TATAs family tree: టాటాల వంశ వృక్షం ఇదీ!
ABN, Publish Date - Oct 10 , 2024 | 02:16 PM
టాటాల వంశవృక్షం ఇదీ .. జెమ్‌షెడ్‌జీ మొదలు రతన్ టాటా వరకూ..
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ వ్యాపార దక్షతకు, విలువలకు ప్రతిరూపం టాటా గ్రూప్. జెమ్‌షెడ్‌జీ మొదలు టాటా కుటుంబానికి చెందిన ఎందరో ఉద్దండులు ఈ వ్యాపార సామ్రాజ్యానికి నేతృత్వం వహించారు. ఈ గ్రూపునకు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు ఇనుమడింప చేసిన రతన్ టాటా బుధవారం లోకాన్ని వీడారు. దీంతో.. టాటా గ్రూప్ ప్రయాణంలో ఓ శకం ముగిసినట్టైంది. నైతికతకు మారుపేరుగా నిలిచే రతన్ టాటా దూరమవడంతో దేశ ప్రజలందరూ విచారంలో కూరుకుపోయారు. ఇక టాటాల సంస్థలు జమ్‌షడ్‌జీతో మొదలైన విషయం తెలిసిందే. నాటి నుంచి ఆ కుటుంబం నుంచి ఒక్కో తరంలో ఒక్కో నాయకుడు తమ గ్రూప్ సంస్థలను తమదైన శైలిలో ముందుకు తీసుకెళుతూ చెరగని ముద్ర వేశారు.
Ratan Tata: రతన్ టాటా జీవితంలో థ్రిల్లింగ్ క్షణాలు! ఎన్నో ఏళ్ల కల నెరవేరిన వేళ..
టాటాల వంశవృక్షం ఇదీ..
నుసుర్‌వాంజీ టాటా (1822 - 1886)
టాటా కుటుంబ పితామహుడు నుసుర్‌వాంజీ టాటా. ఆయన తొలుత పార్శీ మత పెద్ద అయినప్పటికీ ఆ తరువాత వ్యాపారరంగంలోకి ప్రవేశించారు. అలా టాటా సంస్థలకు ఆయన పునాది వేశారు.
జమ్‌షెడ్‌జీ టాటా (1839 - 1904)
నుసుర్‌వాంజీ కుమారుడే జమ్‌షెడ్‌జీ టాటా. టాటా గ్రూప్ వ్యాపారసామ్రాజ్యాన్ని తీర్చిదిద్దిన ఆయన భారతీయ పరిశ్రమల పితామహుడిగా కీర్తి గడించారు. జమ్‌షెడ్‌టీ టాటా భార్య పేరు హీరాబాయ్. వారికి దొరాబ్‌జీ, రతన్‌జీ టాటా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
దొరాబ్‌జీ టాటా (1859 - 1932)
జమ్‌షెడ్‌జీ కుమారుడు దోరాబ్‌జీ టాటా కూడా వ్యాపారవేత్తగా రాణించారు. 1908 నుంచి 1928 వరకూ టాటా సంస్థలకు చైర్మన్‌గా వ్యవహరించారు. ఆయన సారథ్యంలో టాటా గ్రూప్ కొత్త రంగాలకు విస్తరించింది. దొరాబ్‌జీ సతీమణి పేరు మెహెర్‌బాయి. 1896లో వారి వివాహం జరిగింది. అయితే, వారికి సంతానభాగ్యం కలగలేదు.
రతన్ జీ టాటా (1871 - 1918)
ఇక జమ్‌షెడ్‌జీ రెండో సంతానమైన రతన్‌జీ దాదా టాటా గ్రూప్‌ను కొత్త రంగాలకు విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన సారథ్యంలోనే టాటా గ్రూప్ వస్త్ర పరిశ్రమలో కాలుపెట్టింది. ఆయన 1928 నుంచి 1932 మధ్య టాటా గ్రూప్‌కు చైర్మన్‌గా వ్యవహరించారు. ఆయన భార్య నవజ్‌బాయి. వారికి కూడా సంతానం కలగకపోవడంతో ఆ దంపతులు తమ బంధువుల్లో ఓ చిన్నారిని దత్తత తీసుకున్నారు. అతడి పేరు నావల్ టాటా.
Ratan Tata: రతన్ టాటా నిర్మించిన ఒకే ఒక సినిమా.. కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్!
జేఆర్‌డీ టాటా (1904 - 1993)
టాటా సంస్థల భాగస్వాముల్లో ఒకరైన రతన్ జీ దాదాభాయ్ టాటా, సుజానే బ్రియరీ సంతానమైన జేఆర్‌డీ టాటా దాదాపు 5 దశాబ్దాల పాటు టాటా సంస్థలకు చైర్మన్‌గా వ్యవహరించారు. టాటా ఎయిర్‌లైన్స్‌ను ఆయనే స్థాపించారు. అనంతరం, అది ఎయిర్ ఇండియాగా రూపాంతరం చెందింది. టాటా గ్రూప్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయనది కీలక పాత్ర.
నావల్ టాటా (1904 - 1989)
రతన్ జీ టాటాల దత్త పుత్రుడైన నావల్ టాటా.. వ్యాపార సామ్రాజ్య విస్తరణలో ముఖ్య భూమిక పోషించారు. ఆయన మొదటి భార్య సూనీకి రతన్ నావల్ టాటా, జిమ్మీ టాటా జన్మించారు. అనంతరం వారు విడిపోయారు. ఆ తరువాత ఆయన సిమోన్ అనే మహిళను వివాహం చేసుకున్నారు. వారికి నోయెల్ టాటా అనే బిడ్డ కలిగాడు. ఇక రతన్ నావల్ టాటా 1937లో జన్మించారు. 1991 నుంచి 2012 మధ్య టాటా గ్రూప్‌కకు నేతృత్వం వహించారు. జాగ్వార్ లాండ్ రోవర్, టెట్లీ వంటి బ్రాండ్‌లను హస్తగతం చేసుకుని టాటా గ్రూప్ పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోయేలా చేశారు. రతన్ టాటా అవివాహితుడు కాగా ఆయన సోదరుడు జిమ్మీ కూడా అవివాహితుడిగానే మిగిలిపోయాడు.
నావల్ టాటా మరో కుమారుడైన నోయెల్ టాటా 1957లో జన్మించారు. ఆయన టాటా ఇంటర్నేషనల్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. టాటా సంస్థల్లో కొన్నింటికి మార్గనిర్దేశనం చేస్తున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం. వీరిలో నెవిల్ టాటా మానసీ కిర్లోస్కర్‌ను వివాహం చేసుకున్నారు.
Updated Date - Oct 10 , 2024 | 02:27 PM