జాతరలా ‘ఇంద్రుడి’ పండగ
ABN, Publish Date - Sep 15 , 2024 | 10:38 AM
దేవతల అధినాయకుడు ఇంద్రుడిగా మన పురాణాలు పేర్కొంటాయి. అయితే మిగతా దేవతల్లా పెద్ద ఎత్తున ఇంద్రుడికి సంబంధించిన పండగలను జరుపుకోం. కానీ మన పొరుగు దేశమైన నేపాల్‌లో ఏటా ‘ఇంద్రజాత్రా’ పేరుతో దేశమంతా ఉత్సవాలు జరుపుకుంటారు.
దేవతల అధినాయకుడు ఇంద్రుడిగా మన పురాణాలు పేర్కొంటాయి. అయితే మిగతా దేవతల్లా పెద్ద ఎత్తున ఇంద్రుడికి సంబంధించిన పండగలను జరుపుకోం. కానీ మన పొరుగు దేశమైన నేపాల్‌లో ఏటా ‘ఇంద్రజాత్రా’ పేరుతో దేశమంతా ఉత్సవాలు జరుపుకుంటారు. అది కూడా ఒకరోజు కాదు... ఏకంగా ఎనిమిది రోజుల పండగ. దీనిని సాంస్కృతికపరమైన పండగగా పేర్కొంటారు. ఈ సమయంలో నేపాల్ అంతా పండగ వాతావరణం నెలకొంటుంది. ఆలయాలను అందంగా తీర్చిదిద్దుతారు. ఆలయ ప్రాంగణాలను దీప తోరణాలతో అలంకరిస్తారు.
ఇంద్రుడి తల్లి అభయం...
‘ఇంద్రజాత్రా’కు సంబంధించి ఓ చిన్న పురాణగాథ నేపాల్‌లో ప్రాచుర్యంలో ఉంది. అందమైన పారిజాత పుష్పం కోసం భూగోళానికి వచ్చి బందీ అవుతాడు ఇంద్రుడు. ఆయనను రాజభటులు బంధించి ఖాట్మండులోని కారాగారంలో వేస్తారు. తన ప్రభువు కోసం ఐరావతం అన్ని ప్రాంతాల్లో వెదుకుతుంది. ఇంద్రుడి తల్లి దాగిని కూడా తన పరివారంతో అన్ని చోట్లా వెతికిస్తుంది. ఆఖరుకి తనే స్వయంగా ఖాట్మండుకు వచ్చి విషయం తెలుసుకుని తామెవరో వివరాలు తెలియజేస్తుంది. అసలు విషయం తెలియగానే ప్రజలు క్షమించమని వేడుకుని, భక్తిశ్రద్ధలతో ఇంద్రుడిని విడిచిపెడతారు.
దీనికి ప్రతిగా దాగిని రెండు అభయాలను నేపాలీ ప్రజలకు అందిస్తుంది. అందులో ఒకటి గతేడాది చనిపోయిన వాళ్లందరినీ స్వర్గానికి తీసుకువెళతానని అభయమిస్తుంది. ఇక రెండోది దేశమంతా వర్షాలతో సమృద్ధిగా ఉండేలా అనుగ్రహిస్తుంది. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ నేటికీ ‘ఇంద్రజాత్రా’ను భక్తిశ్రద్ధలతో అక్కడ జరుపుకుంటారు. మంచి పంటలు, పాడిని అందించిన ఇంద్రుడికి కృతజ్ఞతలు తెలియజేస్తారు.
‘కుమారి జాత్రా’ కూడా...
ఖాట్మండ్‌లోని దర్బార్ స్వ్కేర్‌లో కలపతో చేసిన పది మీటర్ల ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయడంతో ఈ ఉత్సవాలు మొదలవుతాయి. ఇంద్రుడి గొప్పతనాన్ని తెలిపే నాటకాలనూ వేస్తారు. ఎద్దులు, గొర్రెలు, కోళ్లు, చేపలు తదితరాలను దేవుడికి కానుకగా సమర్పిస్తారు. భైరవుడి మాస్కులతో ఊరేగింపులు జరుపుతారు. ఈ సందర్భంగా భైరవుడి ఆలయాల్లో కూడా పూజలు జరుగుతాయి. నేపాలీ భాషలో ఇంద్రజాత్రాను ‘ఏన్యా’గా పిలుస్తారు. ‘ఏన్’ అనేది ఖాట్మండులోని నేవారీ భాష పేరు. ఇక ‘యా’ అంటే ఉత్సవం. ఖాట్మండు నగరం పుట్టినందుకు జరుపుకునే వేడుకగా కూడా వ్యవహరిస్తారు.
ఇంద్రజాత్రాతో పాటు ‘కుమారి జాత్రా’ను కూడా ఈ సమయంలో నేపాలీయలు జరుపుకుంటారు. అమ్మవారి అవతారంగా భావించి బాలికను పూజించడమే ‘కుమారి జాత్రా’. ఈ సమయంలో కుమారిని కూడా ఊరేగింపుగా తీసుకు వస్తారు. ఆఖరి రోజున ధ్వజస్తంభాన్ని దహనం చేయడంతో ఈ ఉత్సవాలకు ముగింపు పలుకుతారు. ఈ ఏడాది ‘ఇంద్ర జాత్రా’ సెప్టెంబర్ 17న ప్రారంభమవు తోంది. నేపాలీ కమ్యూనిటీలు ఉన్న సిక్కింలో కూడా ఈ పండగను చేసుకోవడం విశేషం.
Updated Date - Sep 15 , 2024 | 10:38 AM