Shubman Gill: శుభ్‌మన్‌ను ఎందుకు వెనక్కు పంపారు.. కారణం చెప్పిన బ్యాటింగ్ కోచ్
ABN, Publish Date - Jun 16 , 2024 | 01:38 PM
టీ20 వరల్డ్‌కప్ కోసం ట్రావెలింగ్ రిజర్వ్‌గా వెళ్లిన శుభ్‌మన్ గిల్, అవేశ్‌ఖాన్‌లను తిరిగి భారత్‌కు పంపాలని యాజమాన్యం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ వార్త బయటకు..
టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) కోసం ట్రావెలింగ్ రిజర్వ్‌గా వెళ్లిన శుభ్‌మన్ గిల్ (Shubman Gill), అవేశ్‌ఖాన్‌లను తిరిగి భారత్‌కు పంపాలని యాజమాన్యం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి.. వాళ్లిద్దరిని ఎందుకు వెనక్కు పంపించారన్నది చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో గిల్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారన్న ప్రచారమూ జోరందుకోవడంతో.. అతను భారత జట్టుకి దూరం కానున్నాడా? అనే ఆందోళన ఫ్యాన్స్‌లో మొదలైంది. అయితే.. అలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ క్లారిటీ ఇచ్చారు. గిల్‌ని వెనక్కు పంపించాడని కారణం వేరే అని తెలిపారు.
‘‘ఆ ఇద్దరిని వెనక్కు పంపించడం అనేది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. ఇది ముందుగా అనుకున్న ప్రణాళికే. భారత జట్టు వెస్టిండీస్‌లో అడుగుపెట్టినప్పుడు.. కేవలం ఇద్దరు రిజర్వ్ ఆటగాళ్లని మాత్రమే ఉంచాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. అమెరికాలో ఉన్నప్పుడు నలుగురు ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాళ్లు ఉండాలని, ఆ తర్వాత కరేబియన్‌కు వెళ్లేటప్పుడు ఇద్దరు ప్లేయర్లని రిలీజ్ చేయాలని భావించాం. ఇప్పుడు ఆ ప్లాన్ ప్రకారమే.. శుభ్‌మన్, అవేశ్‌లను వెనక్కు పంపించడం జరిగింది’’ అని విక్రమ్ రాథోడ్ చెప్పుకొచ్చారు. అమెరికా మైదానాల్లో ఆటగాళ్లకు గాయాలయ్యే అవకాశాలు ఉండటంతో నలుగురు రిజర్వ్ ప్లేయర్లను ఎంపిక చేశామని, ఇప్పుడు భారత్ సూపర్-8కి చేరుకుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని తాము ఆ ఇద్దరిని వెనక్కు పంపాలని డిసైడ్ చేశామని వివరించారు.
ఇదిలావుండగా.. గ్రూప్ దశలో భారత్ తొలి మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందడంతో సూపర్-8కు అర్హత సాధించింది. ఈ సూపర్-8లో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడబోతోంది. ఈ మ్యాచ్ బార్బడోస్ వేదికగా గురువారం (జూన్ 20వ తేదీన) జరగనుంది. అనంతరం జూన్ 22న ఓ మ్యాచ్ ఉండగా.. జూన్ 24న ఆస్ట్రేలియాతో తలపడబోతోంది. మొత్తం మూడు మ్యాచ్‌ల్లో భారత్ రెండింటిలో గెలుపొందినా.. సెమీ ఫైనల్‌లో బెర్తు ఖరారు చేసుకుంటుంది.
Read Latest Sports News and Telugu News
Updated Date - Jun 16 , 2024 | 01:38 PM