప్పనిసరా?

ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘తొలి ఏకాదశి’ అంటారు. దానినే ‘శయన ఏకాదశి’ అని కూడా అంటారు. ఆ రోజు శ్రీమన్నారాయణుడు పాలకడలిలో, శేషపాన్పు మీద శయనిస్తాడు. అప్పటి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ ఈ చాతుర్మాస్య వ్రతం నడుస్తుంది. స్వామి శయనించడంతో... నిత్య సంచారులుగా ఉండే యతులు ఆషాఢ పూర్ణమి నుంచి కార్తీక పూర్ణిమ వరకూ తమ సంచారాలను నిలిపివేసి, ఒక చోటే ఉంటూ అనుష్ఠానాలు కొనసాగిస్తారు. ఏవైనా యజ్ఞ, యాగాది విశేష కార్యక్రమాలు, వాటి ప్రచార కార్యక్రమాలు ఉన్నప్పుడు... నాలుగు మాసాల ఈ వ్రతాన్ని నాలుగు పక్షాలుగా ఆచరిస్తారు. అది ఆషాఢ పూర్ణిమ నుంచి భాద్రపద పూర్ణిమ వరకు. భాద్రపద శుద్ధ ఏకాదశికి ‘పరివర్తన ఏకాదశి’ అని పేరు. అంటే శయనించిన స్వామి... ఒక వైపునకు ఒత్తిగిల్లుతారు. ఒత్తిగిల్లడం కూడా సగం మేలుకోవడం కాబట్టి... భాద్రపద పూర్ణిమకు కొందరు తమ దీక్షను విరమిస్తారు. కార్తీక శుద్ధ ఏకాదశికి ‘ఉత్థాన ఏకాదశి’ అని పేరు. అంటే శయనించే స్వామి మేలుకుంటారు. నాలుగు మాసాలు చాతుర్మాస వ్రతం చేసేవారు ఆ సమయంలో విరమణ చేస్తారు. ప్రధానంగా ఈ నాలుగు మాసాలు వర్షాకాలం. వర్షాలకు కీటకాదులు బయటకు వస్తాయి. యతులు సంచరించేటప్పుడు అవి వారి పాదాల కింద పడి మరణిస్తాయి. ఇది హింస చేయడమే. కాబట్టి యతులు ఒకే చోట ఉండి అనుష్ఠానాలు జరుపుకోవాలనే నియమం విధించారు. పరివ్రాజకులకు చాతుర్మాస్య వ్రతం తప్పనిసరి విధి. యతులను వారి చాతుర్మాస్యాల ఆధారంగానే ‘వృద్ధ యతులు’గా నిర్ణయిస్తారు తప్ప... వయసును బట్టి కాదు.

కృష్ణశర్మ

Updated Date - Aug 29 , 2024 | 11:25 PM

Advertising
Advertising