ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మేం గేట్లు తెరిస్తే బీఆర్‌ఎస్‌ ఖాళీ!

ABN, Publish Date - Mar 12 , 2024 | 04:40 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంటే చూడలేక కేసీఆర్‌ కుటుంబం అంతా శాపనార్ధాలు పెడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగుతుందా? అని ప్రశ్నించారు. సోమవారం ఆయన మంత్రివర్గ సహచరులతో కలిసి భద్రాద్రి

పార్టీలో మిగిలేది కేసీఆర్‌ కుటుంబమే

నాడు మీ ఎమ్మెల్యేలనే సీఎం కలవలేదు.. నేడు విపక్షాన్నీ కలుస్తున్నాం

ప్రభుత్వానికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే అండ.. కాపాడుకుంటాం అంటున్నారు

పేడిమూతోడు.. దూలం లెక్క పెరిగినోడు.. కాళేశ్వరాన్ని కూల్చారు

కేసీఆర్‌ ఒక చార్లెస్‌ శోభరాజ్‌.. అంతర్జాతీయంగా రాష్ట్రం పరువు తీశాడు

బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటై వస్తే తెలంగాణ ప్రజలు చెప్పుతో కొడతారు

మణుగూరు ‘ప్రజాదీవెన’ సభలో సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు

మీరు ఇళ్లు కట్టించిన చోటే ఓట్లడగండి.. కేసీఆర్‌, మోదీలకు రేవంత్‌ సవాల్‌

‘డబుల్‌’ పేరుతో ఓట్ల వ్యాపారం.. మోసాన్ని గ్రహించి ప్రజలు బొంద పెట్టారు

ఇంటి స్థలం ఉంటే 5 లక్షల సాయం.. ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు: రేవంత్‌

ఐదో గ్యారెంటీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకానికి శ్రీకారం

యాదాద్రి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం.. సీఎం రేవంత్‌ దంపతులు హాజరు

ఖమ్మం, భద్రాచలం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంటే చూడలేక కేసీఆర్‌ కుటుంబం అంతా శాపనార్ధాలు పెడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగుతుందా? అని ప్రశ్నించారు. సోమవారం ఆయన మంత్రివర్గ సహచరులతో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. భద్రాచలంలో పార్టీ ఆరు గ్యారెంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభించారు. అనంతరం మణుగూరులో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ ప్రజాదీవెన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో కేసీఆర్‌ కుటుంబంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయాలంటూ సిగ్గు లేకుండా తమకు నీతులు చెబుతున్న కేటీఆర్‌ వారి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పదేళ్లయినా అమలు కాని విషయాన్ని ఏనాడైనా ఆలోచించాడా? అని సీఎం ఎద్దేవా చేశారు. ‘‘అరే సన్నాసీ... పేడి మూతి బోడిలింగం గాడివి, నువ్వూ నీ బావ ఇద్దరూ బిల్లా రంగాలే. పేడిమూతోడు శానా మాట్లాడుతుండు. అరే సన్నాసీ మళ్లీ చెబుతున్నా. బీఆర్‌ఎస్‌ అంటే బిల్లా రంగా సమితేరా. మీ అయ్య చార్లెస్‌ శోభరాజేరా. రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో పరువు తీసిండ్రా’’ అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. హరీశ్‌రావు దూలం లెక్క పెరిగిండు కానీ దూడకు ఉన్న బుద్ది కూడా లేదంటూ విమర్శించారు. బిల్లా రంగాలు తోడు దొంగలుగా మారి కాళేశ్వరాన్ని కూల్చేశారని, మేడిగడ్డ మేడిపండైందని, అన్నారం పగిలిందని, సుందిళ్ల సంకనాకిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ హయాంలో రాజీవ్‌సాగర్‌, ఇందిరాసాగర్‌ అని ప్రాజెక్టులు కడితే సీతారామ అని పేరు మార్చి, కోట్లు కొల్లగొట్టి, ఖమ్మం జిల్లాకు తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని, ఇద్దరూ ఒక్కటై కాంగ్రె్‌సను ఓడించాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అందుకే, బీజేపీ తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే ఆ తొమ్మిది స్థానాల్లో బీఆర్‌ఎస్‌ ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదని ప్రస్తావించారు. బీఆర్‌ఎస్‌ నాలుగు చోట్ల అభ్యర్థులను ప్రకటిస్తే ఆ నాలుగు చోట్ల బీజేపీ వాళ్లు ఇంతవరకు అభ్యర్థులను ప్రకటించలేదన్నారు. పరస్పరం పోటీ లేకుండా అభ్యర్థులను ప్రకటిస్తున్న రెండు పార్టీల తీరే కాంగ్రె్‌సను ఓడించేందుకు వీళ్లిద్దరూ కుమ్మక్కయ్యారనడానికి నిదర్శనమని చెప్పారు. మీ మధ్య పొత్తు లేకుంటే ఖమ్మంలో ఇంకా ఎందుకు నామా నాగేశ్వర్‌రావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేదని, మహబూబాద్‌లో మాలోతు కవితను, కీలకమైన మెదక్‌లో అభ్యర్థిని ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. నిజామాబాద్‌లో కేసీఆర్‌ కూతురికి టికెటిస్తే ఓటర్లు బండకేసి కొడతారని అనుమానం వచ్చిందా? అన్నారు. రెండు పార్టీలూ కలిసి కనిపిస్తే తెలంగాణ ప్రజలు చెప్పుతో కొడతారన్నారు. చీకట్లో ఒప్పదం చేసుకుని మోదీ కేసీఆర్‌లు అలాయ్‌ బలాయ్‌ చేసుకుంటున్నారని, కాంగ్రెస్‌ పార్టీపై కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యంలో పథకాలు స్పష్టంగా అమలు చేస్తున్న తరుణంలో 14 సీట్లలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ రోజుకోసారి అంటున్నారని, ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో ఎలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారో చెప్పాలని నిలదీశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే చాలామంది రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారని అన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు గత పదేళ్లలో ముఖ్యమంత్రిని కలిసే భాగ్యం కలగలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక మంత్రులు, ముఖ్యమంత్రి సహా అందరం అందరికీ అందుబాటులో ఉంటున్నామని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఐదేళ్లు కాపాడే బాధ్యత తమదేనని తనను కలిసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే చెబుతున్నారని ప్రస్తావించారు. తాను అనుకుని గేట్లు తెరిస్తే కేసీఆర్‌ కుటుంబం తప్ప ఆ పార్టీలో ఎవరూ మిగలరని, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ కండువా కప్పుకొని ఇందిరమ్మ రాజ్యానికి అండగా నిలబడతారని చెప్పారు.

తాము రాజనీతితో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నామని, అనవసరంగా తమతో గోక్కోవద్దని, గోక్కున్న వారు ఎవరూ బాగు పడలేదని రేవంత్‌రెడ్డి హితవు చెప్పారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ఎక్కడుందని అన్నారని, నిజానికి కాంగ్రె్‌సకు కార్యకర్తలే వేయి ఏనుగుల బలమని సీఎం వ్యాఖ్యానించారు. కార్యకర్తలకు ఎవరు అడ్డం వచ్చినా పండబెట్టి తొక్కే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే హామీ ఇచ్చిన పథకాలు అమలు చేస్తున్నామని, 30 వేల ఉద్యోగాలు అందించామని ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమానికి అరవై ఏళ్ల క్రితమే ఊపిరి పోసింది ఖమ్మం జిల్లా అని రేవంత్‌ కొనియాడారు. మాట తప్పని సోనియమ్మ తెలంగాణ బిడ్డల ఆకాంక్షను నెరవేర్చారని, చైతన్యం కలిగిన ఖమ్మం ప్రజలు మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె్‌సకే పట్టం కట్టారని ప్రశంసించారు. అందుకే జిల్లాకు మూడు మంత్రి పదవులు, ఒక రాజ్యసభ పదవి వరించాయని ప్రస్తావించారు. మన్మోహన్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన బలరాంనాయక్‌ను మహబూబాబాద్‌ ఎంపీగా లక్షన్నర మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ నేత పువ్వాడ అజయ్‌ మీదా రేవంత్‌ విరుచుకుపడ్డారు. ‘‘మీ జిల్లాలో ఒక చప్రాసి ఉండూ... ఒంటికన్ను శివరాసన్‌ ఏడున్నాడు? బాగా నీలిగిండు. మా కార్యకర్తలపై అనేక కేసులు పెట్టించిండు’’ అన్నారు.

ఇందిరమ్మ ఇల్లులేని ఊళ్లో ఓట్లడగం

గత పదేళ్ల పాలనలో కేసీఆర్‌, మోదీలు పేదలకు ఇళ్లిస్తామని చెప్పి మోసం చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. డబుల్‌ బెడ్రూం పథకం కింద కేసీఆర్‌ ఇళ్లు కట్టించిన ఊళ్లలో, పీఎంఏవై పథకం కింద మోదీ ఇళ్లు కట్టించిన ఊళ్లలో తాము ఓట్లు అడగబోమని, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన గ్రామాల్లో ఆ రెండు పార్టీల వారు ఓట్లు అడక్కుండా ఉండాలని రేవంత్‌రెడ్డి సవాలు విసిరారు. ఐదో గ్యారెంటీ రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు పథకానికి సోమవారం భద్రాచలంలో రేవంత్‌ శ్రీకారం చుట్టారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, సీతక్కలు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రేవంత్‌ మాట్లాడుతూ, పేదలకు ఇల్లు అనేది ఆత్మగౌరవంతో కూడుకున్నదని చెప్పారు. అందుకే, తమ ప్రభుత్వం పేదలకు సొంత ఇల్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం కింద రూ.22,500 కోట్లతో నాలుగున్నర లక్షల ఇళ్లు నిర్మించబోతున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల హక్కు పత్రాలు కూడా ఆడబిడ్డల పేరుతోనే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇల్లు లేని పేదలకు సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం అందిస్తామని అన్నారు. లబ్ధిదారులు ఎస్సీ, ఎస్టీలయితే రూ.6 లక్షలు ఇస్తామని చెప్పారు. గత పదేళ్లలో డబుల్‌ బెడ్రూం ఇళ్ల పేరుతో కేసీఆర్‌ ఓట్ల వ్యాపారం చేశారని రేవంత్‌ వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇళ్లపై హేళనగా మాట్లాడారని ప్రస్తావించారు. డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కట్టుకుంటే కూతురు, అల్లుడొస్తే ఇబ్బంది ఉండదు అంటూ కట్లు కథలు చెప్పి మోసం చేసి గెలిచారన్నారు. పేదలకు మాత్రం ఇళ్లు ఇవ్వలేదన్నారు. అందుకే, ప్రజలు కేసీఆర్‌ ప్రభుత్వాన్ని బొందపెట్టి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారని రేవంత్‌ వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా ప్రజలు కేసీఆర్‌ను ఎప్పుడూ నమ్మలేదన్నారు. ఆయన్ని దూరంగానే పెట్టారని ప్రస్తావించారు. గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కో సీటు మాత్రమే వచ్చిందన్నారు. ఏపీలో ఉన్న ఐదు గ్రామాల విలీనం సమస్యతో పాటు గోదావరి వరద వస్తే భద్రాచలం పట్టణంలోకి వరద వస్తున్న సమస్యను, ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. వీటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని సభాముఖంగా హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన 48 గంట ల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని, పేదలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం ప్రకటించామని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల వ్యవధిలోనే రూ.500 సిలిండర్‌ పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. పేదలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు అందించామని, ఇందిరమ్మ ఇళ్లు కూడా కట్టించి చూపిస్తామని చెప్పారు. కేసీఆర్‌, మోదీలా అబద్దాల హామీలకే పరిమితం కాబోమని, వీటికోసం బ డ్జెట్లో నిధులు కేటాయిస్తామని ప్రకటించారు.. 2022 నాటికి పేదలందరికి ఇల్లు ఇస్తామని చెప్పి బీజేపీ మో సం చేసిందన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చి అప్పుల్లోకి నెట్టిన ఘనత కూడా మోదీదేనని వ్యాఖ్యానించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని మోదీ నెరవేర్చి ఉంటే పదేళ్లలో రాష్ట్రాని కి రూ.70 లక్షల ఉద్యోగాలు వచ్చి ఉండేవన్నారు. సీఎం, సహచర మంత్రులు కలిసి లబ్ధిదారులకు రూ.5 లక్షల చొప్పున చెక్కుతో ఇళ్ల మంజూరు హక్కు పత్రాలు అందజేశారు.

సంపదను పెంచుతాం.. పేదలకు పంచుతాం: భట్టి

ప్రతీ పేదవాడికి ఇల్లు అందించాలన్న లక్ష్యంతో రామయ్య సాక్షిగా సోమవారం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన సందర్భం స్వర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాదీవెన సభలో ఆయన మాట్లాడారు. భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టు ప్రభుత్వానికి భారం కాబోతోందని వ్యాఖ్యానించారు. సంపదను పెంచి పేదలకు పంచుతామనీ ఎన్నికల ముందే చెప్పామని అది తప్పకుండా పాటిస్తామని ప్రకటించారు.

Updated Date - Mar 12 , 2024 | 04:40 AM

Advertising
Advertising