ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆదివాసీ బియ్యం... ఆరోగ్యానికి అభయం!

ABN, Publish Date - Aug 25 , 2024 | 09:50 AM

పచ్చని గుట్టలు, లోయ మలుపులు దాటి డుంబ్రిగుడ మండలం (అల్లూరి సీతారామరాజు జిల్లా) వైపు వెళ్తే పొలంలో నాట్లు వేస్తూ కనిపించాడు 70 ఏళ్లు దాటిన తాంగుల వెంకటరమణ. ‘‘పూర్వం మా తాతముత్తాతలు వీటినే పండించి తిన్నారు. అదే మాకు వారసత్వంగా వచ్చింది.

పచ్చని గుట్టలు, లోయ మలుపులు దాటి డుంబ్రిగుడ మండలం (అల్లూరి సీతారామరాజు జిల్లా) వైపు వెళ్తే పొలంలో నాట్లు వేస్తూ కనిపించాడు 70 ఏళ్లు దాటిన తాంగుల వెంకటరమణ. ‘‘పూర్వం మా తాతముత్తాతలు వీటినే పండించి తిన్నారు. అదే మాకు వారసత్వంగా వచ్చింది. ఈ బియ్యం మంచి సువాసనతో తెల్లగా గుండ్రంగా ముత్యాల్లా ఉంటాయి. చద్దన్నం తిని పొలానికి వెళ్తే మధ్యాహ్నం 3 గంటల వరకు అలుపెరగకుండా పనిచేస్తాం! ఎలాంటి రోగాలు రావు.’’ అన్నాడు. ఆ వంగడం పేరు ‘ఇసుకరవ్వలు’. కొన్ని తరాలుగా అరుదైన ఈ దేశీయ వరిని పండిస్తూ, విత్తనాలను కాపాడుకుంటున్న కుటుంబానికి చెందిన ఆదివాసీ రైతు వెంకటరమణ.


‘‘మా పూర్వీకులు ఎప్పుడో ఇసుకరవ్వల సాగును ప్రారంభించారు. మేము దానిని కాపాడుకుంటున్నాం. ఈ విత్తనం అంతరించి పోకుండా ఉండాలంటే అది ప్రతి సంవత్సరం సాగులో ఉండాల్సిందే!’’ అన్నాడు వెంకట రమణ. రెండు ఎకరాల్లో ఆయన ఈ వరిని పండిస్తున్నాడు. తన పూర్వీకుల మాదిరిగానే ప్రకృతి ఎరువులను వాడుతున్నాడు.

‘‘ఇవి దేవుడిచ్చిన బియ్యం అని మేమంతా భావిస్తాం. అందుకే సువాసనలు వస్తున్నాయని నమ్ముతాం. గర్భిణులు, బాలింతలకు ఈ బియ్యంతో వండిన అన్నం పెడతారు. దీనిలో ఔషధగుణాలు ఎక్కువగా ఉంటాయని మా పెద్దలు చెబుతారు. పట్టణ వాసులు కూడా సంతలకు వచ్చి వీటిని అడిగి మరీ కొంటుంటారు’’ అని డుంబ్రిగుడ రైతు తాంగుల కృష్ణ అన్నాడు.


డాక్యుమెంట్‌ చేశారు...

కల్తీకి గురైన ఇసుకరవ్వల రకాన్ని శుద్ధి పరచి సంరక్షించాలని డా.కిరణ్‌, డా.నేతాజీ ఆధ్వర్యంలో ‘వికాస’ ప్రతినిధులు శిరగం నాగేశ్వరరావు, పొలిమెర వెంకట సూరి, అప్పారావు ఈ పంటపై అవగాహన ఉన్న రైతులతో కలసి ఇసుకరవ్వల గుణాలను డాక్యుమెంట్‌ చేశారు. 2021 నుండి ఈ రకాన్ని రైతులతో సాగుచేయిస్తున్నారు. పొలంలో నాటిన తర్వాత అసలు విత్తనాలలో ఇతర వెరైటీలు కలవడం వల్ల మొక్కల ఎదుగు దలలో తేడాని గుర్తించి, కల్తీ అయిన రకాలు తొలగించారు. అలా ఈ రకాన్ని శుద్ధి పరచి, నాణ్యమైన విత్తనాలు ఉత్పత్తి చేశారు. కోతలు పూర్తయిన తర్వాత, వీరు కొంత విత్తనాన్ని భద్ర పరచి వాటిని మరుసటి ఏడాది మిగతా రైతులకు విత్తన ఉత్పత్తి కోసం ఇస్తున్నారు.


ఎలా గుర్తించాలి?

ఈ మొక్క పొడవుగా పెరుగుతుంది. 5 అడుగులపైనే ఉంటుంది. పంట పండే సమయంలో సువాసన వస్తుంది. అధిక వర్షాలకు, ముంపుకి తట్టుకుంటుంది. 160 నుంచి 170 రోజులకు పండుతుంది. గింజ పై పొట్టు పలుచగా ఉంటుంది.

‘‘నెలకోసారి కలుపును తీసి అదే భూమిలో కలిసిపోయేలా చేస్తాం. రసాయన ఎరువులు వాడం. ఒకవేళ వేస్తే, ఈ సువాసన రాదు’’ అని కొండబాబు అనే రైతు చెప్పాడు. అభివృద్ధి చేసిన విత్తనాలను అరకు వ్యాలీ, డుంబ్రిగుడ మండలాల్లో 9 గ్రామాలకు చెందిన 50 మంది రైతులకు ఇచ్చి సాగుచేయించింది వికాస సంస్థ. శుద్ధి చేసిన విత్తనాల వల్ల పంట నాణ్యత పెరిగి, చీడపీడలు ఎక్కువగా రాకపోవడం గుర్తించిన రైతులు తమ బంధువులు తోటి రైతులకు విత్తనాలు ఇవ్వడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ విలక్షణమైన పంటను దాదాపు 400 మంది రైతులు పండిస్తున్నారు.


మరిన్ని వెరైటీలు...

ఈ ప్రాంతంలో ఇసుకరవ్వలే కాకుండా అంతరించిపోతున్న మరికొన్ని ఇతర వరి వంగడాలైన నిమ్మలాసిరి, టెటెం ధాన్యం, భల్లూధాన్‌, సన్నాసిరి, ఎర్ర గోసాలు రకాలను కూడా శుద్ధిపరిచి సంరక్షించాలని వికాస సంస్థ పూనుకుంది. అరుదైన ఆదివాసీ వంగడాలను గుర్తించి కాపాడి, విస్తరించడం ద్వారా మంచి దిగుబడి, ఆదాయం వస్తుందంటున్నారు. ఈ వంగడాలు క్యాన్సర్‌, మధుమేహం, గుండె జబ్బులు వంటి రోగాల నుండి రక్షణ కల్పిస్తున్నాయి అని గిరిజనులు నమ్ము తున్నారు. ఈ ఆహారం తీసుకోవడం వల్ల ఆదివాసీల్లో 70 దాటిన వృద్ధులు సైతం పొలం పనులు ఉత్సాహంగా చేస్తున్నారు.

- శ్యాంమోహన్‌, 94405 95858


తరతరాల ఆదివాసీ వరి వంగడం...

‘‘తరతరాల ఆదివాసీ వరి వంగడం ఇది. తక్కువ దిగుబడి వస్తుందని చాలా మంది రైతులు పండించడం మానేసారు. కానీ వెంకటరమణ కుటుంబం ఇప్పటికీ ఇసుకరవ్వలను కాపాడుతోంది. ఇది గమనించి ఆ పంటను శాస్త్రీయంగా పరిశీలించాం. విత్తనాలు పూర్తిగా కల్తీ అయినట్టు తెలిసింది. ఈ వంగడాన్ని కల్తీలేని రకంగా రూపొందించడానికి శ్రీకాకుళానికి చెందిన రైస్‌బ్రీడర్‌ డా.నేతాజీ సహకారంతో స్వచ్ఛమైన వెరైటీగా తయారు చేశాం.’’

- ‘వికాస’ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డా.కిరణ్‌

Updated Date - Aug 25 , 2024 | 09:50 AM

Advertising
Advertising
<