Viral News: బాస్‌లతో పాటు కొలీగ్స్‌ని అమ్మేస్తున్న ఉద్యోగులు.. ఎందుకో తెలుసా?
ABN, Publish Date - Jul 08 , 2024 | 06:01 PM
ఒక ఆఫీస్ వాతావరణం బాగుండాలంటే.. బాస్‌ల మనస్తత్వం స్వచ్ఛమైనదై ఉండాలి. తన ఉద్యోగుల పట్ల స్నేహపూర్వకంగా మెలుగుతూ.. స్నేహాభావంతోనే పనులు చేయించుకోగలగాలి. అలా కాకుండా.. నేను బాస్‌ని, నేను చెప్పినట్లే జరగాలి...
ఒక ఆఫీస్ వాతావరణం బాగుండాలంటే.. బాస్‌ల మనస్తత్వం స్వచ్ఛమైనదై ఉండాలి. తన ఉద్యోగుల పట్ల స్నేహపూర్వకంగా మెలుగుతూ.. స్నేహాభావంతోనే పనులు చేయించుకోగలగాలి. అలా కాకుండా.. నేను బాస్‌ని, నేను చెప్పినట్లే జరగాలి, ఇది నా రాజ్యాంగం అన్నట్లు వ్యవహరిస్తే మాత్రం తేడాలు వచ్చేస్తాయి. ఉద్యోగుల్లో ఒత్తిడి పెరగడంతో పాటు తీవ్ర సంఘర్షణకు లోనవుతారు. పనిపై వ్యతిరేకత పెరిగి.. అనూహ్య పరిణామాలకు దారితీసే అవకాశం కూడా ఉంది. ఇటువంటి సమస్యల నుంచి బయటపడేందుకు చైనాలోని ఉద్యోగులు.. ఓ కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. తమకు నచ్చని బాస్‌లు, సహోద్యోగుల్ని.. సెకెండ్ హ్యాండ్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలపై విక్రయానికి పెడుతున్నారు.
అవును.. ఇది విడ్డూరంగా అనిపించినా, మీరు చదువుతోంది అక్షరాల నిజం. పని ఒత్తిడి, ఆఫీస్ వాతావరణంతో విసిగిపోయిన ఉద్యోగులు.. క్జియాన్‌యు అనే ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌లో తమకు నచ్చని బాస్‌లు, సహోద్యోగులను లిస్టింగ్‌కు పెడుతున్నారు. ‘బాధించే బాస్‌లు’, ‘అసహ్యించుకునే సహోద్యోగులు’, ‘భయంకరమైన ఉద్యోగాలు’ అనే మూడు కేటగిరీలుగా విభజించి.. వారి దరను రూ.4 నుంచి రూ.9 లక్షల వరకు నిర్ణయిస్తున్నారు. ఇప్పుడు చైనాలో ఇది ట్రెండ్ అవుతోంది. నెలకు రూ.33 వేలు సంపాదించే ఓ ఉద్యోగిని.. తన జాబ్‌ని రూ.91 వేలకు అమ్ముతున్నానని, మూడు నెలల్లోనే మీ పెట్టుబడిని రికవర్ చేయొచ్చని ఆ వెబ్‌సైట్‌లో రాసుకొచ్చింది. మరొక యూజర్ ఏమో.. తన టెర్రిబుల్ బాస్‌ని 500 యువాన్లకు అమ్ముతున్నట్టు పేర్కొన్నాడు. అతడు తనని తరచూ విమర్శిస్తుంటాడని, అతని వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతున్నానని తెలిపాడు.
అయితే.. ఇదంతా నిజం కాదు, కేవలం కల్పితం మాత్రమే! తమ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం.. చైనాలోని ఉద్యోగులు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. వ్యక్తిగతంగా వారిపై ప్రతీకారం తీర్చుకోలేక.. ఇలా ఈ-కామర్స్ సైట్‌లో తమ కోపాన్ని, బాధని ఇలా పంచుకుంటుంటారు. దీనిని అక్కడ వర్మ్ స్మైల్ అని పిలుస్తారు. రోజంతా పని చేశాక.. ఇలా ఆన్‌లైన్‌లో తమ నచ్చని వారి గురించి పెడితే.. కొంత ఒత్తిడి తగ్గుతుందని వారి భావన. అంతే తప్ప.. ఆర్థిక లావాదేవీలేమీ జరగవు. ఎవరూ.. ఎలాంటి కొనుగోళ్లు చేయరు. అయితే.. దీనిపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఏదేమైనా.. ఒత్తిడి తగ్గించుకోవడానికి ఇది మంచి విధానమేనంటూ కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Read Latest Viral News and Telugu News
Updated Date - Jul 08 , 2024 | 06:01 PM