ICC: ఐసీసీ ఛైర్మన్‌గా జైషా బాధ్యతలు.. ఈ 5 సవాళ్లను దాటితేనే కింగ్ అనిపించుకునేది
ABN, Publish Date - Dec 01 , 2024 | 05:18 PM
క్రికెట్ ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పదవికి పగ్గాలు చేపట్టిన షా ముందు 5 కీలక సవాళ్లున్నాయి. వీటన్నింటినీ దాటగలిగితే షా తన మార్కు చూపే అవకాశాలున్నాయి.
ముంబై: క్రికెట్ నియంత్రణా మండలికి చైర్మన్ గా బీసీసీఐ సెక్రటరీ జైషా ఏకగ్రీవంగా ఎంపికైన సంగతి తెలిసిందే. డిసెంబర్1న ఆయన చైర్మన్ పగ్గాలు చేపట్టారు. రెండేళ్ల పాటు షా ఈ పదవిలో కొనసాగనున్నాడు. ఐసీసీ ఛైర్మన్ పదవిని చేపట్టిన వారిలో అతి పిన్న వయస్కుడిగా(36) ఇప్పటికే షా రికార్డు నెలకొల్పాడు. క్రికెట్ ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పదవికి పగ్గాలు చేపట్టిన షా ముందు 5 కీలక సవాళ్లున్నాయి. వీటన్నింటినీ దాటగలిగితే షా తన మార్కు చూపే అవకాశాలున్నాయి.
1. పీసీబీ మెలిక.. షాకు పరీక్ష
భారత హోం మంత్రి అమిత్ షా కుమారుడిగా, కొత్త ఐసీసీ ఛైర్మన్ గా జైషాపై అన్నింటికన్నా ముందున్న బాధ్యత ఛాంపియన్స్ ట్రోఫీ వివాదాన్ని పరిష్కరించడం. హైబ్రిడ్ మోడల్ కు ఓకే అంటూనే కొత్త మెలిక పెట్టింది పీసీబీ. భవిష్యత్తులో భద్రతా కారణాలు చూపితే తమకు కూడా భారత్ నుంచి వేదికను హైబ్రిడ్ కు తరలించుకునే వెసులుబాటు కల్పించాలంటూ షరతు పెడుతోంది. 2031 వరకు భారత్ నిర్వహించనున్న మొత్తం 4 ఐసీసీ టోర్నీల్లోనూ పాక్ ఇలాంటి ఏర్పాట్లను కోరుతోంది. దీంతో అటు పీసీబీతో పాటు ఇటు బీసీసీఐను మెప్పించేలా ప్రణాళికను తయారు చేయడం.. దానికి ఇరు దేశాల బోర్డులు అంగీకరించేలా చేయడం అతిపెద్ద సవాలుగా ఉంది. మరి జైషా దీనికి ఎలాంటి పరిష్కారం చూపుతాడనే విషయం ఆసక్తికరంగా మారింది.
2. టెస్టులను గట్టెక్కించేలా..
ప్రపంచ వ్యాప్తంగా టీ20 క్రికెట్ కు ఆదరణ పెరుగుతుండటంతో వన్డే టెస్టు ఫార్మాట్లకు ఆదరణ తగ్గిపోతోంది. టీ20లతో పోలిస్తే ఈ ఫార్మాట్లకు అభిమానులు లేక స్టేడియంలు వెలవెలబోతున్నాయి. ఇతర దేశాలు సైతం టీ20 లీగ్ లనిర్వహణకే ఆసక్తి చూపుతున్నాయి. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఆటగాళ్ల ప్రదర్శనపై ఇది తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని పలువురు సీనియర్లు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో షా పరిష్కరించాల్సిన సమస్యల్లో ఇది టాప్ 5లో ఉంది.
3. మహిళా క్రికెట్.. మరో సవాల్
క్రీడా ప్రపంచంలో పురుషుల క్రికెట్ కు ఉన్నంత ప్రాధాన్యం మహిళా క్రికెట్ కు లేదు. భారతదేశం అందుకు మినహాయింపేమీ కాదు. మనదేశంలో మహిళా క్రికెట్ పట్ల కొంత చిన్నచూపు కూడా ఉంది. ఎంతో ప్రతిభావంతమైన మహిళా క్రికెటర్లు ఉన్నప్పటికీ పురుషులకు వచ్చినంత గుర్తింపు వాళ్లకు రాలేదు. ఇప్పుడిప్పుడే క్రికెట్‌లో మహిళలు తమ గుర్తింపును సాధించుకుంటున్నారు. మహిళా క్రికెట్ కు సైతం క్రేజ్ పెరుగుతోంది. దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లడం.. తన పదవీ కాలంలో మరిన్ని అవకాశాలను మెరుగుపరచడం షా ముందున్న బాధ్యతల్లో ఒకటి.
4. ఒలింపిక్స్ టార్గెట్ గా
ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు ఆమోదం తెలిపితే భారత ఆటగాళ్లు పతకాల వేటకు సిద్ధంగా ఉన్నారు. ఇతర టాప్ టీమ్స్ కూడా విశ్వక్రీడల్లో తమ రుబాబు చూపించాలని చూస్తున్నాయి. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే 2028 లాస్ ఏంజెల్స్‌లో జరిగే ఈ క్రీడల్లో క్రికెట్ పునరాగమనం చేస్తుంది. ఈ టోర్నీకి తగినట్లు అన్ని బోర్డులు, ఆటగాళ్లను సమాయత్తం చేయాల్సిన బాధ్యత ఐసీసీ ఛైర్మన్‌గా షా మీద ఉంది.
5. క్రికెట్ మరింత కిక్కిచ్చేలా..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు కిక్కిచ్చేలా ఈ గేమ్ ను మరింత రసవత్తరంగా మార్చాల్సిన బాధ్యత షా పై ఉంది. ఇందుకోసం అవసరమైన ప్రణాళికను రూపొందించడం దానిని అంతే పకడ్బందీగా అమలు పరచడం వంటివి చేయాల్సి ఉంది. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూనే.. గేమ్ ను మరింత ముందుకు తీసుకువెళ్లాలి. అందుకోసం బోర్డులు, అసోసియేట్ దేశాల సహకారం తీసుకోవాలి.
Updated Date - Dec 01 , 2024 | 06:34 PM