ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌.. మూసీ పరివాహక ప్రాంతాల్లో కిషన్ రెడ్డి బస్తీ నిద్ర

ABN, Publish Date - Nov 17 , 2024 | 08:38 AM

మూసీ నది ప్రక్షాళన వ్యవహారం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. కొన్ని రోజులుగా మూసీ విషయంలో బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.1.50 లక్షల కోట్లతో మూసీ ప్రక్షాళన చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించిన నాటి నుంచి ఈ వివాదం మెుదలైంది. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రూ.25 వేల కోట్లను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ముడుపులు ఇచ్చేందుకే రేవంత్ ఈ ప్రాజెక్టు చేపడుతున్నారని ఆరోపించారు. మరోవైపు హైడ్రా పేరుతో బుల్డోజర్లను పేదల ఇళ్లపైకి తెచ్చి కూల్చివేస్తున్నారని కిషన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

1/6

మూసీ పరీవాహక బస్తీల్లో ఒక రోజు నిద్రించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని కిషన్‌రెడ్డి ప్రకటించారు. నవంబర్ 16 రాత్రి నుంచి నవంబర్ 17 ఉదయం 9గంటల వరకూ బస్తీ నిద్ర కార్యక్రమం చేపట్టినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. తనతోపాటు ఎంపీలు, పార్టీ ముఖ్యనేతలంతా బస్తీ నిద్ర కార్యక్రమంలో పాల్గొంటారని కేంద్ర మంత్రి చెప్పారు. ఇవాళ రాత్రి అంబర్‌పేట ప్రాంతంలోని తులసీ రామ్ నగర్‌లో తాను బస చేయనున్నట్లు వెల్లడించారు.

2/6

పేదల ఇళ్లల్లోనే పడుకోనున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. దాదాపు 20 ప్రాంతాల్లో బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కె.లక్ష్మణ్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి సహా ఇతర నేతలంతా బస్తీ నిద్ర కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు వెల్లడించారు. మలక్‌పేట శాలివాహన నగర్‌లో ఎంపీ లక్ష్మణ్‌, ఎల్బీ నగర్‌ ద్వారకాపురంలో ఎంపీ ఈటల రాజేందర్ బస్తీ నిద్ర చేయనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.

3/6

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటనలతో ప్రజలు భయపడుతున్నారని, ఎప్పుడు బుల్డోజర్‌ వచ్చి వారి ఇళ్లను కూలగొడుతుందోనని భయాందోళనలో ఉన్నారని చెప్పారు. పేద ప్రజలు కష్టపడి ఇళ్లు కట్టుకుని 40 ఏళ్లుగా నివాసం ఉంటున్నారని, ప్రభుత్వం వారి ఇళ్లను కూల్చి వేస్తామంటే తాము అడ్డుకుంటామని తెలిపారు. ‘‘మూసీ సుందరీకరణ ఉద్దేశ్యం ఏమిటి.. ప్రాజెక్టు ఎలా ఉండబోతోంది.. నిధులు ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు. పేదల ఇళ్లను కూల్చి రూ.లక్షా యాభై వేల కోట్లతో సుందరీకరణ అవసరమా’’ అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.

4/6

"మాకు సీఎం రేవంత్ రెడ్డి సవాళ్లు ముఖ్యం కాదు. ప్రజల కోసం నిలబడటం ముఖ్యం. మూసీ, హైడ్రాల పేరిట బుల్డోజర్లు ఇళ్ల మీదకు వస్తాయని పేద ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వారికి ధైర్యం ఇవ్వడం కోసమే ఇవాళ రాత్రి మూసీ బాధితుల ఇళ్లలో బస చేయాలని నిర్ణయించాం. రేపు ఉదయం వరకూ మూసీ ప్రాంతాల్లోని అన్ని బస్తీల్లో మా ఎంపీలు , ఎమ్మెల్యేలు ఉంటారు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వ పతనానికి ఆరంభం మాత్రమే. మున్ముందు మా కార్యాచరణ మరింత ఉద్ధృతంగా ఉంటుంది" అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

5/6

బస్తీ నిద్రలో పేద ప్రజలకు భరోసా కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, 8 జిల్లాలకు సంబంధించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు పాల్గొంటారని వెల్లడించారు. ఎట్టిపరిస్థితుల్లో కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లోని పేద ప్రజల ఇళ్లను కూల్చనివ్వబోమని అన్నారు. మూసీ సుందరీకరణ-పునరుజ్జీవం విషయంలో సమగ్రమైన నివేదిక బయటపెట్టాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

6/6

సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టే మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని మూసీ అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లు కూల్చి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలన్న ఆలోచనకే వ్యతిరేకమని కిషన్‌రెడ్డి అన్నారు. సీఎం రేవంత్‌‌వి ఊకదంపుడు ఉపన్యాసాలని విమర్శించారు. పేదల ఇళ్లు కూలగొట్టి పెద్ద షాపింగ్‌లు కట్టడమే రేవంత్‌రెడ్డి మూసీ ప్రక్షాళన అన్నారు. గతంలో మోదీ సబర్మతి నది ప్రక్షాళన కోసం దాదాపు 25వందల కిలోమీటర్లు 12నెలల్లో పూర్తి చేశారని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు.

Updated Date - Nov 18 , 2024 | 06:56 AM