Almonds: బాదంపప్పులు తింటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
ABN, Publish Date - Jan 26 , 2024 | 04:53 PM
అతిగా ఏది తిన్నా ప్రమాదమే. బాదం పప్పులకూ ఇది వర్తిస్తుంది. వీటిని అతిగా తింటే వచ్చే సమస్యలేంటో ఓసారి చూద్దాం.
ఇంటర్నెట్ డెస్క్: బాదంపప్పులు (Almonds)..అటు ఆరోగ్యం ఇటు రుచి రెండూ ఉండే వీటిని ఇష్టపడని వారంటూ ఉండరు. మెదడు సామర్థ్యం పెరగడానికి ఇవి ఎంతో అవసరం. కానీ, బాదంపప్పులతో కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా పరిమితికి మించి వీటిని తింటే కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా రావచ్చని హెచ్చరిస్తున్నారు. సాధారణంగా రోజుకు ఓ గుప్పెడుకంటే కాస్తంత తక్కువగా బాదంపప్పులు తినాలట. ఈ పరిమితి దాటితే మాత్రం చిక్కులు తప్పవు. మరి అతిగా బాదంపప్పులు తింటే ( Potential Side Effects of eating execessive almonds) వచ్చే ముప్పేంటో ఓసారి చూద్దాం.
అలర్జీ
బాదం పప్పులు కొందరిలో అలర్జీ కలగజేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి పడని వాళ్లల్లో ఒక్కోసారి దురదలు, వాపు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు, అనాఫిలాక్సిస్ వంటివి రావచ్చు. ఇలాంటి లక్షణాలు ఏవి కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.
అరుగుదలలో సమస్యలు
బాదంపప్పుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణశక్తి పెరిగేందుకు ఎంతో కీలకం. అయితే, అధిక మొత్తంలో తింటే మాత్రం కడుపులో ఇబ్బంది మొదలవ్వొచ్చు. కడుపు ఉబ్బరం, గ్యాస్, లేదా విరేచాలు కూడా వేధించొచ్చు. కాబట్టి, బాదంపప్పులు తినే విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. వీటిని బాగా నమిలి తినాలి.
కిడ్నీల్లో రాళ్లు..
ఇతర గింజలు, విత్తనాల్లాగానే బాదంపప్పుల్లో కూడా ఆక్సాలేట్స్ అనే సహజ రసాయనాలు ఉంటాయి. బలహీనంగా ఉండేవారి కిడ్నీల్లో ఇవి రాళ్లు ఏర్పడేలా చేయచ్చు. కాబట్టి, కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నవారు ఓ పరిమితికి లోబడి బాదంపప్పులు తినాలని వైద్యులు సూచిస్తున్నారు.
బరువు పెరుగుదల
బాదంపప్పుల్లో పోషకాలు, కేలరీలు అధికం. కానీ, అప్పటికే కేలరీలు అధికంగా ఉన్న ఆహారానికి ఇవి కూడా జోడిస్తే బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, సమతుల ఆహారం అంటే ఏంటి? బాదంపప్పులు ఎంతవరకూ తినొచ్చు అనే విషయాల్లో జాగ్రత్త అవసరం
కొన్ని అరుదైన సందర్భాల్లో బాదంపప్పులు హానికరమైన సాల్మొనెల్లా బ్యాక్టీరియాతో కలుషితమయ్యే అవకాశం ఉంది. కాబట్టి, వీటిని కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. నమ్మకమైన బ్రాండ్స్ ఉత్పత్తుల్నే తినాలి. పచ్చి లేదా పాశ్చరైజ్ కాని వాటితో కొంత ముప్పు ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలి.
అయితే, బాదంపప్పులతో సాధారణంగా అధికశాతం మందికి ఎటువంటి ఇబ్బందులూ ఉండవని నిపుణులు చెబుతున్నారు.
Updated Date - Jan 26 , 2024 | 05:17 PM