అదిగదిగో సిరీస్
ABN, Publish Date - Feb 26 , 2024 | 03:50 AM
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు అనూహ్య మలుపులతో సాగుతోంది. తొలి రెండు రోజులు వెనుకబడిన టీమిండియా..
అదిగదిగో సిరీస్
సొంత గడ్డపై ఎక్కువ వికెట్లు (354) తీసిన భారత బౌలర్‌గా అశ్విన్. కుంబ్లే (350) రికార్డును అధిగమించాడు. అలాగే భారత్ తరఫున ఎక్కువసార్లు (35) 5+ వికెట్లు తీసి కుంబ్లేతో సమంగా నిలిచాడు. ఓవరాల్‌గా నాలుగో బౌలర్
భారత్ లక్ష్యం 192
ప్రస్తుతం 40/0
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 145
అశ్విన్‌కు 5, కుల్దీ్‌పనకు 4 వికెట్లు
భారత్ రెండో ఇన్నింగ్స్ 307
ధ్రువ్ జురెల్ శతకం మిస్
రాంచీ: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు అనూహ్య మలుపులతో సాగుతోంది. తొలి రెండు రోజులు వెనుకబడిన టీమిండియా.. ఆదివారం జూలు విదిల్చి, మ్యాచ్‌ను తమ గుప్పిట్లోకి తెచ్చుకుంది. ధ్రువ్ జురెల్ (90) అసామాన్య బ్యాటింగ్‌తో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్‌కు కేవలం 46 పరుగుల ఆధిక్యమే దక్కింది. ఆ తర్వాత బజ్‌బాల్ ఆటతో భారీ లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు ముందుంచాలనుకున్న ఇంగ్లండ్ ఆశలకు స్పిన్ ద్వయం అశ్విన్ (5/51), కుల్దీప్ (4/22) బ్రేకులు వేసింది. దీంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 53.5 ఓవర్లలో 145 పరుగులకే పరిమితమైంది. క్రాలే (60), బెయిర్‌స్టో (30) మాత్రమే ఆకట్టుకున్నారు. ఆ తర్వాత 192 పరుగుల ఛేదన బరిలోకి దిగిన భారత్ మూడో రోజు ముగిసేసరికి 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 40 రన్స్ చేసింది. ఓపెనర్లు రోహిత్ (24), జైస్వాల్ (16) క్రీజులో ఉండగా.. జట్టు సిరీస్ విజయానికి 152 పరుగుల దూరంలో ఉంది. ఆటకు ఇంకా రెండు రోజుల సమయం ఉండగా, చేతిలో పది వికెట్లున్న భారత్‌వైపే గెలుపు కనిపిస్తోంది.
జురెల్ పోరాటం: ఓవర్‌నైట్ స్కోరు 219/7తో ఆట ప్రారంభించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌కు మరో 88 పరుగులు జోడించడం విశేషం. కీపర్ జురెల్ తానాడుతున్న రెండో టెస్టులోనే పరిణతి చూపాడు. 96 బంతుల్లో 50 పరుగులు సాధించాక ఆటలో వేగం పెంచాడు. స్పిన్నర్లు బషీర్, హార్ట్‌లీ బంతులను సులువుగా ఆడేశాడు. 59 రన్స్ దగ్గర అతడిచ్చిన క్యాచ్‌ను రాబిన్సన్ వదిలేయగా, బషీర్ ఓవర్‌లో వరుసగా 4,6తో 90 రన్స్‌కు చేరువై సెంచరీ ఖాయమనిపించాడు. కానీ హార్ట్‌లీ అతడి ఆశలకు బ్రేక్ వేసి భారత్ ఇన్నింగ్స్‌ను కూడా ముగించాడు. అద్భుత సహకారమందించిన కుల్దీప్ (131 బంతుల్లో 28)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 76 రన్స్ జోడించిన జురెల్.. ఆకాశ్ (9)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు 40 రన్స్ జత చేయడంతో స్కోరు 300 దాటింది.
స్పిన్‌కు దాసోహం: జురెల్ ఇన్నింగ్స్‌తో తమ ఆధిక్యం తగ్గినా ఇంగ్లండ్ బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌ను వేగంగా ఆడాలని చూశారు. కానీ భారత స్పిన్నర్లు వారిని చెడుగుడు ఆడేశారు. అశ్విన్, కుల్దీ్‌పల ముప్పేట ధాటికి 25 పరుగుల వ్యవధిలోనే చివరి 6 వికెట్లను జట్టు కోల్పోయింది. ఓపెనర్ క్రాలే మాత్రమే ఆకట్టుకున్నాడు. కొత్త బంతితో అశ్విన్ మాయ చేస్తూ ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. డకెట్ (15), పోప్ (0)లను ఐదో ఓవర్‌లోనే వరుస బంతుల్లో అవుట్ చేసిన అశ్విన్..కాసేపటికే రూట్ (11) పనిబట్టాడు. అటు కుల్దీప్ దాడికి క్రాలే, స్టోక్స్ (4) పెవిలియన్ చేరడంతో రెండోసెషన్‌లోనే జట్టు 5 వికెట్లు కోల్పోయింది. బెయిర్‌స్టో దీటుగా ఆడినట్టు కనిపించినా అతడిని ఆఖరిసెషన్ ఆరంభంలోనే జడేజా అవుట్ చేశాడు. ఆ తర్వాత అశ్విన్, కుల్దీప్ మిగిలిన 4 వికెట్లను పంచుకోవడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది.
ఆంధ్ర లక్ష్యం 170
ప్రస్తుతం 95/4 ఫ మధ్యప్రదేశ్‌తో రంజీ
ఇండోర్: బౌలర్ల ఆధిపత్యం సాగుతున్న నేపథ్యంలో.. ఆంధ్ర, మధ్యప్రదేశ్ మధ్య జరుగుతున్న రంజీ క్వార్టర్స్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఎంపీ నిర్దేశించిన 170 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా.. మూడో రోజు ఆదివారం ఆట ముగిసేసరికి ఆంధ్ర రెండో ఇన్నింగ్స్‌లో 95/4 స్కోరు చేసింది. విజయానికి ఇంకా 75 పరుగుల దూరంలో ఉండగా.. చేతిలో 6 వికెట్లున్నాయి. విహారి (43), కర్ణ్ షిండే (5) క్రీజులో ఉన్నారు. కాగా, ఆంధ్ర బౌలర్లు నితీష్ (4/28), శశికాంత్ (3/20), లలి త్ (3/20) విజృంభించడంతో.. ఓవర్‌నైట్ స్కోరు 21/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన మధ్యప్రదేశ్ 107 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్ 62 రన్స్‌తో కలిపి ఎంపీ ఆధిక్యం మొత్తం 169 పరుగులకు చేరింది. తొలి ఇన్నింగ్స్‌లో ఎంపీ 234, ఆంధ్ర 172 రన్స్ చేశాయి.
4 గంటలు.. 140 ఓవర్లు
టెస్టుల్లో సరైన కీపర్ కోసం చూస్తున్న టీమిండియాకు ధ్రువ్ జురెల్ రూపంలో సమాధానం లభించినట్టయ్యింది. ఆడుతోంది రెండో టెస్టులోనైనా తన బ్యాటింగ్‌లో సాధికారత చూసిన మాజీలు, విశ్లేషకులు కూడా అబ్బురపడుతున్నారు. ఏకంగా అతడిని ధోనీతోనే పోలుస్తున్నారు. జట్టు విపత్కర పరిస్థితిలో ఉన్నప్పటికీ ఒత్తిడిని దరి చేరనీయకుండా టెయిలెండర్ల ఆసరాతో సాగించిన పోరాటం అపూర్వం. తద్వారానే భారత్ ఒక్కసారిగా ఈ టెస్టును శాసించే స్థితికి చేరింది. తొలి శతకాన్ని మిస్ చేసుకున్నా అప్పటికే ఇంగ్లండ్ ఆధిక్యాన్ని నామమాత్రం చేయడంలో విజయం సాధించాడు. అయితే ఈ ట్రాక్‌పై స్పిన్నర్లు బషీర్, హార్ట్‌లీని సులువుగా ఆడడం వెనుక అతడి కఠోర శ్రమ కూడా దాగి ఉంది. టెస్టు అరంగేట్రానికి ముందు టాలెగావ్‌లోని రాజస్థాన్ రాయల్స్ హెచ్‌పీసీ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. అక్కడ ఒకే రోజులో 140 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశాడట. విభిన్న స్పిన్ ట్రాక్‌లపై 4 గంటలపాటు ఏకధాటిగా బౌలర్లను ఎదుర్కొన్నాడట. ఇక, కార్గిల్ వార్‌లో పాల్గొన్న అనుభవమున్న తండ్రి మాదిరే.. తనయుడు జురెల్ కూడా అలాంటి మొక్కవోని పోరాటంతోనే ఇప్పుడు జట్టును ఆదుకోవడం విశేషం.
నాన్నకు సెల్యూట్
ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ నాలుగో టెస్టులో విలువైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అయితే మూడో రోజు ఆటలో కెరీర్‌లో తొలి అర్ధసెంచరీ చేశాక కూడా తను పెద్దగా సంబరాలు చేసుకోలేదు. కానీ తన తండ్రికి గౌరవంగా సెల్యూట్ చేయడం కనిపించింది. ఆ సమయంలో తను అలా ఎందుకు చేశాడో ఎవరికీ అర్థం కాలేదు. కానీ మ్యాచ్ ముగిశాక జురెల్ అసలు విషయం చెప్పాడు. ఈ యువ కీపర్ తండ్రి నేమ్‌చంద్ మాజీ సైనికుడు. 1999 కార్గిల్ వార్‌లోనూ పాల్గొన్నాడు. 2008లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఆయన గౌరవార్ధం సెల్యూట్ చేసినట్టు చెప్పాడు. తన అరం గేట్ర క్యాప్‌ను కూడా తండ్రికి అంకితమిస్తున్నట్టు రాంచీ టెస్టుకు ముందు ప్రకటించాడు.
స్కోరుబోర్డు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 353; భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) బషీర్ 73; రోహిత్ (సి) ఫోక్స్ (బి) అండర్సన్ 2; గిల్ (ఎల్బీ) బషీర్ 38; రజత్ (ఎల్బీ) బషీర్ 17; జడేజా (సి) పోప్ (బి) బషీర్ 12; సర్ఫరాజ్ (సి) రూట్ (బి) హార్ట్‌లీ 14; జురెల్ (బి) హార్ట్‌లీ 90; అశ్విన్ (ఎల్బీ) హార్ట్‌లీ 1; కుల్దీప్ (బి) అండర్సన్ 28; ఆకాశ్ (ఎల్బీ) బషీర్ 9; సిరాజ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 23; మొత్తం: 103.2 ఓవర్లలో 307 ఆలౌట్; వికెట్ల పతనం: 1-4, 2-86, 3-112, 4-130, 5-161, 6-171, 7-177, 8-253, 9-293, 10-307. బౌలింగ్: అండర్సన్ 18-4-48-2; రాబిన్సన్ 13-0-54-0; బషీర్ 44-8-119-5; హార్ట్‌లీ 27.2-6-68-3; రూట్ 1-0-1-0.
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలే (బి) కుల్దీప్ 60; డకెట్ (సి) సర్ఫరాజ్ (బి) అశ్విన్ 15; పోప్ (ఎల్బీ) అశ్విన్ 0; రూట్ (ఎల్బీ) అశ్విన్ 11; బెయిర్‌స్టో (సి) రజత్ (బి) జడేజా 30; స్టోక్స్ (బి) కుల్దీప్ 4; ఫోక్స్ (సి అండ్ బి) అశ్విన్ 17; హార్ట్‌లీ (సి) సర్ఫరాజ్ (బి) కుల్దీప్ 7; రాబిన్సన్ (ఎల్బీ) కుల్దీప్ 0; బషీర్ (నాటౌట్) 1; అండర్సన్ (సి) జురెల్ (బి) అశ్విన్ 0; మొత్తం: 53.5 ఓవర్లలో 145 ఆలౌట్; వికెట్ల పతనం: 1-19, 2-19, 3-65, 4-110, 5-120, 6-120, 7-133, 8-133, 9-145, 10-145; బౌలింగ్: అశ్విన్ 15.5-0-51-5; జడేజా 20-5-56-1; సిరాజ్ 3-0-16-0; కుల్దీప్ 15-2-22-4.
భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (బ్యాటింగ్) 24; జైస్వాల్ (బ్యాటింగ్) 16; మొత్తం: 8 ఓవర్లలో 40/0. బౌలింగ్: రూట్ 4-0-17-0; హార్ట్‌లీ 3-0-22-0; బషీర్ 1-0-1-0.
Updated Date - Feb 26 , 2024 | 03:50 AM