Delhi : నిరంకుశ ఉష!
ABN, Publish Date - Sep 29 , 2024 | 06:07 AM
భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) చీఫ్ పీటీ ఉష, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల మధ్య నడుస్తున్న యుద్ధం కొత్త మలుపు తీసుకుంది.
ఐఓఏ సభ్యుల ఆరోపణ
జోక్యం చేసుకోవాలని ఐఓసీకి లేఖ
న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) చీఫ్ పీటీ ఉష, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల మధ్య నడుస్తున్న యుద్ధం కొత్త మలుపు తీసుకుంది. ఐఓఏ వ్యవహారాల్లో పీటీ ఉష నిరంకుశంగా వ్యవహరిస్తోందని 12 మంది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) సభ్యులు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సీనియర్ అధికారి జెరోమ్ పోయివేకి శుక్రవారం లేఖ రాయడం సంచలనం రేపింది. ఐఓఏను ప్రజాస్వామ్యయుతంగా నడిపేలా చర్యలు తీసుకోవాలని ఆ సభ్యులు జెరోమ్‌కు రాసిన లేఖలో కోరారు. ఐఓఏ సీఈవో పదవి నుంచి రఘురామ్ అయ్యర్‌ను తొలగించాలని ఈసీ సభ్యులు పట్టుబడుతుండగా..ఉష అందుకు నిరాకరిస్తోంది. ఇదే ఇప్పుడు ఉషపై సభ్యుల తిరుగుబాటుకు ప్రధాన కారణమైంది. ఐఓఏ రాజ్యాంగం ప్రకారమే అయ్యర్‌ను నియమించినట్టు ఉష స్పష్టంజేస్తోంది. అంతేకాదు..అయ్యర్ నియామకానికి ఆమోదం తెలుపుతామని గతంలో జెరోమ్‌కు ఆ 12 మంది ఈసీ సభ్యులు హామీ ఇచ్చిన విషయాన్ని కూడా ఉష గుర్తు చేసింది. ఉషను వ్యతిరేకిస్తున్న వారిలో ఐఓఏ సీనియర్ ఉపాధ్యక్షుడు అజయ్ పటేల్, ఉపాధ్యక్షులు రాజ్యలక్ష్మి దేవ్, గగన్ నారంగ్‌తోపాటు సభ్యులు రోహిత్ రాజ్‌పాల్, డోలా బెనర్జీ, యోగేశ్వర్ దత్ తదితరులున్నారు.
Updated Date - Sep 29 , 2024 | 06:08 AM