ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అడవుల ఆల్చిప్పలో మెరిసే ముత్యం ‘సాబి’

ABN, Publish Date - Oct 27 , 2024 | 11:51 AM

దక్షిణాఫ్రికా... చిగురాకుపచ్చ చీర కట్టుకున్న అందమైన ఆడపిల్ల. నల్లటి తారు రోడ్డు నడుముతో, అందంగా ఆఫ్రికా ఖండం అంచున నిలబడి ఉంది. గుండెలోతుల్లోంచి పొంగే జలపాతాలతో, మల్లెపూలు పెట్టుకున్న తెల్లటి కొండలతో, విచ్చుకున్న కలువ పువ్వులాంటి అందమైన దేశం. ఉద్యోగరీత్యా దక్షిణాఫ్రికాలో ఉంటున్న తెలుగు వ్యక్తి చూసిన ‘సాబి’ యాత్ర విశేషాలవి...

దక్షిణాఫ్రికా... చిగురాకుపచ్చ చీర కట్టుకున్న అందమైన ఆడపిల్ల. నల్లటి తారు రోడ్డు నడుముతో, అందంగా ఆఫ్రికా ఖండం అంచున నిలబడి ఉంది. గుండెలోతుల్లోంచి పొంగే జలపాతాలతో, మల్లెపూలు పెట్టుకున్న తెల్లటి కొండలతో, విచ్చుకున్న కలువ పువ్వులాంటి అందమైన దేశం. ఉద్యోగరీత్యా దక్షిణాఫ్రికాలో ఉంటున్న తెలుగు వ్యక్తి చూసిన ‘సాబి’ యాత్ర విశేషాలవి...

అప్పుడప్పుడు ఇంటి తలుపులకు గడియపెట్టి కంటి తలుపులు తెరవాలి... ప్రకృతి ఒడిలోకి అమాంతం జారిపోవాలి. ఆలోచనలేమీ లేకుండా దేహాన్ని, మనసుని చెట్లకొమ్మల్లోకో ఆకాశం నుంచి జారిపడుతున్న జలపాతం కిందకో తీసుకెళ్లి వదిలేయాలి. అప్పటిదాకా చూడని స్థలానికో, అనుభవించని జీవితానికో మనల్ని మనం డిప్లాయ్‌ (ఛ్ఛీఞజూౌడ) చేసుకోవాలి. అలాంటి ఆకుపచ్చని ఆలోచనతో దక్షిణాఫ్రికా దేశంలో ప్రవాసో ద్యోగాలు చేసుకుంటున్న అయిదు తెలుగు కుటుంబాల సభ్యులం ‘సాబి’ యాత్రకు బయలుదేరాం. ఇది నాలుగు రోజుల యాత్ర. ఒక పొడుగు వారాంతం దీనికి స్టార్ట్‌ బటన్‌.


‘సాబి’ చుట్టూ...

చుట్టూ అందమైన అడవుల్ని ఆల్చిప్పలుగా ధరించి మధ్యలో ముత్యంలా మెరుస్తున్న నగరం సాబి. ఇది దక్షిణాఫ్రికాలోని పుమలాంగా (కఞఠఝ్చజ్చూుఽజ్చ) ప్రావిన్స్‌లో అందమైన సాబి నదీ తీరంలో ఉంది, ‘సాబి’ అనే పేరు సిస్వాతి భాషలోని ‘ఉలుసాబా’ అనే పదం నుంచి వచ్చింది. ‘భయంకరమైన నది’ అని దాని అర్థం. ఎందుకంటే ఇది ఒకప్పుడు ప్రమాదకరమైన నైల్‌ మొసళ్లతో నిండి ఉండేది. ‘ఉలుసాబా’ అనే పదాన్ని ఆఫ్రికానర్‌ వలసదారులు ఆధునీకరించి ఆఫ్రికన్‌ భాషలో ‘సాబి’గా మార్చారు.


మా ప్రయాణమంతా ఈ సాబి నగరం, నది చుట్టూ సాగింది. పదుల సంఖ్యలో జల పాతాలు, తలపైకెత్తి చూస్తే ఎక్కడో ఆకాశంలో కనిపించే పర్వతసానువులు, ఆకుపచ్చని అరణ్యాలు, చాలా సాధారణంగా తిరిగే అడవి జంతువులు ఈ నాలుగు రోజులూ మా ప్రియనేస్తాలు. ఇది దక్షిణాఫ్రికాలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రాలలో ఒకటి. ఇక్కడకు చాలా దగ్గరలో ఉన్న ‘క్రూగర్‌ నేషనల్‌ పార్క్‌’ కూడా మరో ప్రధాన ఆకర్షణ. మేము నివసిస్తున్న హౌటెంగ్‌ ప్రావిన్స్‌లోని జోహన్నెస్‌బర్గ్‌ నగరానికి సాబి పట్టణం తూర్పున 360 కి.మీ.దూరంలో ఉంది.

శనివారం ఉదయం మా ప్రయాణం మొదలైంది. ముందుగా చెప్పినట్టు అయిదు కార్లు, పద్దెనిమిది మంది స్నేహకుటుంబ సభ్యులు, ఆనందంగా గడపడానికి ఇదో మంచి అవకాశంగా భావించాం.


అరవై కిలోమీటర్ల ప్రయాణం తరువాత మా మొదటి మజిలీ ‘ఫో గుయాంగ్‌ షాన్‌ నాన్‌ హువా టెంపుల్‌’. ఇది ప్రఖ్యాత చైనీస్‌ గుడి. 600 ఎకరాల్లో విస్తరించబడిన ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద బౌద్ధారామం. బౌద్ధాన్ని ఆఫ్రికా ఖండంలో వ్యాపించడం దీని ప్రధానోద్దేశం. భారీ కట్టడాలతో ప్రశాంతమైన వాతావరణంలో ఉందీ గుడి. అంతా కలియ తిరిగి అన్నీ వివరంగా తెలుసుకొని చివరగా నిర్మలంగా కూర్చొన్న బుద్దుడి భారీ విగ్రహాలకు నమస్కరించాం.


ప్రకృతి ఒడిలో...

అక్కడి నుంచి వంద కిలోమీటర్లు వెళ్ళాక మొదటి మజిలీ అల్జు (అజ్డూఠ) రెస్టారెంట్‌. ఇది చాలా ఫలహారశాలల సమూహం. అలసట తీర్చే ఇలాంటి మజిలీలు మధ్యలో చాలా ఉంటాయి కానీ అల్జు విశేషమేమిటంటే పక్కనే చాలాసంఖ్యలో వీళ్ళు పెంచుతున్న అడవి జంతువులు. అవి పిల్లల్ని, పెద్దల్ని విశేషంగా ఆకర్షిస్తాయి. దక్షిణాఫ్రికాలో ప్రత్యేకంగా కనిపించే జంతువులను చాలామటుకు ఇక్కడ చూడవచ్చు. చాలా నెమ్మదిగా కార్లని నడిపిస్తూ ఈ దారి ఎప్పటికీ అయిపోవద్దనుకుంటూ ముందుకెళ్తున్నాం.


సాబీ పట్టణంలో ఒక దగ్గర ఆగి ఆ రాత్రికి, రేపటి ఉదయానికి కావాల్సిన వంట సామాను తీసుకొని మళ్ళీ అదే దారిలో మా విడిది స్థావరానికి చేరుకున్నాం. ఈ మా నాలుగు రోజుల నివాసం అచ్చంగా ప్రకృతి ఒడిలో కట్టిన అద్భుతం. పక్కనే నదీ ప్రవాహపు జోరు హోరు వినిపిస్తుంటే... పక్షులు, చిన్న చిన్న జంతువులు ఇళ్ల మధ్యలో తిరుగుతుంటే, ఒక్కో కుటుంబానికీ ఒక్కో గుడిసె... అందులోనే వంటగది, పడకగది అన్నీ ఉన్నాయి. సాయంత్రానికి చలి ఎక్కువయ్యింది. గుడిసెల మధ్యలో చలిమంట వేసి దానిచుట్టూ మూగి, ముచ్చట్లని సన్నని మంట మీద కాల్చుకు తిన్నాం. అడవి మధ్యలో ఉండడం, ఒక్కరి ఫోన్‌కి కూడా సిగ్నల్స్‌ లేకపోవడం కూడా మాకు ఆనందమే.


మరుసటి రోజు ఆదివారం చీకటి తెరలింకా పూర్తిగా విప్పుకోకముందే కొండల్లోంచి వెచ్చని వెలుతురు మా ఇంటి చూర్లను తాకు తున్నాయి. ప్రకృతంతా మాకోసమే ఇక్కడ అందంగా అల్లుకున్నట్టుంది. నిద్రలేచి త్వరగా రెడీ అయి, ఉపాహారం తయారు చేసుకొని తిని, మధ్యాహ్నానికి కూడా వండుకొని కార్లలో మొదట ‘గ్రాస్కోప్‌ జార్జి’ లిఫ్ట్‌కి చేరుకున్నాం. ఇదొక ఎత్తైన అందాల సాంత్వనా తీరం. అడవిదారిలో కొండపైకి చేరుకొని, పెద్ద లిఫ్ట్‌ ఎక్కి కిందకి సుమారు 50 మీటర్లు ప్రయాణించాలి. అక్కడ చెక్క వంతెనల మీదుగా నదీ ప్రవాహాన్ని ఆస్వాదించాం. అదే లిఫ్ట్‌ ద్వారా పైకి చేరుకున్నాం. జిప్‌ లైనింగ్‌, సస్పెన్షన్‌ బ్రిడ్జి ఇక్కడ మరో ప్రధాన ఆకర్షణ. అక్కడనుంచి నేరుగా గాడ్స్‌ విండోకి ప్రయాణమయ్యాం. ఇది అంతే ఎత్తులో ఉండే మరో రమణీయ ప్రకృతి అందం. అంత ఎత్తునుంచి రెండు కొండలమధ్య చూస్తే పెద్ద కిటికీలోంచి చూసినట్టు ఉంటుంది. మేఘాలు కింద ఎక్కడో ఉన్నట్టు... మనం చాలా ఎత్తులో ఉన్నట్టు భ్రమింపజేసే అందమైన కిటికీ ఇది.


అక్కడ నుంచి పక్కనే ఉన్న బెంలిన్‌ ఫాల్స్‌కి వెళ్ళాం. ఈ వాటర్‌ఫాల్స్‌ దగ్గరగా వెళ్లడం కుదరదు కానీ దూరం నుంచి చూస్తే... అంతెత్తు నుంచి దూకుతున్న నీటి ప్రవాహం గంగమ్మ తెల్లటిచీర ఆరబెట్టుకున్నట్టు అనిపిస్తుంది. జలపాతం ముందు ఆ హోరు వింటూ లంచ్‌ చేయడం గొప్ప అనుభూతి. ఆతర్వాత బోర్క్‌ ల్యూక్‌ పాథోల్స్‌కి వెళ్లాం. లైడ్‌, ట్రూరర్‌ నదుల సంగమంలో యుగాల తరబడి పారిన నీటితో ఏర్పడిన భారీ గుంతలను ‘జైంట్‌ కెటిల్స్‌’ అని పిలుస్తారు. ఈ భారీ గుంతలకు టామ్‌ బోర్క్‌ అనే వ్యక్తి పేరు పెట్టారు. అతను 1880లలో ఈ గిరిజన లోయలో బంగారపు నిక్షేపాలున్నాయని కనుగొన్నాడు, కానీ ప్రాంతాన్ని పొరబడ్డాడు. అతను బంగారం కోసం అన్వేషించిన ప్రదేశానికి కొద్దిగా దక్షిణాన, అనేక మంది తరువాత బంగారాన్ని కనుగొని ఆ సంపదను అనుభవించారు. దురదృష్టవశాత్తు టామ్‌ బోర్క్‌ మాత్రం బంగారం కనిపెట్టలేక పోయాడు. ఏదైతేనేం అతనిపేరు చిరస్థాయిగా ఈ పోథోల్స్‌కి స్థిరపడింది. వీటితో పాటు సాబి ఫాల్స్‌, లోన్‌ క్రీక్‌ ఫాల్స్‌ చూశాం. ఇవే ఈరోజుకు మా చివరి విహారాలు. ఆ తర్వాత నేరుగా విడిది గుడిసెలను చేరుకున్నాం.


అతి పెద్ద జాతీయ పార్కు.

మరుసటిరోజు ప్రసిద్ధ ‘క్రూగర్‌ నేషనల్‌ పార్క్‌’ చూసేందుకు వెళ్లాం. దక్షిణాఫ్రికాలోని అతిపెద్ద జాతీయ పార్క్‌ ఇది. మొజాంబిక్‌ దేశ సరిహద్దులో లెబొంబో కొండల పశ్చిమాన ఉంది. 1898లో దక్షిణాఫ్రికా రిపబ్లిక్‌ (ట్రాన్స్‌వాల్‌) మాజీ అధ్యక్షుడు, ఆఫ్రికా జాతి నిర్మాణకర్త ‘పౌల్‌ క్రూగర్‌’ పేరుతో ఇది ఏర్పడింది. 19,485 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ పార్క్‌, సుమారు 320 కిలోమీటర్ల పొడవు, 80 కిలోమీటర్ల వెడల్పుతో ఉంది. సౌతాఫ్రికా బిగ్‌ 5 గా చెప్పుకునే జంతువులు ఏనుగులు, సింహాలు, చిరుతలు, అడవి గేదెలు, ఖడ్గమృగాలతో పాటు జీబ్రాలు, వైల్డ్‌బీస్ట్‌లు, ఇంపాలాలు, ఎన్నోరకాల పక్షులు ఉన్నాయి.


ఆరు జీవ నదులు ఈ పార్క్‌గుండా ప్రవహిస్తున్నాయి. 2002లో క్రూగర్‌ నేషనల్‌ పార్క్‌, మొజాంబిక్‌లోని లింపోపో పార్క్‌, జింబాబ్వేలోని గోనారెజౌ నేషనల్‌ పార్క్‌తో కలిసి ఆఫ్రికాలోని అతిపెద్ద గేమ్‌ పార్క్‌, గ్రేట్‌ లింపోపో ట్రాన్స్‌ఫ్రాంటియర్‌ పార్క్‌గా ఏర్పడింది. కారులో ఈ పార్క్‌ ఒకపక్క నుంచి ఇంకో పక్కకి చేరడానికే సాయంత్రం అవుతుంది. ఒక గేట్‌ ద్వారా లోపలికి ప్రవేశించాం. పార్క్‌ లోపల ఎవరి కార్లలో వారు తిరగడమే. జంతువులు ఎక్కువగా ఉండే అడవి కావడంతో కారు అద్దం కిందకి దించడం నిషిద్ధం. మా ప్రయాణం ఉదయం ఆరింటికి మొదలు పెట్టాం. మొదట్లోనే ఒక నీటి కొలను వద్ద పెద్ద పెద్ద హిప్పోలు, మొసళ్ళు కనిపించాయి. ఇంకాస్త దూరం వెళ్ళాక చెట్ల చిగుర్లని తింటున్న అందమైన జిరాఫీలు, నలుపు తెలుపు కలిపి కప్పుకున్న జీబ్రాలు కుప్పలుగా ఎదురొచ్చాయి, లేళ్ళు, దుప్పులు అయితే లెక్కలేనన్ని ఉన్నాయి.


ముందుకు వెళుతుంటే ఏనుగుల గుంపు దారికి అడ్డంగా నిలుచుంది. దాంతో కార్లు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. అవి రోడ్డు దాటేదాకా నిరీక్షించాం. మరి కాస్త ముందుకెళ్లగానే రెండు సింహాలు రోడ్డుపక్కన ఆడుకుంటున్నాయి. అంత దగ్గరగా సింహాలను నేనెప్పుడూ చూడ లేదు. నాలుగైదు గంటలు తిరిగి ఒక దగ్గర భోంచేసి, మళ్ళీ తిరగడం మొదలు పెట్టాం. ఈసారి ఖడ్గమృగాలు, హిప్పోలు చాలా కనిపించాయి. రెండు చిరుత పులులు చెట్లపై పడుకొని సేదతీరుతున్నాయి. మొసళ్ళు, కొన్ని నీటి జంతువుల్ని చూడడానికి లోయర్‌ సాబి వరకు వెళ్ళాం. అక్కడ నదిలో నీరు తాగడానికి వందల సంఖ్యలో జంతువులు వచ్చాయి. వాటిని చూడడానికి రెండుకళ్ళూ చాలలేదు. ఇది కేవలం అడవి కాదు మనం దాటొచ్చిన జీవితం. బయటకొచ్చేసరికి సాయంత్రం ఏడయ్యింది. అందమైన జ్ఞాపకాల్ని నింపుకొని రాత్రికి విడిదికి చేరుకున్నాం.


అతి పురాతనమైన గుహలు...

మా టూర్‌లో చివరిరోజు కొంచెం త్వరగా బయలుదేరి వెళ్లాలని ముందే నిర్ణయించుకున్నాం. ఎందుకంటే తెల్లారితే అందరం ఉద్యోగపర్వంలోకి వెళ్లాల్సిందే. గుడిసె విడిదిని ఖాళీ చేసి వచ్చిన దారిలోనే సుద్వాలా గుహల దగ్గర ఆగాం. ఈ గుహలు ప్రాచీనమైన డోలోమైట్‌ రాళ్ల మధ్యలో ఉన్నాయి. గుహల ఆవిర్భావం సుమారు 240 మిలియన్ల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఇవి ప్రపంచంలోనే అతి పురాతనమైన గుహలలో ఒకటి. లోపల కొంచెం వేడిగా అనిపించింది.


రెండుమూడు గంటలు అక్కడే గడిపి, నేరుగా చిట్టచివరి మజిలీ ‘డల్‌ స్ట్రోమ్‌ బర్డ్‌ ఆఫ్‌ ప్రే’కి చేరుకున్నాం. ఇది పక్షుల పునరావాస కేంద్రం. ఇక్కడ బర్డ్స్‌ షో ప్రధాన ఆకర్షణ. రకరకాల పక్షుల్ని వాటి జీవన విధానాల్ని వివరించి చెప్పే విధానం బాగా నచ్చింది. దీనితో మా నాలుగురోజుల ప్రయాణం ముగిసింది.

ఇది ఖచ్చితంగా మా జీవితాల్లో గొప్ప ప్రయాణం. ఇలాంటి ప్రయాణాలు మనల్ని మనకి గుర్తుచేసి, గ్లోబలైజేషన్‌ గాలులకు ఒంగిపోతున్న బ్రతుకుల్ని చెట్టులాగా నిటారుగా నిలబెడతాయి.

- గౌతమ్‌ లింగా, దక్షిణాఫ్రికా

+ 27 630255994 (whatsapp)

Updated Date - Oct 27 , 2024 | 11:51 AM