Google Doodle : తనను రెజ్లింగ్‌లో ఓడించిన వాడినే పెళ్లాడతానన్న ఈ ఆడ పహిల్వాన్ ఎవరు?
ABN, Publish Date - May 04 , 2024 | 01:51 PM
హమీదా తన కెరియర్లో ఎన్నో ఆటుపోట్లను చూసింది. అన్నింటినీ సమర్థవంతంగా దాటుకుంటూ 1940 నుంచి 50 వరకూ విజేతగా నిలిచింది. తన చుట్టూ ఉన్న వాతావరణం ఆడవారిని కొన్ని పనులకు మాత్రమే పరిమితం చేసేది అయినా బాను ఇష్టమైన రెజ్లింగ్ మీదనే దృష్టి పెట్టింది.
స్త్రీలు అన్ని రంగాల్లో రాణించగలరనే కాలంలో ఉన్నాం. మగవారితో పోటీ పడి విజేతలుగా నిలుస్తున్నారు. అయితే మగవారితో ఆడవారు పోటీ పడడం భారత్‌లో ఎప్పుడో మొదలైంది. పోటీ పడడం కాదు.. మగాళ్లపైనే పైచేయి సాధించి శభాష్ అనిపించుకున్నవారు లేకపోలేదు. అదిగో అలాంటి వారిలో భారత తొలి మహిళా ప్రొఫెషనల్ రెజ్లర్‌గా హమీదా బాను గుర్తింపు పొందారు. 1940లలో పురుషాధిక్య సమాజంలో ఆమె రెజ్లింగ్‌లో తన సత్తాను చాటారు.ఎందరో పహిల్వాన్‌లను నిమిషాల్లోనే హమీదా బాను ఓడించేశారు. ‘అమెరికా ఆఫ్ అలీగఢ్’గా పేరొందిన ఆమెకు నివాళిగా గూగుల్ నేడు ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది.
అప్పటి రోజుల్లో ఆడవారికి ఉండే కట్టుబాట్లు హమీదా బాను విషయంలోనూ ఉన్నాయి. ఆమె ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్ ప్రాంతంలో 1900 సంవత్సరం జన్మించింది. ఆడపిల్లగా అందరిలానే ఆమెకూ ఇదిచేయద్దు.. ఇలాగే ఉండాలనే ఆంక్షలు తప్పలేదు. కానీ పట్టుదలగా తాను అనుకున్న రంగం వైపు దృష్టిసారించింది బాను. దాదాపు 300 పోటీల్లో విజేతగా నిలిచింది. హమీదా తన కెరియర్లో ఎన్నో ఆటుపోట్లను చూసింది. అన్నింటినీ సమర్థవంతంగా దాటుకుంటూ 1940 నుంచి 50 వరకూ విజేతగా నిలిచింది. తన చుట్టూ ఉన్న వాతావరణం ఆడవారిని కొన్ని పనులకు మాత్రమే పరిమితం చేసేది అయినా బాను ఇష్టమైన రెజ్లింగ్ మీదనే దృష్టి పెట్టింది.
Summer Season : ఎండ వేడికి చెమట పొక్కులు సహజం కానీ.. వీటితో వచ్చే చికాకు తగ్గాలంటే..!
ఒక స్త్రీగా మంచి కెరియర్ మొదలు పెట్టింది. పట్టుదలగా, ఏది చేయాలన్నా తక్షణమే నిర్ణయం తీసుకునేది. దీనినే తన జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలోనూ కొనసాగించింది. అప్పట్లో తనను రెజ్లింగ్‌లో మొదటిసారి ఒడించే మగవాడినే పెళ్ళాడతానని ప్రకటించి సంచలనంగా నిలిచింది. ఆ పోటీలో ఎందరో ఆమెతో పోటీ పడి ఓడిపోయినవారున్నారు. ఇందులో ముఖ్యంగా పాటియాలా, కోల్ కతా ప్రాంతాల నుంచి వచ్చిన ఇద్దరు పేరున్న పహిల్వాన్లు ఆమె చేతిలో చిత్తుగా ఓడిపోయి వెనుతిరిగారు. ఇది అప్పట్లో సంచలనమే అయింది.
ఈ ఛాలెంజ్‌ను సవాలుగా తీసుకున్న అప్పటి రెజ్లింగ్ పురుష ఛాంపియన్ అయిన బాబా పహిల్వాన్, బానుతో 1954లో పోటీపడి ఒక నిమిషం 34 సెకన్ల వ్యవధిలో ఓడిపోయాడు. ఇదే మాటమీద నిలబడి ఆ తర్వాత బాబా తన ప్రొషెషనల్ రెజ్లింగ్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఈ గెలుపే బానును అంతర్జాతీయంగా కూడా గుర్తింపు తెచ్చుకునేలా చేసింది. అంతర్జాతీయంగా కూడా బానుతో ఎందరో పోటీపడ్డారు. ఆమె ప్రతిభను అన్ని వార్తా పత్రికలు హెడ్ లైన్లలో వేసేవి. ఆ విజయాలే బానును అమెజాన్ ఆఫ్ అలీగఢ్‌గా పేరు తెచ్చిపెట్టాయి. రష్యా ఫీమేల్ బియర్‌గా పేరున్న మహిళా రెజ్లర్ వెరా కిస్టిలిన్‌ను కేవలం 2 నిమిషాల్లో ఓడించింది బాను.
Summer Skin Care : వేసవిలో జిడ్డు చర్మం ఇబ్బంది పెడుతుందా.. ఈ చిట్కాలు ట్రై చేయండి..!
బాను దృఢంగా ఉండేందుకు తీసుకునే ఆహారం కూడా ప్రత్యేకంగా ఉండేది.108 కేజీల బరువుతో ఉండే బాను తన ఆహార్యానికి కూడా పేరుపొందింది. రోజులో 9 గంటలు నిద్రపోవడం, ఆరుగంటల సమయం సాధనతోపాటు తినడానికి కూడా అంతే శ్రద్ధగా సమయం పెట్టేదట. ఆ మెనూ కూడా చాలా గొప్పగా ఉండేది. రోజుకు 5 నుంచి 6 లీటర్ల పాలు, నాటుకోడి, అరకేజీ నెయ్యి, బాదం పప్పు, కేజీ మటన్, 2లీటర్ల పండ్ల రసం, అరకేజీ నెయ్యిని తన రోజు వారి భోజనంలో తీసుకునేదట బాను.
సాహసోపేత వృత్తిని ఎంచుకున్న హమీదా బాను తన జీవితం విషయానికి వచ్చేసరికి తప్పటడుగులే వేసింది. తనకు కోచ్‌గా ఉన్న వ్యక్తితో సహజీవనం చేసింది. అతగాడు పెట్టే చిత్రహింసలన్నీ అనుభవించింది. ఆ గాయాలను తట్టుకోలేక తనకు ఎంతో ఇష్టమైన రెజ్లింగ్‌కు దూరం అయిందని ఆమె కుటింబికులు తెలియజేసారు. ఏది ఏమైనా తనకు ఎంతో ఇష్టమైన ఆటతో అప్పటి, ఇప్పటి ఆడవారికి సాహసోపేతమైన స్త్రీగా, గొప్ప శక్తిగా నిలిచింది బాను. గూగుల్ డూడుల్ హమీదా బానుకి నివాళిగా, ఈరోజు ప్రపంచం అంతా కనిపించేలా చేసింది.
Read Latest Navya News and Thelugu News
Updated Date - May 04 , 2024 | 01:57 PM