‘గ్రేస్’ షో
ABN, Publish Date - Mar 02 , 2024 | 01:21 AM
మహిళల ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్ విజయాల బాట పట్టింది. గ్రేస్ హ్యారిస్ (33 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 60 నాటౌట్) మరోసారి తన ఫామ్‌ను చాటుకుంటూ అజేయ అర్ధసెంచరీతో నిలువగా, శుక్రవారం గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యూపీ 6 వికెట్ల తేడాతో నెగ్గింది.
హ్యారిస్ హాఫ్ సెంచరీ
యూపీదే విజయం
గుజరాత్‌కు హ్యాట్రిక్ ఓటమి
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్ విజయాల బాట పట్టింది. గ్రేస్ హ్యారిస్ (33 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 60 నాటౌట్) మరోసారి తన ఫామ్‌ను చాటుకుంటూ అజేయ అర్ధసెంచరీతో నిలువగా, శుక్రవారం గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యూపీ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ఆరంభ రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఈ జట్టుకిది వరుసగా రెండో విజయం కావడం గమనార్హం. అటు గుజరాత్ మాత్రం హ్యాట్రిక్ ఓటములతో డీలా పడింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 142 పరుగులు చేసింది. స్పిన్నర్ ఎకెల్‌స్టోన్ (3/20) కట్టుదిట్టమైన బంతులకు జెయింట్స్ పరుగుల కోసం తడబడింది. ముందుగా ఓపెనర్లు వోల్వార్ట్ (28), కెప్టెన్ మూనీ (16)లను తను పెవిలియన్‌కు చేర్చింది. అటు హర్లీన్ (18) నిదానంగా ఆడడంతో ఒత్తిడి పెరిగింది. ఈ స్థితిలో మిడిలార్డర్ బ్యాటర్లు లిచ్‌ఫీల్డ్ (35), గార్డ్‌నర్ (30) ఎదురుదాడి లక్ష్యంగా పరుగులు రాబట్టారు. 18వ ఓవర్‌లో గార్డ్‌నర్ రెండు ఫోర్లు, లిచ్‌ఫీల్డ్ సిక్సర్‌తో 19 రన్స్ సమకూరాయి. అయితే తర్వాతి ఓవర్‌లోనే ఈ ఇద్దరూ వెనుదిరిగినా జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది.
యూపీ జోరు: స్వల్ప ఛేదనను ధాటిగా ఆరంభించిన యూపీ 15.4 ఓవర్లలో 143/4 స్కోరుతో నెగ్గింది. లెఫ్టామ్ స్పిన్నర్ తనూజ కన్వర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఓపెనర్ కిరణ్ నవ్‌గిరె (12) విఫలమైనా, కెప్టెన్ హీలీ (33) వేగంగా ఆడింది. తద్వారా తొలి వికెట్‌కు 4.3 ఓవర్లలోనే 42 పరుగులు జత చేరాయి. పవర్‌ప్లేలోనే ఈ ఇద్దరూ వెనుదిరిగినా జట్టు ఇబ్బందిపడలేదు. చమరి (17) నాలుగు ఫోర్లతో ఆకట్టుకుంది. చివర్లో హ్యారిస్, దీప్తి శర్మ (17 నాటౌట్) జోడీ తమ క్రితం మ్యాచ్ మాదిరే భారీ షాట్లతో చెలరేగుతూ తుదికంటా నిలిచి జట్టుకు ఘనవిజయాన్నందించారు.
సంక్షిప్త స్కోర్లు
గుజరాత్ జెయింట్స్: 20 ఓవర్లలో 142/5 (లిచ్‌ఫీల్డ్ 35, గార్డ్‌నర్ 30, వోల్వార్ట్ 28; ఎకెల్‌స్టోన్ 3/20);
యూపీ వారియర్స్: 15.4 ఓవర్లలో 143/4 (హ్యారిస్ 60 నాటౌట్, హీలీ 33, దీప్తి శర్మ 17 నాటౌట్; తనూజ 2/23).
Updated Date - Mar 02 , 2024 | 01:21 AM