ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Aswini Dutt : తెలుగు సినిమాగతిని ‘కల్కి’ మార్చేసింది..!

ABN, Publish Date - Jun 30 , 2024 | 12:41 AM

తెలుగు సినీ చరిత్రలో వైజయంతి మూవీస్‌ బ్యానర్‌కు, దాని అధినేత అశ్వనీదత్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. 50 ఏళ్ల చలన చిత్ర ప్రస్థానం కలిగిన ఈ బ్యానర్‌పై నిర్మించిన తాజా చిత్రం ‘కల్కి’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. రికార్డులు సృష్టిస్తోంది. ‘‘ఈ బ్యానర్‌లో నా తొలి సినిమాకు అయిన ఖర్చు 15 లక్షలు. కల్కికి అయిన ఖర్చు

తెలుగు సినీ చరిత్రలో వైజయంతి మూవీస్‌ బ్యానర్‌కు, దాని అధినేత అశ్వనీదత్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. 50 ఏళ్ల చలన చిత్ర ప్రస్థానం కలిగిన ఈ బ్యానర్‌పై నిర్మించిన తాజా చిత్రం ‘కల్కి’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. రికార్డులు సృష్టిస్తోంది. ‘‘ఈ బ్యానర్‌లో నా తొలి సినిమాకు అయిన ఖర్చు 15 లక్షలు. కల్కికి అయిన ఖర్చు సుమారు 700 కోట్లు. 500 రెట్లు ఎక్కువ. నన్ను, నా కుటుంబాన్ని, మా బ్యానర్‌ను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలం?’’ అంటారు అశ్వనీదత్‌. ‘కల్కి’ విజయోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో- ఆయన ‘నవ్య’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.

ప్రపంచవ్యాప్తంగా ‘కల్కి’ సాధించిన విజయం మీకు ఎలా అనిపిస్తోంది?

దీని కోసమే 50 ఏళ్లు వేచి చూశామేమో అనిపిస్తోంది. మూడేళ్ల క్రితం ‘కల్కి’ షూటింగ్‌ ప్రారంభించాం. ఏ విషయంలోను ఎప్పుడూ తొందరపడలేదు. రాజీపడలేదు. ‘కల్కి-2’కు సంబంధించి కూడా సుమారు నాలుగు వేల అడుగుల ఫిల్మ్‌ షూట్‌ చేశాం. మిగిలింది పూర్తి కావాలి. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభిస్తాం.

సినిమా ప్రపంచంలో జయపజయాలు ఎప్పుడూ ఉంటాయి.. అపజయాలు ఎదురయినప్పుడు సినిమాల నుంచి విరమిద్దామని ఎప్పుడూ అనుకోలేదా?

ఒక్కసారి కూడా అనుకోలేదు. నాకు 22 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు సినిమా తీస్తానని గ్రేట్‌ ఎన్టీఆర్‌ దగ్గరకు వెళ్లా. అప్పుడు ఆయన- ‘‘నువ్వు చదువుకున్నావు. వ్యాపారం చేసుకోవచ్చు కదా! ఇక్కడ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు.. నేనే ప్రస్తుతం కొన్ని రోజులు ఖాళీగా ఉంటున్నాను’’ అన్నారు. కానీ నేను సినిమా తీస్తానని పట్టుపట్టాను. సినిమా తీశాను. ఆ రోజు నుంచి జయపజయాలు ఎన్నో చూశా. ‘శక్తి’ లాంటి ఘోర పరాజయాలు కూడా ఉన్నాయి. అలాంటి సమయాల్లో కూడా ‘ఇదొక పీడకల. వెళ్లిపోతుంది’ అనుకొనేవాణ్ణి.

మీకు ఇంత ఆత్మనిబ్బరం ఎక్కడి నుంచి వచ్చింది?

మా అమ్మ దగ్గర నుంచి వచ్చింది. నేను సినిమా రంగంలోకి వెళ్లటం మా నాన్నకు ఇష్టం లేదు. నేను అమ్మ దగ్గరకు వెళ్లి చెప్పాను చాలా గొడవ చేశాను ఆ సమయంలో నాకు మా అమ్మ పూర్తిగా మద్దతు ఇచ్చింది. వెన్నంటి నిలిచింది. నాన్నతో పోరాడింది. పట్టుదలగా నన్ను మద్రాసుకు పంపించింది. నా సక్సెస్‌ను తను కళ్లారా చూసింది. అందుకే మా అమ్మకు ఎప్పుడూ రుణపడి ఉంటాను.

ఇంత పెద్ద బడ్జెట్‌తో ‘కల్కి’ ఎలా తీయగలిగారు?

‘కల్కి’లాంటి సినిమాను తీయగలగటం కారణం- మా అమ్మాయిలు- స్వప్న, ప్రియాంక. వాళ్లిద్దరు అమెరికాలో చదువుకొని వచ్చారు. ఆ సమయంలో వాళ్లతో ఏదైనా ఒక పరిశ్రమ పెట్టించాలనుకున్నా. కానీ వాళ్లు సినిమా రంగంలోకి రావాలనుకున్నారు. స్వప్న ముందు చిన్న వీడియో చిత్రాలు తీసేది. ప్రియాంక వచ్చిన తర్వాత- ఇద్దరూ ప్రొడక్షన్‌లోకి వచ్చారు. ఆ సమయంలో వాళ్లకు కొన్ని ఫెయిల్యూర్స్‌ వచ్చాయి. వాళ్లు వాటిని తట్టుకొని నిలబడగలిగారు. ఆ తర్వాత మానసికంగా, శారీరకంగా చాలా కష్టపడి ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా తీశారు. అదొక టర్నింగ్‌ పాయింట్‌.

‘ఎవడే సుబ్రమణ్యం’ - ఒక భిన్నమైన సినిమా. దాని కథ చెప్పినప్పుడు మీరేమన్నారు?

నాకు వాళ్ల మీద నమ్మకం ఉండేది. కానీ అదొక భిన్నమైన సినిమా. ఆ కథ చెప్పినప్పుడు- ‘‘కథ డిఫరెంట్‌గా ఉంది. బావుంది.. తీయండి.. అనుభవం వస్తుంది కదా...’’ అన్నాను. కానీ ఆ సినిమా తీస్తే రిస్క్‌ ఉంటుందనే విషయం నాకు తెలుసు. వాళ్లకు అనుభవం వస్తే చాలనుకున్నాను. కానీ ఆ సినిమా చాలా పెద్ద సక్సెస్‌ అయింది. ఆ తర్వాత వాళ్లు చాలా నేర్చుకున్నారు. ఆ సినిమా తర్వాత ‘మహానటి’ తీశారు. ఆ సమయంలో నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే సావిత్రి గారు నాకు బాగా తెలుసు. అలాంటి గొప్ప నటి మీద చిత్రం తీయటం అంత సులభం కాదు. ‘నేను ఇలాంటి స్టోరీ చేయలేకపోయాను. పిల్లలు చేస్తున్నారు’ అనుకొనేవాణ్ణి.. బడ్జెట్‌ ఎక్కువయింది. పట్టించుకోవద్దని వాళ్లకు ధైర్యం చెప్పా. ఆ సినిమా కాపీ చూసిన తర్వాత మతి పోయింది. అంత గొప్పగా ఉందా సినిమా! ఆ తర్వాత ‘జాతి రత్నాలు’ పెద్ద హిట్‌. ఇలా వాళ్లకు సక్సెస్‌ అనేది ఒక్క రోజులో రాలేదు. ఒకో మెట్టు ఎక్కుతూ వచ్చారు. ఇప్పుడు శిఖరాన నిలబడ్డారు.

మీ సమయానికి, ఇప్పటికీ సినిమా నిర్మాణంలో ఎలాంటి మార్పులు వచ్చాయి?

మా రోజుల్లో హీరో ఇమేజ్‌ ఆధారంగా కథలను రూపొందించుకొనేవాళ్లం. హీరోలకు చెబితే వెంటనే ఒప్పుకొనేవారు. ప్రస్తుతం ఉన్నన్ని డిస్కషన్స్‌ ఉండేవి కావు. ప్రస్తుతం సినిమా నిర్మాణ ప్రక్రియ చాలా స్లో అయింది. అన్నీ జాగ్రత్తగా చూసుకొన్న తర్వాత మొదలుపెడుతున్నారు. అవుట్‌పుట్‌ కూడా అంత గొప్పగానూ వస్తోంది.

మీరు అనేక మంది హీరోలతో సినిమాలు తీసారు కదా.. వారిలో ఉన్న గొప్ప గుణాలేమిటి?

నా సినీ జీవితంలో బెస్ట్‌ టైమ్‌ చిరంజీవిగారి ఎంట్రీ తర్వాతే వచ్చిందని చెప్పాలి. ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’తో ఆయనతో ప్రారంభమయిన ప్రస్థానం మరో మూడు సినిమాల వరకూ సాగింది. ఎక్కడా చిన్న పొరపొచ్చాలు కూడా రాలేదు. మహానుభావుడని చెప్పాలి. ఆ తర్వాత నాగార్జునగారితో ఐదు సినిమాలు చేశాను. చాలా మంచి మనిషి. ఇక కృష్ణగారి గురించి చెప్పక్కర లేదు. గొప్ప వ్యక్తి. ‘అగ్నిపర్వతం’ సినిమా తీస్తున్నప్పుడు ఆయన అనేక సూచనలు ఇచ్చేవారు. ఇప్పుడు ప్రభాస్‌తో చేశా! తనకు కథ చెప్పినప్పుడు - ‘‘ఇది నా కోసం రాసిన కథ. నేను చేసి తీరతాను’’ అని మూడేళ్లు అన్నీ పక్కన పెట్టి సినిమాలో నటించాడు. విపరీతమైన సహకారం అందించాడు. మూడేళ్ల పాటు అతనికి ఈ సినిమా తప్ప వేరే ఆలోచనే లేదు. నేను చేసిన హీరోలందరూ నిర్మాత చల్లగా ఉండాలను కొనేవారే! మంచి సహకారం అందించిన వారే!

మీరు అనేక మంది దర్శకులతో పనిచేశారు. ఏ దర్శకుడితో నాగిని పోలుస్తారు?

నాగిపై ఏ దర్శకుడి ప్రభావం ఉన్నట్లు కానీ, పోల్చగలిగినట్లు కానీ నాకు అనిపించలేదు. తను ఏది అనుకున్నాడో అదే తీశాడు. ఎక్కడా ఎక్కువా లేదు, తక్కువా లేదు. ఒక సీను చూసి- ‘దీన్ని ఇంకా బాగా తీయవచ్చు’ అని నాకు ఎక్కడా అనిపించలేదు. గ్రాఫిక్స్‌ విషయంలో తను పడిన శ్రమ అసామాన్యం. తనకు ఇసుమంత గర్వం కూడా లేదు. ‘మహానటి’ సినిమాలో తన విశ్వరూపం చూపించాడు. అప్పుడు ‘భగవంతుడు నాకు అలాంటి అల్లుణ్ణి ఇచ్చాడు చాలు...ఎంత కాలమైనా సినిమాలు తీస్తూనే ఉంటా’ అనుకున్నా. ఇప్పుడు ‘కల్కి’తో తెలుగు సినిమాను వేరే స్థాయికి తీసుకువెళ్లాడు.


ప్రథమ కోపం

నేను బయట ఎక్కువగా ఎమోషన్స్‌ ప్రదర్శించను. అందరూ నా వాళ్లే కదా! బాధపడే అవకాశం ఉంటుంది. అయితే నాకు ప్రథమ కోపం ఎక్కువ. స్వప్నకు కూడా నా పోలికే ఎక్కువ వచ్చింది. తనకి కూడా నాలాగే షార్ట్‌ టెంపర్‌. కానీ వెంటనే సర్దుకుంటుంది. ఇక్కడ ఇంకో విషయం చెబుతాను. స్వప్న, ప్రియాంక- ఇద్దరూ ఒకే మాట మీద ఉంటారు. వారి అభిప్రాయాలు వేరుగా ఉండచ్చు. ఆలోచనా విధానం మాత్రం ఒకటే!

ఎన్టీఆర్‌ పెట్టిన పేరు!

సినిమా తీయటానికి వెళ్లినప్పుడు- ఎన్టీఆర్‌- ‘‘బ్యానర్‌కు ఏం పేరు పెట్టావు?’’ అని అడిగారు. ‘‘మీరు ఏ పేరు చెబితే ఆ పేరు పెడతా..’’ అన్నా. ఆయన అక్కడ ఉన్న కృష్ణుడి పటం వైపు చూశారు. ‘‘కృష్ణుడు మనకు అచ్చొచ్చిన దైవం కదా... ‘వైజయంతి మూవీస్‌’ అని పెట్టు..’’ అని ఒక కాగితంపై రాసి ఇచ్చారు. అలా ఆ మహానుభావుడితో పేరు పెట్టించుకొనే అదృష్టం దక్కింది.

ఎలా గుర్తుండాలంటే...

తెలుగు సమాజాన్ని, ప్రజలను అర్ధం చేసుకొని... వాళ్ల అభిరుచులను గమనిస్తూ.. వాళ్ల అంచనాలకు మించిన గొప్ప సినిమాలు తీసే నిర్మాతగా నన్ను చరిత్ర గుర్తుపెట్టు కోవాలనుకుంటున్నా!

కల్కి- పార్ట్‌ 2

‘కల్కి’ని మొదట రెండు భాగాలుగా తీద్దామని అనుకోలేదు. షూటింగ్‌ కొంత అయిన తర్వాత అనుకున్నారు. ‘‘కమల్‌హాసన్‌ క్యారెక్టర్‌ రెండో పార్ట్‌లోనే ఎలివేట్‌ అవుతుంది. దాని మీద ఎక్కువ వర్క్‌ చేద్దామనుకుంటున్నా’’ అని నాగీ చెప్పాడు. ‘కల్కి’ మొదటి పార్ట్‌ సూపర్‌ హిట్‌ అయింది. రెండోది కూడా మొదటి పార్ట్‌ కన్నా ఎక్కువ హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది. అమితాబ్‌, ప్రభాస్‌, కమల్‌ ముగ్గురు కలిసే సీన్స్‌ చాలా గొప్పగా ఉంటాయనిపిస్తుంది.

సమయం గడిచిపోయింది..

నా ఉద్దేశంలో తెలుగు సినిమా గతిని ‘కల్కి’ మార్చేసింది. మన దేశంలో వచ్చిన గ్రేటెస్ట్‌ ఫిల్మ్స్‌లో ఇది కూడా ఒకటి. ఇలాంటి సినిమా తీస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. గత మూడేళ్లు ఆడుతూ పాడుతూనే సెట్స్‌కు వెళ్లేవాడిని. ‘వాళ్లు ఒక మహాయజ్ఞం చేస్తున్నారు. దానికి సమిధలు సమకూర్చటమే నేను చేయాల్సింది’ అనుకున్నా! ఆ యజ్ఞ ఫలితం చూస్తుంటే విపరీతమైన ఆనందం కలుగుతోంది. పిల్లలను చూస్తుంటే- సినిమా తీసే విధానం నాకు కూడా తెలియదేమోననిపిస్తోంది. అమితాబ్‌, దీపిక, కమల్‌హాసన్‌, ప్రభాస్‌.. ఇలా దేశంలోనే అతి పెద్ద స్టార్స్‌ అందరినీ తీసుకువచ్చి సినిమా తీయటం అంత సులభం కాదు.

సీవీఎల్‌ఎన్‌ ప్రసాద్‌

Updated Date - Jun 30 , 2024 | 01:25 AM

Advertising
Advertising