ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

T20 World Cup Winner India : కప్పు దరిచేరె.. విజేతగా వీడ్కోలు

ABN, Publish Date - Jun 30 , 2024 | 02:06 AM

ఉత్కంఠభరితంగా ముగిసిన టీ20 వరల్డ్‌క్‌ప ఫైనల్లో భారత్‌ చాంపియన్‌గా నిలిచింది.

భారత్‌ ఖాతాలో రెండో టీ20 ప్రపంచకప్‌

ఉత్కంఠ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం

విరాట్‌ అర్ధసెంచరీ

అదరగొట్టిన హార్దిక్‌, బుమ్రా జూ మలుపు తిప్పిన సూర్య క్యాచ్‌

ఓహ్‌ గాడ్‌.. ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మొత్తానికి 17 ఏళ్ల సుదీర్ఘ ఎదురుచూపులకు తెర పడింది. టన్నుల కొద్దీ టాలెంట్‌ ఉన్నా అందకుండా ఊరిస్తోన్న టీ20 టైటిల్‌ టీమిండియా దరి చేరింది. అజేయ ఆటతీరుతో దూసుకెళ్లిన రోహిత్‌ సేన అంతిమ సమరంలోనూ అదే సత్తా చూపింది. విరాట్‌ కోహ్లీ తన కెరీర్‌ చివరి టీ20లో ఫామ్‌ను చాటుకోగా.. బౌలర్లు ఒత్తిడికి లోనుకాకుండా తుదిపోరుకు చక్కటి ముగింపునిచ్చారు. ఓ మాదిరి ఛేదనలో క్లాసెన్‌ గుబులు రేపినా.. చివరి 5 ఓవర్లలో 30 పరుగులే ప్రత్యర్థికి కావాల్సి వచ్చినా భారత్‌ బెదరలేదు. స్టార్‌ పేసర్‌ బుమ్రా పరుగులను కట్టడి చేయగా.. ఐపీఎల్‌లో తీవ్ర విమర్శలకు గురైన హార్దిక్‌ నేటి ఫైనల్లో హీరోగా నిలిచాడు. క్లాసెన్‌ వికెట్‌తో పాటు చివరి ఓవర్‌లోనూ రెండు వికెట్లతో ప్రభావం చూపాడు. దీంతో గెలవాల్సిన చోట సఫారీలు తడబడగా.. ఒత్తిడికి లోనుకాని భారత్‌ విశ్వవిజేతగా త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది.

ఓటమన్నదే ఎరుగని అజేయ ప్రస్థానం..

రోహిత్‌ సేన అందించిన చరిత్రాత్మక విజయం..

హృదయం పులకించిన మధుర క్షణం..

బ్రిడ్జ్‌టౌన్‌: ఉత్కంఠభరితంగా ముగిసిన టీ20 వరల్డ్‌క్‌ప ఫైనల్లో భారత్‌ చాంపియన్‌గా నిలిచింది. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో రోహిత్‌ సేన 7 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో 2007 తర్వాత మరోసారి ఈ మెగా టోర్నీని కైవసం చేసుకున్నట్టయ్యింది. అలాగే 2011 తర్వాత ఏ ఫార్మాట్‌లోనైనా జట్టుకిదే తొలి వరల్డ్‌కప్‌. అటు మొదటిసారి ఐసీసీ టోర్నీలో ఫైనల్‌కు చేరిన దక్షిణాఫ్రికా విజయం అంచులవరకు వచ్చినా చివర్లో మ్యాచ్‌ను చేజార్చుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ (59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 76), అక్షర్‌ పటేల్‌ (31 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్సర్లతో 47), శివమ్‌ దూబే (16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 27) రాణించారు. కేశవ్‌, నోకియాలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసి ఓడింది. క్లాసెన్‌ (27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 52), స్టబ్స్‌ (31), డికాక్‌ (39), మిల్లర్‌ (21) రాణించారు. హార్దిక్‌కు మూడు.. బుమ్రా, అర్ష్‌దీ్‌పలకు రెండేసి వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా విరాట్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీ్‌సగా బుమ్రా నిలిచారు.


చివర్లో పేసర్ల కట్టడి: ఓ మాదిరి ఛేదనలో సఫారీలు క్లాసెన్‌, స్టబ్స్‌ ధాటికి విజయం వైపు సాగినా.. డెత్‌ ఓవర్లలో బుమ్రా, హార్దిక్‌ ధాటికి పూర్తిగా తేలిపోయారు. రెండో ఓవర్‌లో బుమ్రా కళ్లు చెదిరే బంతితో ఓపెనర్‌ హెన్‌డ్రిక్స్‌ (4)ను బౌల్డ్‌ చేయగా.. ఆ వెంటనే కెప్టెన్‌ మార్‌క్రమ్‌ (4)ను అర్ష్‌దీప్‌ వెనక్కి పంపాడు. 12 రన్స్‌కే రెండు వికెట్లు కోల్పోయిన దశలో ఓపెనర్‌ డికాక్‌కు స్టబ్స్‌ జత కలిశాడు. మరో ఆరు ఓవర్ల పాటు ఈ జోడీ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంది. కనీసం ఓ బౌండరీ ఉండేలా చూసిన వీరు స్కోరును సైతం పది పరుగుల రన్‌రేట్‌తో పరిగెత్తించారు. అయితే తొమ్మిదో ఓవర్‌లో స్వీప్‌ షాట్‌ కోసం వెళ్లి స్టబ్స్‌ బౌల్డయ్యాడు. అక్షర్‌ ఈ వికెట్‌ తీయడంతో మూడో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కాసేపటికే డికాక్‌ను అర్ష్‌దీప్‌ అవుట్‌ చేయడంతో మ్యాచ్‌ ఇరువైపులా మొగ్గు చూపింది. కానీ క్రీజులో హిట్టర్లు క్లాసెన్‌, మిల్లర్‌ ఉండడంతో పరుగుల వేటలో ఇబ్బంది పడలేదు.

స్పిన్నర్లు అక్షర్‌, కుల్దీ్‌పను లక్ష్యంగా చేసుకున్నారు. 14వ ఓవర్‌లో మిల్లర్‌ 4,6తో 14 రన్స్‌ రాబట్టగా.. 15వ ఓవర్‌లో క్లాసెన్‌ ఏకంగా 4,6,6,4తో 24 పరుగులు సమకూర్చడంతో సమీకరణం 30 బంతుల్లో 30 రన్స్‌కు మారింది. ఒక్కసారిగా మ్యాచ్‌ సఫారీల వైపు మొగ్గినట్టు కనిపించడంతో భారత్‌లో ఆందోళన నెలకొంది. అయితే చివరి నాలుగు ఓవర్లలో భారత బౌలర్లు చెలరేగారు. 16వ ఓవర్‌లో బుమ్రా 4 పరుగులే ఇవ్వగా.. 17వ ఓవర్‌లోనూ పాండ్యా నాలుగు పరుగులే ఇచ్చి ప్రమాదకర క్లాసెన్‌ వికెట్‌ తీయడంతో భారత్‌ శిబిరంలో సంబరాలు నెలకొన్నాయి. ఐదో వికెట్‌కు ఈ జోడీ 22 బంతుల్లోనే 45 పరుగులు జత చేసింది. ఓ సూపర్‌ ఇన్‌స్వింగర్‌కు జాన్సెన్‌ (2) వికెట్‌ తీసిన బుమ్రా 18వ ఓవర్‌లో 2 పరుగులే ఇచ్చాడు. ఈ దశలో 12 బంతుల్లో 20 రన్స్‌ కావాల్సి రావడంతో సఫారీలు ఒత్తిడిలో పడ్డారు. మిల్లర్‌ క్రీజులో ఉన్నా షాట్లు ఆడలేకపోయాడు. ఇక ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు అవసరమయ్యాయి. హార్దిక్‌ వేసిన వైడ్‌ ఫుల్‌ టాస్‌ను మిల్లర్‌ భారీ సిక్సర్‌గా మలిచే ప్రయత్నంలో సూర్య సూపర్‌ క్యాచ్‌తో వెనుదిరిగాడు. రబాడ (4) ఓ ఫోర్‌ సాధించినా ఐదో బంతికీ తను అవుటయ్యాడు. దీంతో భారత్‌ సంబరాలు ఆకాశాన్నంటాయి.

విరాట్‌-అక్షర్‌ నిలబెట్టారు..: బంతి నేరుగా బ్యాట్‌పైకి వస్తుందన్న అంచనాతో టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. కానీ ఆరంభంలో బౌలర్లకు పట్టు లభించడంతో 34 పరుగులకే రోహిత్‌ (9), పంత్‌ (0), సూర్యకుమార్‌ (3)ల వికెట్లను కోల్పోయిన జట్టు షాక్‌కు గురైంది. కానీ పేలవ ఫామ్‌తో నిరాశపరుస్తున్న విరాట్‌ కోహ్లీ విలువైన ఇన్నింగ్స్‌తో అండగా నిలవగా.. హిట్టర్‌ పాత్రలో అక్షర్‌ సహకరించాడు. దీంతో సఫారీల ముందు జట్టు సవాల్‌ విసిరే స్కోరును ఉంచింది. రెండో ఓవర్‌లోనే స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌.. రోహిత్‌, పంత్‌ల వికెట్లు తీశాడు. ఇక ఐదో ఓవర్‌లో సూర్యను రబాడ కట్టడి చేశాడు. వాస్తవానికి తొలి ఓవర్‌లోనే కోహ్లీ మూడు ఫోర్లతో 15 రన్స్‌ అందించి జోష్‌ను నింపినా.. ఆ తర్వాత వికెట్ల పతనంతో అతడితో పాటు అక్షర్‌ జాగ్రత్తగా ఆడాల్సి వచ్చింది. మధ్య ఓవర్లలో పేసర్లు జాన్సెన్‌, నోకియా రన్స్‌ను నియంత్రించారు. అయితే అడపాదడపా అక్షర్‌ సిక్సర్లతో స్కోరులో కాస్త కదలిక కనిపించింది. కానీ 14వ ఓవర్‌లో లేని పరుగు కోసం వెళ్లిన అక్షర్‌ దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. దీంతో నాలుగో వికెట్‌కు 72 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. వచ్చీ రాగానే దూబే సిక్సర్‌తో ఆకట్టుకోగా.. అటు నెమ్మదిగా ఆడుతూ వచ్చిన విరాట్‌ 48 బంతుల్లో ఫిఫ్టీ పూర్తయ్యాక జోరు పెంచాడు. 18వ ఓవర్‌లో 6,4తో 16 రన్స్‌ రాగా.. తర్వాతి ఓవర్‌లో 4,2,6తో 12 రన్స్‌ అందించి జాన్సెన్‌కు చిక్కాడు. అప్పటికే దూబేతో కలిసి ఐదో వికెట్‌కు 33 బంతుల్లో 57 పరుగులు జత చేశాడు. అయితే చివరి ఓవర్‌లో దూబే, జడేజా (2) వికెట్లను తీసిన నోకియా 9 పరుగులే ఇవ్వడంతో భారత స్కోరు 180లోపే ముగిసింది.

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. భారత జట్టు విశ్వవిజేతగా ఆవిర్భవించి దేశ క్రికెట్‌ ఫ్యాన్స్‌ అంతా ఆనందోత్సాహాల్లో మునిగిన వేళ.. 35 ఏళ్ల విరాట్‌ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల నుంచి తక్షణమే వైదొలుగుతున్నట్టు ప్రపంచ కప్‌ ఫైనల్‌ ముగిసిన క్షణాన ప్రకటించాడు. 59 బంతుల్లో 76 పరుగులు చేసి టీమిండియా విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించిన కోహ్లీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ‘నేను ఆశించింది ఈ వరల్డ్‌ కప్పే. అది అందుకున్నా. దాంతో ఇదే నా చివరి మ్యాచ్‌’ అని అవార్డుల ప్రదాన కార్యక్రమానికి ముందు మాట్లాడుతూ విరాట్‌ వెల్లడించాడు. ‘మనం పరుగులు సాధించలేమని భావించే రోజు ఒకటి వస్తుంది. భగవంతుడు గొప్పవాడు. రిటైర్మెంట్‌ ప్రకటించడానికి ఇంతకు మించిన తరుణం లేదు’ అని కోహ్లీ అన్నాడు.

1292

టీ20 ప్రపంచకప్‌లో విరాట్‌ కోహ్లీ చేసిన మొత్తం పరుగులు. టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

281

ఈ వరల్డ్‌కప్‌లో రహ్మనుల్లా గుర్బాజ్‌ (అఫ్ఘానిస్థాన్‌) చేసిన పరుగులు. ఈ టోర్నీలో అత్యధిక పరుగుల వీరుడు ఇతనే.

98

నికోలస్‌ పూరన్‌ (వెస్టిండీస్‌) వ్యక్తిగత స్కోరు ఇది. ఈ టోర్నీలో అత్యధిక వ్యక్తిగత స్కోరర్‌ ఇతనే.

17

ఫజల్‌ ఫరూఖి (అఫ్ఘానిస్థాన్‌) , అర్ష్‌దీప్‌ పడగొట్టిన వికెట్లు. టోర్నీలో అత్యధిక వికెట్ల వీరులుగా నిలిచారు.

5/9

ఫరూఖి బౌలింగ్‌ గణాంకాలు. అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన ఇతనిదే.

8

టోర్నీలో భారత్‌ గెలిచిన మ్యాచ్‌లు. అత్యధిక విజయాలు ఈ జట్టువే.

26

ట్రావిస్‌ హెడ్‌ (ఆస్ట్రేలియా) కొట్టిన ఫోర్లు. ఈ టోర్నీలో అత్యధిక ఫోర్లు ఇతనివే. ఇబ్రహీం జద్రాన్‌ (25), రోహిత్‌ శర్మ (22) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

17

నికోలస్‌ పూరన్‌ బాదిన సిక్సర్లు. ఈ టోర్నీలో అత్యధిక సిక్సర్ల వీరునిగా నిలిచాడు. గుర్బాజ్‌ (16), రోహిత్‌ శర్మ (15), హెడ్‌ (15)లది తర్వాతి స్థానం.

3

ఈ టోర్నీలో రోహిత్‌ శర్మ అత్యధికంగా మూడు అర్ధ సెంచరీ (7 మ్యాచుల్లో)లు సాధించాడు.

134

ఉగాండాపై వెస్టిండీస్‌ గెలిచిన పరుగుల తేడా. పరుగుల పరంగా ఓ జట్టుకు భారీ విజయం ఇదే.

10

అమెరికాపై ఇంగ్లండ్‌ గెలిచిన వికెట్ల తేడా. వికెట్ల పరంగా ఇదే భారీ గెలుపు.

218/5

అఫ్ఘానిస్థాన్‌పై వెస్టిండీస్‌ చేసిన ఈ స్కోరు ఈ టోర్నీలో ఓ జట్టుకు అత్యధికం.

39

వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఉగాండా చేసిన ఈ స్కోరు టోర్నీ చరిత్రలోనే అత్యల్పం.


డబ్బే డబ్బు

మొత్తం ప్రైజ్‌మనీ: రూ. 93.78 కోట్లు

చాంపియన్‌కు : రూ. 20.42 కోట్లు

రన్నరప్‌కు : రూ. 10.67 కోట్లు

సెమీస్‌లో ఓడిన జట్టుకు : రూ. 6.56 కోట్లు

సూపర్‌-8 పరాజితులకు : రూ. 3.18 కోట్లు

9 నుంచి 12వ స్థానం జట్లకు : రూ. 2.06 కోట్లు

13 నుంచి 20వ స్థానం జట్లకు: రూ. 1.87 కోట్లు

ఒక్కో మ్యాచ్‌కు: రూ. 25.97 లక్షలు

1 : టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌లో అత్యధిక స్కోరు (176) నమోదు చేసిన జట్టుగా భారత్‌.

ఒక్క మ్యాచ్‌ కోల్పోకుండా టీ20 వరల్డ్‌క్‌పను అందుకున్న జట్టుగా భారత్‌

2 : ఒకే వరల్డ్‌క్‌పలో ఎక్కువ రన్స్‌ (243) చేసిన సౌతాఫ్రికా బ్యాటర్‌గా డికాక్‌

వరల్డ్‌కప్‌ చరిత్రలో నెమ్మదైన హాఫ్‌ సెంచరీ (48 బంతుల్లో) సాధించిన రెండో భారత బ్యాటర్‌గా కోహ్లీ. సూర్య (49) ముందున్నాడు.

విరాట్‌ టీ20 కెరీర్‌ ఇలా..

మ్యాచ్‌లు 125

ఇన్నింగ్స్‌ 117

పరుగులు 4188

అత్యధిక స్కోరు 122గి

సెంచరీలు 1

అర్ధ సెంచరీలు 38

సగటు 48.69

స్ట్రయిక్‌ రేట్‌ 137.04

స్కోరుబోర్డు

భారత్‌: రోహిత్‌ (సి) క్లాసెన్‌ (బి) మహరాజ్‌ 9, విరాట్‌ (సి) రబాడ (బి) జాన్సెన్‌ 76, పంత్‌ (సి) డికాక్‌ (బి) మహరాజ్‌ 0, సూర్యకుమార్‌ (సి) క్లాసెన్‌ (బి) రబాడ 3, అక్షర్‌ (రనౌట్‌) డికాక్‌ 47, దూబే (సి) మిల్లర్‌ (బి) నోకియా 27, హార్దిక్‌ (నాటౌట్‌) 5, జడేజా (సి) మహరాజ్‌ (బి) నోకియా 2, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 20 ఓవర్లలో 176/7; వికెట్ల పతనం: 1-23, 2-23, 3-34, 4-106, 5-163, 6-174, 7-176; బౌలింగ్‌: జాన్సెన్‌ 4-0-49-1, మహరాజ్‌ 3-0-23-2, రబాడ 4-0-36-1, మార్‌క్రమ్‌ 2-0-16-0, నోకియా 4-0-26-2, షంసి 3-0-26-0.

దక్షిణాఫ్రికా: హెన్‌డ్రిక్స్‌ (బి) బుమ్రా 4, డికాక్‌ (సి) కుల్దీప్‌ (బి) అర్ష్‌దీప్‌ 39, మార్‌క్రమ్‌ (సి) పంత్‌ (బి) అర్ష్‌దీప్‌ 4, స్టబ్స్‌ (బి) అక్షర్‌ 31, క్లాసెన్‌ (సి) పంత్‌ (బి) హార్దిక్‌ 52, మిల్లర్‌ (సి) సూర్య (బి) హార్దిక్‌ 21, జాన్సెన్‌ (బి) బుమ్రా 2, మహరాజ్‌ (నాటౌట్‌) 2, రబాడ (సి) సూర్య (బి) హార్దిక్‌ 4, నోకియా (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 20 ఓవర్లలో 169/8; వికెట్ల పతనం: 1-7, 2-12, 3-70, 4-106, 5-151, 6-156, 7-161, 8-168; బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 4-0-20-2, బుమ్రా 4-0-18-2, అక్షర్‌ 4-0-49-1, కుల్దీప్‌ 4-0-45-0, హార్దిక్‌ 3-0-20-3, జడేజా 1-0-12-0.

Updated Date - Jun 30 , 2024 | 05:57 AM

Advertising
Advertising