భారత్ అదిరే బోణీ
ABN, Publish Date - Jul 20 , 2024 | 05:29 AM
మహిళల టీ20 ఆసియాక్‌పలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ టైటిల్ వేటను ఘనంగా ఆరంభించింది. పాకిస్థాన్‌తో ఆసక్తికరంగా సాగుతుందనుకున్న మ్యాచ్‌ను పూర్తి ఏకపక్షంగా మార్చేసింది. ముందుగా బౌలర్లు సమష్టిగా సత్తా చాటగా, ఓపెనర్లు స్మృతి మంధాన (45), షఫాలీ
పాక్‌పై ఘనవిజయం
మహిళల ఆసియాకప్
దంబుల్లా: మహిళల టీ20 ఆసియాక్‌పలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ టైటిల్ వేటను ఘనంగా ఆరంభించింది. పాకిస్థాన్‌తో ఆసక్తికరంగా సాగుతుందనుకున్న మ్యాచ్‌ను పూర్తి ఏకపక్షంగా మార్చేసింది. ముందుగా బౌలర్లు సమష్టిగా సత్తా చాటగా, ఓపెనర్లు స్మృతి మంధాన (45), షఫాలీ (40) మెరుపులు తోడవ్వడంతో.. శుక్రవారం గ్రూప్ ‘ఎ’లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 19.2 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. ఆరంభంలో సిద్రా అమీన్ (25), చివర్లో ఫాతిమా (22 నాటౌట్), తౌబా హుస్సేన్ (22) మాత్రమే ప్రభావం చూపారు. ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. స్పిన్నర్ దీప్తికి మూడు.. పేసర్లు రేణుకా సింగ్, పూజా వస్ర్తాకర్, స్పిన్నర్ శ్రేయాంకలకు రెండేసి వికెట్లు దక్కాయి.
ఆడుతూ.. పాడుతూ
స్వల్ప ఛేదనను భారత్ 14.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 109 పరుగులతో సునాయాసంగా ముగించింది. ఓపెనర్లు షఫాలీ, స్మృతి మంధాన నువ్వా.. నేనా? అనే రీతిలో సాగించిన ఎదురుదాడికి పాక్ బౌలర్లు చేసేదేమీ లేకపోయింది. ఈ జోడీ బౌండరీల బాదుడుకు పవర్‌ప్లేలో జట్టు 57 పరుగులు సాధించింది. ఆరంభంలో షఫాలీ జోరు చూపినా.. ఆ తర్వాత మంధాన బ్యాట్ ఝుళిపిస్తూ ఎనిమిదో ఓవర్‌లో ఏకంగా ఐదు ఫోర్లతో 21 పరుగులు రాబట్టింది. అయితే ఈ ఇద్దరే ఛేదనను పూర్తి చేస్తారనిపించినా.. లెగ్ స్పిన్నర్ అరూబ్ షా తన వరుస ఓవర్లలో మంధాన, షఫాలీ వికెట్లను తీసింది. దీంతో తొలి వికెట్‌కు 85 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరోవైపు హ్యాట్రిక్ ఫోర్లతో మురిపించిన హేమలత (14) 13వ ఓవర్‌లో వెనుదిరిగినా, అప్పటికి ఏడు పరుగులే అవసరం కావడంతో 35 బంతులుండగానే విజయం ఖాయమైంది.
సంక్షిప్త స్కోర్లు
పాకిస్థాన్: 19.2 ఓవర్లలో 108 ఆలౌట్. (సిద్రా అమీన్ 25, ఫాతిమా 22 నాటౌట్, తౌబా హుస్సేన్ 22; దీప్తి 3/20, రేణుకా 2/14, శ్రేయాంక 2/14, వస్త్రాకర్ 2/31).
భారత్: 14.1 ఓవర్లలో 109/3. (మంధాన 45, షఫాలీ 40; అరూబ్ షా 2/9).
Updated Date - Jul 20 , 2024 | 05:29 AM