YSRCP: మాకొద్దు బాబోయ్.. అని దండం పెట్టిన అలీ, వినాయక్.. తెరపైకి సుమన్!
ABN, Publish Date - Jan 27 , 2024 | 10:48 PM
Hero Suman AP Politics: టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్ (Hero Suman) రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారా..? రీల్ లైఫ్‌లో మంత్రిగా, ఎమ్మెల్యేగా.. ఎంపీగా ఇలా ఎన్నో పాత్రలు చేసిన హీరో.. ఇప్పుడు రియల్ లైఫ్‌లో ఒక్కసారైనా చట్ట సభల్లో అడుగుపెట్టాలని ఆశపడుతున్నారా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే పొలిటికల్ మూవీకి క్లాప్ కొట్టి వైసీపీ (YSR Congress) తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారా..? ఎంపీగా పోటీ చేయడానికి కూడా రంగం సిద్ధమైందా..? అంటే..
టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్ (Hero Suman) రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారా..? రీల్ లైఫ్‌లో మంత్రిగా, ఎమ్మెల్యేగా.. ఎంపీగా ఇలా ఎన్నో పాత్రలు చేసిన హీరో.. ఇప్పుడు రియల్ లైఫ్‌లో ఒక్కసారైనా చట్ట సభల్లో అడుగుపెట్టాలని ఆశపడుతున్నారా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే పొలిటికల్ మూవీకి క్లాప్ కొట్టి వైసీపీ (YSR Congress) తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారా..? ఎంపీగా పోటీ చేయడానికి కూడా రంగం సిద్ధమైందా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అక్షరాలా ఇదే అక్షరాలా నిజమనిపిస్తోంది. సుమన్ అసలు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకుంటున్నారు..? ఎక్కడ్నుంచి పోటీ చేయాలని ప్రచారం జరుగుతోంది..? వైసీపీలోనే ఎందుకు చేరాలని అనుకుంటున్నారు..? సుమన్ నుంచి అధికార పార్టీ ఏం ఆశిస్తోందనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) పొలిటికల్ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..
ఇదీ అసలు కథ..!
సుమన్.. తెలుగు సినీ ఇండస్ట్రీలో పరిచయం చేయనక్కర్లేని పేరు. చిన్న ఆర్టిస్టుగా సినీ జీవితం మొదలుపెట్టిన ఆయన అతి తక్కువ కాలంలోనే పెద్ద హీరోగా ఎదిగిపోయారు. ఆ తర్వాత సుమన్ జీవితంలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలతో కొన్నేళ్లు వెండితెరకు దూరంగా ఉండటం.. మళ్లీ క్రీజులోకి వచ్చి తన సత్తా ఏంటో చూపించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొన్ని కొన్ని పాత్రలు నాటి నుంచి నేటి వరకూ.. సుమన్ తప్ప మరెవ్వరూ చేయలేరంటే ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఇప్పుడు కూడా అతిథి పాత్రల్లో చేస్తూ సినిమాల్లోనే ఉన్నారు. సుమన్ సినీ కెరియర్ మొదలైనప్పట్నుంచి ఇప్పటి వరకూ బహుశా ఈయన నటించని పాత్ర లేదేమో. అయితే.. ఇప్పుడు పొలిటికల్ మూవీకి క్లాప్ కొట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan) సమక్షంలో సుమన్ కండువా కప్పుకోబోతున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వైసీపీలో చేరికకు ముహూర్తం కూడా ఖరారైనట్లుగా తెలుస్తోంది.
పార్టీలో చేరితే ఏంటి..?
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గాల్లో ఇంచార్జుల మార్పుతో సిట్టింగులు.. జగన్ రెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు. ఇంచార్జిని మార్చిన ప్రతిచోటా వ్యతిరేకత, నేతల తిరుగుబావుటాతోనే సరిపోతోంది. మరోవైపు.. టికెట్ దక్కకపోవడం, ఇంచార్జులను నియమించడంతో రాజీనామాలు, టీడీపీ, జనసేన పార్టీల్లోకి జంప్ కూడా అవుతున్నారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి వేరే పార్టీ కండువాలు కప్పుకోగా.. మరికొందరు కూడా పార్టీ మారడానికి సిద్ధం చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఎంపీ అభ్యర్థులు వైసీపీకి కరువయ్యారన్నది జగమెరిగిన సత్యమే. ఈ క్రమంలో బిజినెస్‌మెన్లు, సినీ బ్యాగ్రౌండ్ ఉన్న వ్యక్తుల గురించి వైసీపీ వేట సాగిస్తోంది. ఇప్పటికే కమెడియన్ అలీ (Comedian Ali) , డైరెక్టర్ వివి వినాయక్‌ను (VV Vinayak) సంప్రదించినట్లు తెలియవచ్చింది. ఈ ఇద్దరికీ దాదాపు టికెట్లు కూడా కన్ఫామ్ అయినట్లు టాక్ కూడా నడిచింది. సడన్‌గా ఏం జరిగిందో ఏమో తెలియట్లేదు కానీ.. సీనియర్ హీరో సుమన్ పేరు తెరపైకి వచ్చింది. రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారని.. వైసీపీ కండువా కప్పుకొని ఎంపీగా పోటీ చేస్తారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచరారం జరుగుతోంది. అయితే ఇదంతా వైసీపీ కార్యకర్తలు, ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు చేస్తుండటంతో చేరిక పక్కా అని తెలుస్తోంది. వాస్తవానికి సుమన్‌కు రాజకీయాలు కొత్తేమీ కాదు.. టీడీపీ అధినేత చంద్రబాబును రాజకీయ గురువుగా చెప్పుకుంటూ ఉంటారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బాబును.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ను ఓ రేంజ్‌లో పొగిడారు కూడా. వైసీపీ అధికారంలోకి వచ్చాక అనూహ్యంగా టర్న్ తీసుకున్నారు సమన్.
ఓసోస్.. ఇదా అసలు కథ!
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. రాజమండ్రి పార్లమెంట్(Rajahmundry LokSabha) నుంచి సుమన్ పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. మొదట ఇక్కడ్నుంచి అలీ లేదా వినాయక్‌ను బరిలోకి దింపాలని వైసీపీ అధిష్టానం ప్లాన్ చేసిందట. 100 కోట్ల రూపాయిలు రెడీ చేసుకోవాలని వైసీపీ పెద్దల నుంచి కబురు రావడంతో ఈ ఇద్దరూ డడుసుకున్నారట. ‘మాకొద్దు బాబోయ్.. మీ సీటొద్దు.. రాజకీయాలొద్దు’ అని దండం పెట్టి తెగేసి చెప్పేశారట. దీంతో రాజకీయాల పట్ల ఆసక్తిగా ఉన్న సుమన్‌తో వైసీపీ పెద్దలు ఒకరిద్దరు టచ్‌లోకి వెళ్లారట. కోట్ల సంగతి తెలియని సుమన్ సరేనని చెప్పినట్లు తెలియవచ్చింది. బహుశా అసలు విషయం తెలిస్తే హీరోగారి సంగతేంటో మరి. కాగా.. ఏపీ రాజకీయాల గురించి మాట్లాడిన ప్రతిసారీ జగన్ సర్కార్‌ను ఆకాశనికెత్తడం.. జగన్ రెడ్డే మళ్లీ మళ్లీ సీఎం కావాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ వైసీపీని ఓ రేంజ్‌లో పొగడ్తలు కురిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. రాజమండ్రి ఎంపీగా గెలిచిన మార్గాని భరత్ రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేస్తుండటంతో వైసీపీకి ఈ పరిస్థితి వచ్చిపడింది.
వైసీపీ ప్లాన్ ఇదీ..!
రాజమండ్రిలో బీసీ సమాజిక వర్గం ఎక్కువ.. గెలుపోటములను నిర్ణయించేది వీరే. అందుకే గౌడ సామాజిక వర్గానికి చెందిన సుమన్‌ను బరిలోకి దింపితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైసీపీ ఆశాభావం వ్యక్తం చేస్తోందట. పైగా.. తెలుగు, తమిళ, కన్నడ, ఆంగ్ల భాషల్లో సుమన్‌కు బాగా పట్టుంది. అంతేకాదు.. రాజమండ్రి వేదికగా 25 ఏళ్ళుగా ‘స్వర్ణాంధ్ర’ పేరిట స్వచ్ఛంద సేవా సంస్థకు గౌరవ సలహాదారుడిగా కూడా పనిచేస్తున్నారు. ఈ సంస్థ ద్వారా వృద్ధాశ్రమం, బధిరుల స్కూల్, అనాధలకు నిత్య అన్నదానం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తు్న్నారు. పైగా ఏపీ కరాటే సమాఖ్యకు అధ్యక్షుడు కూడా. నిత్యం జనాల్లో ఉండే.. సేవాగుణం ఉన్న సుమన్‌కు సామాజిక సమీకరణలతో పాటు, వ్యక్తిగత ఛరీష్మా కలిసొస్తుందని.. పైగా సిట్టింగ్ సీటు కావడంతో సులభంగా గెలిపించుకోవచ్చన్నది వైసీపీ వ్యూహమట. ఇవన్నీ ఎంతవరకు వర్కవుట్ అవుతాయో..? అసలు సుమన్ రాజకీయాల్లోకి వస్తారన్న విషయం..? వైసీపీ పెద్దలు సంప్రదించారన్న వార్తల్లో ఎంతవరకూ నిజానిజాలున్నాయో..? తెలియాలంటే మరికొన్నిరోజులు వేచి చూడక తప్పదు మరి.
AP Politics : స్టార్ట్.. కెమెరా.. పాలిటిక్స్.. వైసీపీలోకి వీవీ వినాయక్.. పోటీ ఎక్కడినుంచంటే..?
Updated Date - Jan 27 , 2024 | 11:03 PM