Manu Bhakar : అదిగదిగో.. హ్యాట్రిక్
ABN, Publish Date - Aug 03 , 2024 | 06:23 AM
ఒక్క రోజులోనే ఎంత తేడా.. పతక రేసులో ఉన్న పలువురు అథ్లెట్లు గురువారం తీవ్రంగా నిరాశపర్చగా, 24 గంటలు గడవక ముందే ఇతర విభాగాల్లో భారత్ మెరుగైన ప్రదర్శన కొనసాగించింది. రెండు కాంస్యాలతో జోరు మీదున్న యువ షూటర్ మను భాకర్ తాజాగా
మూడో పతక రేసులో మను భాకర్
25మీ. పిస్టల్‌లో ఫైనల్‌కు.. నేడే తుదిపోరు
ఇషా సింగ్ అవుట్
ఆసీ్‌సపై భారత హాకీ జట్టు విజయం
ఒక్క రోజులోనే ఎంత తేడా.. పతక రేసులో ఉన్న పలువురు అథ్లెట్లు గురువారం తీవ్రంగా నిరాశపర్చగా, 24 గంటలు గడవక ముందే ఇతర విభాగాల్లో భారత్ మెరుగైన ప్రదర్శన కొనసాగించింది. రెండు కాంస్యాలతో జోరు మీదున్న యువ షూటర్ మను భాకర్ తాజాగా 25మీ. పిస్టల్ ఈవెంట్‌లోనూ శనివారం పతకం కోసం బరిలోకి దిగనుంది. అంతేకాదు.. ఒకే ఒలింపిక్స్‌లో మూడు ఈవెంట్లలోనూ ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించింది. అటు ఈ మెగా ఈవెంట్‌లో 52 ఏళ్ల తర్వాత భారత హాకీ జట్టు ఆసీస్‌పై గెలవగా, లక్ష్యసేన్ బ్యాడ్మింటన్‌లో సెమీస్‌కు చేరి సంచలనం సృష్టించాడు. మిక్స్‌డ్ డబుల్స్ ఆర్చరీలో మన జోడీ మెడల్ కోల్పోయినా.. సెమీస్‌కు చేరి రికార్డు నెలకొల్పింది.
పారిస్: యువ షూటర్ మను భాకర్ హ్యాట్రిక్ మెడల్‌పై గురిపెట్టింది. శుక్రవారం తాను పాల్గొన్న మూడో ఈవెంట్ అయిన 25మీ. పిస్టల్ క్వాలిఫికేషన్‌లో 590 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటికే ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు ఖాతాలో వేసుకున్న తొలి భారత అథ్లెట్‌గా చరిత్రకెక్కిన ఈ 22 ఏళ్ల యువ షూటర్ ఆ ఘనతను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలనుకుంటోంది. శనివారం జరిగే ఫైనల్లో తను ఇదే ప్రదర్శన కనబరిస్తే స్వర్ణమో, రజతమో ఖాయం కానుంది. అదే జరిగితే హ్యాట్రిక్ మెడల్స్‌తో భారత ఒలింపిక్ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పినట్టవుతుంది. 592 పాయింట్లతో హంగెరీ షూటర్ వెరోనికా మేజర్ తొలి స్థానంలో నిలిచింది. ఇది ఒలింపిక్ రికార్డు. మొదట ప్రిసిషన్ రౌండ్‌లో మను 97, 98, 99 స్కోరుతో 294 పాయింట్లు సాధించి టాప్-3లో నిలిచింది. ఆ తర్వాత ర్యాపిడ్‌లో తొలి సిరీ్‌సలో ఏకంగా 100 స్కోరు చేయగా.. అనంతరం 98, 98తో 296 పాయింట్లు దక్కించుకుని ద్వితీయ స్థానంలో నిలిచింది. మరోవైపు తెలంగాణ షూటర్ ఇషా సింగ్ పేలవ ఆటతీరుతో 581 పాయింట్లతో 18వ స్థానంతో ఇంటిముఖం పట్టింది.
షాట్‌గన్‌లో నిరాశ: భారత షాట్‌గన్ షూటర్ల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. పురుషుల స్కీట్ తొలి రోజు క్వాలిఫికేషన్‌లో అనంత్ జీత్ సింగ్ నరుక 68 పాయింట్లతో 26వ స్థానంలో నిలిచాడు. ఆరుగురు షూటర్లు ఫైనల్‌కు చేరేందుకు నేడు మరో రెండు క్వాలిఫికేషన్ రౌండ్లు ఆడాల్సి ఉంది.
23వ స్థానంలో పన్వర్
పురుషుల సింగిల్ స్కల్స్‌లో భారత రోవర్ బల్‌రాజ్ పన్వర్ తన ప్రస్థానాన్ని 23వ స్థానంతో ముగించాడు. ఇంతకుముందే పతక రౌండ్ నుంచి అవుటైన తను ఫైనల్ ‘డి’కి చేరాడు. 19-24 వర్గీకరణ మ్యాచ్ అయిన ఈ పోటీలో తను 7:02.37 టైమింగ్‌తో ఐదో స్థానంలో నిలవగలిగాడు.
వెనుకంజలో శుభాంకర్
పురుషుల వ్యక్తిగత విభాగంలో గోల్ఫర్ శుభాంకర్ శర్మ రెండో రౌండ్‌లో 25వ స్థానంలో కొనసాగుతున్నాడు. శని, ఆదివారాల్లో మరో రెండు రౌండ్లు జరగాల్సి ఉన్నాయి.
తులికా మన్ తొలి రౌండ్‌లోనే..
భారత్ నుంచి గేమ్స్‌లో పాల్గొంటున్న ఏకైక జుడోక తులికా మన్ పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. మహిళల +78కేజీ విభాగంలో క్యూబాకు చెందిన ఇడాలిస్ ఆర్టిజ్ చేతిలో తను 0-10 తేడాతో చిత్తుగా ఓడింది. కేవలం 28 సెకన్లలోనే ఈ మ్యాచ్ ముగియడం గమనార్హం.
ఫైనల్లో అల్కారజ్
ఒలింపిక్స్ టెన్నిస్‌లో ఫైనల్ చేరిన అతి పిన్న వయస్కుడిగా 21 ఏళ్ల స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కారజ్ చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టైటిళ్లు నెగ్గి ఊపుమీదున్న అల్కారజ్ విశ్వక్రీడల్లో పసిడి అందుకునేందుకు అడుగుదూరంలో నిలిచాడు. శుక్రవారం జరిగిన ఏకపక్ష సింగిల్స్ సెమీస్ పోరులో 6-1, 6-1తో ఫెలిక్స్ అగర్ అలియాస్సిమ్ (కెనడా)ను చిత్తుగా ఓడించి, స్వర్ణానికి అడుగు దూరంలో నిలిచాడు. ఆదివారం జరిగే ఫైనల్లో టాప్ సీడ్.. సెర్బియా దిగ్గజం జొకోవిచ్ లేదా ఇటలీ ప్లేయర్ లోరెంజో ముసెట్టితో అమీతుమీ తేల్చుకోనున్నాడు.
పారిస్‌లో నేటి భారతం
షూటింగ్: మహిళల స్కీట్ క్వాలిఫికేషన్ (తొలిరోజు): రైజా థిల్లాన్, మహేశ్వరి చౌహాన్ (మ. 12.30); మహిళల 25 మీటర్ల పిస్టల్ మెడల్ రౌండ్ : మను భాకర్ (మ. 1 గం.)
ఆర్చరీ: మహిళల వ్యక్తిగత విభాగం (1/8 ఎలిమినేషన్స్): దీపికా కుమారిగీ మిచెల్లె క్రాపెన్ (జర్మనీ) (మ. 1.50 గం.), భజన్ కౌర్ - దయానంద చౌరునీసా (ఇండోనేసియా) (మ. 2.05)
సెయిలింగ్: పురుషుల డింగీ రేసు 5, 6 : విష్ణు శరవణన్ (మ. 3.45); మహిళల డింగీ రేసు 5, 6 - నేత్ర కుమనన్ (సా. 5.55)
బాక్సింగ్: పురుషుల వెల్టర్ వెయిట్ క్వార్టర్‌ఫైనల్స్ : నిషాంత్ దేవ్ గీ మార్కో వెర్డె (మెక్సికో) (రా. 12.18).
క్యూ కడుతున్న ఆఫర్లు
ఒలింపిక్స్‌లో పతకం కొడితే క్రీడాకారులకు పేరు ప్రతిష్ఠలతో పాటు డబ్బు కూడా భారీస్థాయిలో వచ్చిపడుతుంది. ప్రైజ్‌మనీ రూపంలో కాదు గానీ.. పతక వీరులకు కోట్లు కుమ్మరించేందుకు వాణిజ్య సంస్థలు సిద్ధంగా ఉంటాయి. ఇప్పుడు షూటర్ మను భాకర్ పరిస్థితి కూడా ఇదే. ఏకంగా రెండు పతకాలతో చరిత్ర సృష్టించిన ఈ 22 ఏళ్ల షూటర్ కోసం పలు స్పాన్సరర్లు క్యూ కడుతున్నారు. తమ సంస్థకు ప్రచారకర్తగా ఉండాలంటూ ఇప్పటికే దాదాపు 40కిపైగా బ్రాండ్‌లు భాకర్‌ను సంప్రదించాయి. ఈ విషయాన్ని మను భాకర్ ఎండార్స్‌మెంట్లను పర్యవేక్షించే ఐఓఎస్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సీఈవో, ఎండీ నీరవ్ తోమర్ వెల్లడించారు. పారిస్ ఒలింపిక్స్‌కు ముందు ఒక్కో ఎండార్స్‌మెంట్‌కు రూ. 20 నుంచి 25 లక్షలు వసూలు చేసిన భాకర్‌కు ఇప్పుడు అంతకు ఆరురెట్లు అదనంగా అంటే దాదాపు ఒకటిన్నర కోటి నుంచి రూ. 2 కోట్లు ఇచ్చేందుకు సంస్థలు పోటీపడుతున్నాయని తోమర్ తెలిపారు.
Updated Date - Aug 03 , 2024 | 06:26 AM