Double role : అ..అమ్మ ఆ..ఆట
ABN, Publish Date - Jul 23 , 2024 | 06:36 AM
ఓవైపు తమ చిన్నారుల ఆలనాపాలన చూసుకుంటూనే.. మరోవైపు ప్రపంచ స్థాయి అథ్లెట్లకు పోటీ ఇచ్చేందుకు ఈసారి ఒలింపిక్స్‌లో కొందరు మాతృమూర్తులు సిద్ధమవుతున్నారు. ఈ రెండు బాధ్యతలను సమతుల్యం చేసుకుంటూనే పతకం కోసం ముందుకు సాగాలనుకుంటున్నారు.
ఒలింపిక్స్‌లో అథ్లెట్ల డబుల్ రోల్
ఓవైపు తమ చిన్నారుల ఆలనాపాలన చూసుకుంటూనే.. మరోవైపు ప్రపంచ స్థాయి అథ్లెట్లకు పోటీ ఇచ్చేందుకు ఈసారి ఒలింపిక్స్‌లో కొందరు మాతృమూర్తులు సిద్ధమవుతున్నారు. ఈ రెండు బాధ్యతలను సమతుల్యం చేసుకుంటూనే పతకం కోసం ముందుకు సాగాలనుకుంటున్నారు. అలాగే తమ పిల్లలతో గేమ్స్‌కు తరలివచ్చిన అథ్లెట్ల కోసం నిర్వాహకులు కూడా పలు ఏర్పాట్లు చేశారు. కరోనా కారణంగా టోక్యో ఒలింపిక్స్‌లో మాత్రం తమ పిల్లలతో వచ్చేందుకు అథ్లెట్లను అనుమతించలేదు. కానీ ఈసారి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, పారిస్ గేమ్స్ అధికారులు తొలిసారిగా ఒలింపిక్ విలేజ్‌లో ప్రత్యేకంగా నర్సరీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. గేమ్స్ సందర్భంగా ఇందులో పిల్లలలో కలిసి తల్లులు లేదా తండ్రులు విలువైన సమయాన్ని గడపవచ్చు. మరోవైపు ఈ ఏర్పాట్లను అమెరికన్ మాజీ అథ్లెట్ అలిసన్ ఫెలిక్స్ సమర్థించింది. అమ్మతనాన్ని అనుభవిస్తూనే ఆటలోనూ ఉత్తమ స్థాయికి చేరుకునేందుకు ఇలాంటి నిర్ణయాలు దోహదపడతాయని తెలిపింది.
గర్భం దాల్చడంతో పాటు తల్లిగా మారిన వెంటనే ఓ అథ్లెట్ క్రీడా జీవితం ముగిసినట్టు కాదనే భావనలో ఐఓసీ ఉంది. మరోవైపు పిల్లలతో కలిసి గేమ్స్‌కు వచ్చేందుకు తగిన ఆర్థిక సహాయం కోసం ఈ అథ్లెట్లు గోఫండ్‌మి లాంటి ఫండ్ రైజింగ్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. వారు విరాళాల ద్వారా నిధులను సమీకరించి వీరికి అందజేస్తుంటారు. బ్రిటిష్ రోయర్ హాడ్‌గిన్స్, డచ్ టీటీ ప్లేయర్ బ్రిట్ ఎర్లాండ్ తమ పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి ఈ నిధులతోనే గేమ్స్‌కు వెళ్లనున్నారు. ఇక చివరి ఒలింపిక్స్‌లో రోయింగ్ డబుల్స్ రజత పతక విజేతలు ఫ్రాన్సిస్, స్పూర్స్ గతేడాది తమ పిల్లలకు జన్మనిచ్చారు. అయినా అటు అమ్మతనానికి లోటు లేకుండా ఈసారి కూడా పతకాలను సాధించాలనే పట్టుదలతో ఉండడం అభినందనీయం.
Updated Date - Jul 23 , 2024 | 08:54 AM