సెట్టింగ్ టౌన్
ABN, Publish Date - Aug 18 , 2024 | 09:50 AM
సినిమా సెట్టింగులు చూడటానికి ప్రతిఒక్కరూ ఆసక్తి చూపుతారు. ‘బాహు బలి’ సినిమా సెట్‌ను చూడటం కోసమే ఫిల్మ్‌సిటీకి వెళ్లిన వాళ్లు ఎంతోమంది ఉంటారు. అచ్చం అలాగే సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్ దగ్గర వేసిన ఒక సెట్టింగ్ కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.
సినిమా సెట్టింగులు చూడటానికి ప్రతిఒక్కరూ ఆసక్తి చూపుతారు. ‘బాహు బలి’ సినిమా సెట్‌ను చూడటం కోసమే ఫిల్మ్‌సిటీకి వెళ్లిన వాళ్లు ఎంతోమంది ఉంటారు. అచ్చం అలాగే సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్ దగ్గర వేసిన ఒక సెట్టింగ్ కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. నిజమైన పట్టణాన్ని తలపించేలా ఈ సినిమా సెట్ ఉంటుంది. ఈ టౌన్ సెట్ వేసి 20 ఏళ్లు గడిచినా ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉంది.
ఆ టౌన్‌లోకి అడుగుపెడితే రెండు మూడు అంతస్తుల్లో నిర్మించిన ఇళ్లు, షాపులు, పార్కింగ్ చేసిన కార్లు, రెస్టారెంట్లతో ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ అవి ప్రజలు కట్టుకున్న ఇళ్లు కాదు. జనం నివసిస్తున్న పట్టణం కాదు. సినిమా కోసం వేసిన సెట్ అది. సాధారణంగా ఔట్‌డోర్‌లో సినిమాల కోసం సెట్టింగులు వేయడం, కొంతకాలం తరువాత తీసేయడం జరుగుతూనే ఉంటుంది. కానీ సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్ నగరానికి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఒక కొండపై వేసిన టౌన్ సెట్టింగ్ మాత్రం 20 ఏళ్లయినా అలాగే ఉంది.
ఈ టౌన్‌ని ‘డ్రవెన్‌గాడ్’ అని పిలుస్తారు. అంటే ‘టింబర్ టౌన్’ (చెక్క పట్టణం) అని అర్థం. ఇక్కడ సినిమా కోసం నిర్మించిన ఇళ్లు, రెస్టారెంట్లు అన్నీ కలపతో చేసినవే. మోక్రా గోరా అని పిలిచే ఒక కొండపై ఈ టౌన్‌ను నిర్మించారు. ఇది పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. సినిమా సెట్టింగ్ అయినా ఎక్కడా కూడా సెట్టింగ్‌లా కనిపించదు. ఒక పట్టణంలోకి అడుగుపెట్టిన భావనే కలుగుతుంది.
నివసించేది ఒక్క కుటుంబమే...
విచిత్రమైన విషయం ఏమిటంటే... ఈ సెట్టింగ్ పట్ణణంలో నివసిస్తోంది ఒక్క కుటుంబమే. ఎమిర్ కస్తురిక అనే దర్శకుని కుటుంబం మాత్రమే ప్రస్తుతం ఈ టౌన్‌లో నివసిస్తోంది. 2004లో ‘లైఫ్ ఈజ్ ఎ మిరాకిల్’ అనే సినిమా కోసం ఆయనే ఈ టౌన్ సెట్టింగ్‌ను వేయించారు. ఈ టౌన్‌లో చర్చ్, లైబ్రరీ, కొన్ని రెస్టారెంట్లు, షాపులు ఉన్నాయి. సినిమా హాల్ కూడా ఉంది. ‘‘యుద్ధంలో నేను నా ఊరిని కోల్పోయాను. అందుకే సొంతంగా గ్రామాన్ని నిర్మించాలని కోరిక ఉండేది. అది ఇలా తీరింది’’ అని అంటారు కస్తూరిక. ఆయన ఈ టౌన్‌లో సినిమా సెమినార్లు నిర్వహిస్తుంటారు. ఫెస్టివల్స్ జరుపుతుంటారు.
అప్పుడు మాత్రమే జనం హడావిడి ఉంటుంది. అయితే పర్యాటకుల తాకిడి ఎప్పుడూ ఉంటుంది. సినిమా మేకింగ్, పెయింటింగ్స్ వంటి అంశాలపై సెమినార్లు జరుగుతూ ఉంటాయి. ‘‘సినిమా గురించి నేర్చుకోవాలనుకునే వారికి ఇక్కడ సెమినార్లు నిర్వహిస్తూ ఉంటాను’’ అంటారు కస్తూరిక. ఈ సినిమా టౌన్ గురించి ఆనోటా ఈనోటా అందరికీ తెలిసి పర్యాటకుల తాకిడి పెరిగింది. ఇక్కడ ఉన్న సినిమా థియేటర్‌లో ఫిల్మ్ ఫెస్టివల్ జరిగినప్పుడు కిటకిటలాడుతుంది. దీనికి సమీపంలోనే ఉన్న మకోలా గ్యాలరీలో ఆర్ట్ వర్క్‌ను చూడటానికి ఆసక్తి చూపుతుంటారు. షాపులు, రెస్టారెంట్లతో పాటు జిమ్, స్విమ్మింగ్‌ఫూల్ కూడా ఉన్నాయి.
ఈ టౌన్‌లోని వీధులకు క్యూబా పోరాట యోధుడు చెగువేరా, అర్జెంటీనా ఫుట్‌బాల్ క్రీడాకారుడు డిగో మారడోనా పేర్లను, ఫెడెరికో ఫెల్లిని, ఇంగ్మార్ బెర్గ్‌మన్ వంటి ప్రసిద్ధ సినిమా దర్శకుల పేర్లను పెట్టారు. ఫిల్మ్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో ఫిల్మ్‌మేకర్స్, నటీనటులు, విద్యార్థులతో ఈ తాత్కాలిక పట్టణం సందడిగా ఉంటుంది. క్రియేటివ్ ఫిల్మ్‌మేకింగ్ గురించి, తక్కువ బడ్జెట్‌లో సినిమాలెలా తీయాలనే అంశాలపై ఇక్కడ జరిగే ఫెస్టివల్‌లో చర్చిస్తారు. అతిథులకు రెడ్‌కార్పెట్ పరవకపోయినా హాలీవుడ్ దర్శకులు, అంతర్జాతీయ సెలబ్రిటీలు పాల్గొంటుంటారు. అదే ‘టింబర్ టౌన్’ ప్రత్యేకత. మొత్తానికి ఈ అందమైన సెట్టింగ్ పట్టణం సెల్ఫీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
Updated Date - Aug 18 , 2024 | 09:50 AM