T20 WC Final: భారత్ vs సౌతాఫ్రికా.. ఈ మ్యాచ్ గెలవాలంటే అదే మార్గం!
ABN, Publish Date - Jun 29 , 2024 | 06:15 PM
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ సమయం రానే వచ్చేసింది. మరికొద్దిసేపట్లోనే టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ పోరులో టైటిల్ కోసం భారత్, సౌతాఫ్రికా జట్లు అమీతుమీ..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ సమయం రానే వచ్చేసింది. మరికొద్దిసేపట్లోనే టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఈ పోరులో టైటిల్ కోసం భారత్, సౌతాఫ్రికా (India vs South Africa) జట్లు అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. ఈ టోర్నీలో ఇరుజట్లు అజేయంగా ఫైనల్స్‌కు చేరాయి కాబట్టి.. ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలోనే.. సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ మోర్నో మోర్కల్ (Morne Morkel) తన జట్టుకి కొన్ని కీలక సూచనలు ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో గెలుపొందాలంటే.. ఎక్కువగా ఆలోచించవద్దని, జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు కుల్దీప్ యాదవ్‌లను జాగ్రత్తగా ఎదుర్కోవాలని సూచించాడు.
‘‘సౌతాఫ్రికా ఈ మ్యాచ్ గెలుపొందాలంటే.. ఎక్కువగా ఆలోచించకూడదు. బుమ్రా, కుల్దీప్‌లాంటి బౌలర్లను ఎలా ఎదుర్కోవాలన్న ప్లాన్‌కి కట్టుబడి ఉండాలి. బుమ్రా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆరంభంలోనే వికెట్లు తీసే సత్తా అతనికి ఉంది. పైగా.. డెత్ ఓవర్లలోనూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలడు. పవర్ ప్లేలో రెండు ఓవర్లు, ఆ తర్వాత ఆఖరి ఓవర్లలోనే బుమ్రా బౌలింగ్ చేస్తాడు కాబట్టి.. మిడిల్ ఓవర్లలోనే మా బ్యాటర్లు రాణించాలని సూచిస్తున్నా. అప్పుడే గౌరవప్రదమైన స్కోరు సాధించొచ్చు. అయితే.. మిడిల్ ఓవర్లలో కుల్దీప్ కూడా ఉన్నాడు. అతనొక వికెట్ టేకర్. తన బౌలింగ్‌తో మ్యాచ్‌నే మలుపు తిప్పగలడు. కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి, ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టేయగలడు. కాబట్టి.. సఫారీ బ్యాటర్లు ఒత్తిడికి లోనవ్వకుండా ఆచితూచి ఆడాలి’’ అని మోర్నో మోర్కెల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ఇదిలావుండగా.. ఐసీసీ టోర్నమెంట్లలో సౌతాఫ్రికా జట్టు ఫైనల్స్‌కు చేరుకోవడం ఇదే మొదటిసారి. అది కూడా ఒక్క ఓటమి చవిచూడకుండా.. అజేయంగా ఫైనల్స్‌కి వచ్చింది. దీంతో.. తొలిసారి కప్‌ని ముద్దాడి, చరిత్ర సృష్టించాలని భావిస్తోంది. మరోవైపు.. భారత జట్టు 2013 తర్వాత మళ్లీ ఏ ఇతర ఐసీసీ ట్రోఫీలను సాధించలేదు. దీంతో.. రోహిత్ సేన ఎలాగైనా ఈ మ్యాచ్ గెలుపొంది, ఆ సుదీర్ఘ నిరీక్షణకు చెక్ పెట్టాలని భావిస్తోంది. పైగా.. భారత్ కూడా అజేయంగా ఫైనల్స్‌కు చేరింది. కాబట్టి.. ఎవరు గెలుపొందుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
Read Latest Sports News and Telugu News
Updated Date - Jun 29 , 2024 | 06:15 PM